Putin | అమెరికా ఆ పని చేస్తే అణు యుద్ధం తప్పదు.. పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వార్నింగ్..!

Putin | అమెరికా ఆ పని చేస్తే అణు యుద్ధం తప్పదు.. పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వార్నింగ్..!

Putin : ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా (USA) సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 15 నుంచి 17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని స్పష్టంచేశారు.

సాంకేతికంగా అణు యుద్ధానికి రష్యా సిద్ధంగా ఉందని, అందుకు తొందరపడటం లేదని, తమకు కొన్ని విధివిధానాలు ఉన్నాయని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసని అన్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని పంపితే యుద్ధంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకున్నట్లేనని, దానికి తప్పకుండా బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రష్యా-అమెరికా మధ్య సంబంధాలపై వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు చాలామంది నిపుణులు ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా పుతిన్‌ బదులిచ్చారు. అయితే ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలన్నారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు చేపడితే రష్యా కూడా ఆ పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి ఆ దేశానికి మద్దతుగా నాటో దేశాలు ఆయుధాలను అందిస్తున్నాయన్నారు. గత నెల ఉక్రెయిన్‌లో పాశ్చాత్య బలగాల మోహరింపు అంశాన్ని కొట్టిపారేయలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్ చేసిన వ్యాఖ్యలపై పుతిన్‌ పరోక్షంగా స్పందించారు.

ఉక్రెయిన్‌లో తమ లక్ష్యాలను సాధించి తీరతామని, ఈ యుద్ధంలో అతిగా జోక్యం చేసుకోవడం లాంటి చర్యలు ప్రపంచ అణు సంఘర్షణ ముప్పునకు దారితీస్తాయని పశ్చిమ దేశాలను పుతిన్‌ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా మరోసారి ఇదే అంశంపై ఆయన స్పందించారు. కాగా, ఈ అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో.. పుతిన్‌ గెలుస్తాడా, ఓడుతాడా అనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.