కొత్త రాజ్యాంగ రచన.. దేశాన్ని నిలువునా చీల్చుతుంది: ఫాలి నారిమన్‌

కొత్త రాజ్యాంగ రచన.. దేశాన్ని నిలువునా చీల్చుతుంది: ఫాలి నారిమన్‌
  • కొత్త రాజ్యాంగ రచనపై ఫాలి నారిమన్‌
  • 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు మళ్లీ
  • నానాటికి సహనం నశించి పోతున్నది
  • దేశానికి ప్రశ్నించే ప్రతిపక్షం అవసరం
  • అప్పుడే ప్రజలు సరైంది ఎంచుకుంటారు
  • సంకీర్ణ ప్రభుత్వాలే దేశానికి మంచివి
  • వైర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వ్యాఖ్యలు



న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని పునర్లిఖించడమంటే దేశాన్ని నిట్టనిలువునా చీల్చడమే అవుతుందని విఖ్యాత న్యాయకోవిదుడు ఫాలి నారిమన్‌ హెచ్చరించారు. దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇటీవల నారిమన్‌ రచించిన ‘యూ మస్ట్‌ నో యువర్‌ కాన్‌స్టిట్యూషన్‌’ అనే పుస్తకం ప్రచురణ నేపథ్యంలో వైర్‌కు చెందిన ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌ థాపర్‌ ఆయనను ఇంటర్వ్యూ చేశారు.


దాదాపు 50 నిమిషాలపాటు సాగిన ఆ ఇంటర్వ్యూలో కొత్త రాజ్యాంగం రూపొందించాలన్న వాదనలు, దేశంలో ప్రస్తుత పరిస్థితులు, జమిలి ఎన్నికలు, నానాటికి పెరిగిపోతున్న అసహనం, న్యాయ, అధికార వ్యవస్థల మధ్య సంబంధాల్లో మార్పులు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర, పార్లమెంటు పనితీరు తదితర విషయాలపై తన అభిప్రాయాలను నారిమన్‌ పంచుకున్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 1975లో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఉన్నాయని, కాకపోతే వాటికి ముసుగు కప్పి ఉన్నదని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఇప్పుడున్న ముస్లిం వ్యతిరేకత, మైనారిటీ వ్యతిరేకత లేవని చెప్పారు.


ఇలాంటి రాజ్యాంగాన్ని మళ్లీ రాయలేం


బ్రిటిష్‌వారు దేశాన్ని వదిలి పోయిన తర్వాత రాజ్యాంగాన్ని లిఖించుకునే సమయంలో దేశం పేరు ఎలా ఉండాలన్న చర్చ జరిగిందని, దేశానికి ఉమ్మడి భాష అంటూ ఏదీ లేనందున ఉన్న హిందీ, ఇంగ్లిష్‌లను ఎంచుకున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఇండియా దటీజ్‌ భారత్‌.. అని పేర్కొన్నారని చెప్పారు. రాజ్యాంగం ఒక జీవిక అని అన్నారు. అమెరికా రాజ్యాంగం 19 20 ఏళ్లకు మించి ఉండలేదని అనుకున్నారని, కానీ 200 ఏళ్లుగా అది కొనసాగుతున్నదని తెలిపారు. మన రాజ్యాంగం 75 ఏళ్లుగా అమల్లో ఉన్నదని, ఇలానే కొనసాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి రాజ్యాంగాన్ని మనం పునర్లిఖించుకోలేమని స్పష్టం చేశారు.


జమిలి వింతైన ప్రతిపాదన


జమిలి ఎన్నికలపై మాట్లాడుతూ.. ఒకే ఎన్నిక అనేది ఏ ప్రభుత్వానికైనా అత్యంత క్లిష్టమైన అంశమని ఫాలి నారిమన్‌ అన్నారు. ఏదైనా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, నెగ్గితే ఆ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరపాలి? అనేది ప్రశ్నగా ఉంటుందని చెప్పారు. ఒకవేళ అధికార పార్టీ చీలిపోయి, ప్రతిపక్షంతో చేతులు కలపని పక్షంలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. అందులోనూ ఇటీవలి కాలంలో అనేక అధికార పార్టీలు చీలిపోతున్నాయని పేర్కొన్నారు.


ఇది కొత్త వింతైన ప్రతిపాదన అని నారిమన్‌ చెప్పారు. ఇదెలా పనికొస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగంలో సౌభ్రాతృత్వం ని రాసుకున్నా.. మనలో సహన స్ఫూర్తి గత కొన్నేళ్లగా నశించి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిని ‘లీడర్‌ ఆఫ్‌ హిస్‌ మెజెస్టీస్‌ అపోజిషన్‌’ అని అంటారని ప్రస్తావించారు. మనం అనుసరిస్తున్న వెస్ట్‌మినిస్టర్‌ పద్ధతి ప్రకారం.. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే ప్రతిపక్షం ఉండి తీరాలని చెప్పారు. అప్పుడే ప్రజలు ఏది సరైందో నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు..


కొత్త రాజ్యాంగ రచన అసాధ్యం


కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడుతూ.. అనేక మందిలో ఒక అంశంపై ప్రతి ఇద్దరిలో నాలుగు అభిప్రాయాలు అభిప్రాయాలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో కొత్త రాజ్యాంగం రచన ఎలా సాధ్యమని నారిమన్‌ ప్రశ్నించారు. ఇప్పటి రాజ్యాంగం మనందరినీ ఒక్కటిగా ఉంచిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కొత్త రాజ్యాంగం రచిస్తే దేశం చీలిపోదని భావించలేమని స్పష్టం చేశారు. అదే జరిగితే పెను విపత్తు చోటు చేసుకుంటుందని చెప్పారు. మన రాజ్యాంగ పనితీరులో ఐక్యతే అత్యంత కీలకమైన అంశమని అన్నారు. న్యాయమూర్తులు ప్రధాన మంత్రులను ప్రశంసించడం సరైంది కాదని నారిమన్‌ అభిప్రాయపడ్డారు. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుందని అన్నారు.



న్యాయమూర్తులు తమంతట తాము నిలబడగలగాలని చెప్పారు. దేశం వెలుపల ఎన్ని విజయాలు సాధిస్తున్నా.. దేశ ప్రభుత్వంలో సహనం లేదని, కొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితుల రీత్యా సంకీర్ణ ప్రభుత్వాలే మేలని ఆయన చెప్పారు.



మన అనుభవం కూడా అదే చెబుతున్నదని పేర్కొన్నారు. మెజార్టీ ఉన్న ప్రభుత్వాల కంటే సంకీర్ణ ప్రభుత్వాల చేతిలోనే రాజ్యాంగం, అది కల్పించే హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాలు కూడా సభను నడవనీయాలని, లేదంటే అధికార పక్షం పార్లమెంటును విస్మరిస్తుందని అన్నారు. అది నిరంకుశత్వానికి దారి తీస్తుందని చెప్పారు. ఇప్పటికే ఆ ధోరణులు ఉన్నాయన్నారు.