ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు..తిరుపతన్నల రిమాండ్‌

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్న

ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు..తిరుపతన్నల రిమాండ్‌
  • కస్టడీకి పోలీసుల ప్రయత్నం
  • ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులపై ఎఫ్‌ఐఆర్‌
  • లుక్‌అవుట్ నోటీస్‌ల జారీ


విధాత : అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నలతో పాటు కస్టడి ముగిసిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులను అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం నాంపల్లి 14వ మెజిస్ట్రేట్ కన్నయ్య లాల్ ఎదుట హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

భుజంగరావు ఎన్నికల ముందు వరకు ఎస్‌ఐబీలో పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్ అవుట్‌ సర్క్యులర్ జారీ చేశారు. శుక్రవారం రాత్రే ముగ్గురి నివాసాల్లో సోదాలు జరిపి అనంతరం విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ కుమార్ ఇంట్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.


ప్రభాకర్ రావు, రాధా కిషన్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసి విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో ఏ1గా ప్రభాకర్‌రావు, ఏ2గా ప్రణీత్‌రావు, ఏ3గా రాధాకిషన్‌, ఏ4గా భుజంగరావు, ఏ5గా తిరుపతన్న, ఏ6గా శ్రవణ్‌ల పేరు నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాల కథనం.

ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వసంతో ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటుంది. ముందుగా ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వరకే పరిమితమయ్యారని భావించినప్పటికి వ్యాపారులు, కంట్రాక్టర్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వందల కోట్ల అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా కూడా తెలిసిరావడంతో కేసు మరో మలుపు తిరిగింది. రాష్ట్రంలో ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ప్రభాకర్ రావు, రాధా కిషన్ లు చెప్తేనే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్‌రావు వెల్లడించాడు. ట్యాపింగ్‌ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు అందించినట్లుగా ప్రణీత్‌రావు విచారణలో వెల్లడించారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్‌రావు కు ఇచ్చి ట్యాపింగ్ చేయమని ప్రభాకర్ రావు, రాధా కిషన్లు ఆదేశించారు.

అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు, అతని మిత్రుల ఫోన్లను ప్రభాకర్‌రావు ట్యాప్ చేయించారు. రేవంత్ రెడ్డి సంబంధించిన ప్రతి సమాచారాన్నిప్రణీత్‌రావు ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు చేరవేశాడు. ట్యాపింగ్ కోసం రష్యా, ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన ట్యాపింగ్ పరికరాలతో కూడిన వ్యాన్‌ను రేవంత్‌రెడ్డి నివాసం సమీపంలో పార్క్ చేసి ప్రణీత్‌రావు టీమ్ ట్యాపింగ్‌కు పాల్పడింది. అదే రీతిలో ఎవరి ఫోన్లను ట్యాప్ చేయాల్సివున్న వారి నివాసాల సమీపంలో మోహరించి ట్యాపింగ్‌కు పాల్పడినట్లుగా ప్రణీత్‌రావు విచారణలో వెల్లడించారు. ప్రణీత్‌రావు నుంచి కేసులో కీలకమైన సమాచారం రావడంతో ఈ టీమ్‌లో పనిచేసిన భుజంగరావు, తిరుపతన్నలను కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాలని పంజాగుట్ట పోలీసులు నిర్ణయించారు. అలాగే ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లను గుర్తించి వాటి నుంచి కూడా డేటా రికవరి చేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. భుజంగరావు, తిరుపతన్నల విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశముందని పోలీసులు నమ్ముతున్నారు.