Telangana: మహిళా సంఘాలకు.. ఆర్టీసీ అద్దె బస్సులు

- జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- రుణం కోసం బ్యాంకులకు ప్రభుత్వ గ్యారెంటీ
విధాత, వరంగల్: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యం మేరకు కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రణాళికలు రచించారు. వీటి అమలులో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
తొలిసారి రాష్ట్రంలో చేస్తున్న ఈ ప్రయోగంలో భాగంగా మొదటి విడతలో 150 మండల మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు ఖేటాయిస్తూ నిర్ణయించారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని భావిస్తున్నారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె రూ. 77, 220 ఆర్టీసీ చెల్లించనున్నది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వనున్నది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నిర్వహించడం తొలిసారి కానడం గమనార్హం.