ఉక్రెయిన్‌ వార్: వీర్యాన్ని ఫ్రీజ్ చేసుకుంటున్న ర‌ష్యా సైనికులు..!

ఎంత‌కాల‌మైనా ఎదిరించి పోరాడుతామంటున్న ఉక్రెయిన్ సేన‌ విధాత‌: యుద్ధాన్ని వీలైనంత త్వ‌ర‌లో అర్థ‌వంతంగా ముగించ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్ల‌దిమిర్ పుతిన్ ప్ర‌క‌టించి రోజులు గ‌డువ‌క ముందే… యుద్ధాన్ని మ‌రింత ఉధృతం చేసే స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. మ‌రో మూడు ల‌క్ష‌ల సైన్యాన్ని ఉక్రెయిన్ యుద్ధ భూమిలోకి పంపుతున్న ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి. 2022 ఫిబ్ర‌వ‌రి 24న మొద‌లైన ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజుల్లోనే ముగుస్తుంద‌ని ఆనాడు ప్ర‌పంచ‌మంతా అనుకున్న‌ది. దాడికి ఉప‌క్ర‌మించిన ర‌ష్యా కూడా రోజుల్లోనే యుద్ధాన్ని ముగిస్తామ‌ని […]

ఉక్రెయిన్‌ వార్: వీర్యాన్ని ఫ్రీజ్ చేసుకుంటున్న ర‌ష్యా సైనికులు..!
  • ఎంత‌కాల‌మైనా ఎదిరించి పోరాడుతామంటున్న ఉక్రెయిన్ సేన‌

విధాత‌: యుద్ధాన్ని వీలైనంత త్వ‌ర‌లో అర్థ‌వంతంగా ముగించ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్ల‌దిమిర్ పుతిన్ ప్ర‌క‌టించి రోజులు గ‌డువ‌క ముందే… యుద్ధాన్ని మ‌రింత ఉధృతం చేసే స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. మ‌రో మూడు ల‌క్ష‌ల సైన్యాన్ని ఉక్రెయిన్ యుద్ధ భూమిలోకి పంపుతున్న ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి.

2022 ఫిబ్ర‌వ‌రి 24న మొద‌లైన ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజుల్లోనే ముగుస్తుంద‌ని ఆనాడు ప్ర‌పంచ‌మంతా అనుకున్న‌ది. దాడికి ఉప‌క్ర‌మించిన ర‌ష్యా కూడా రోజుల్లోనే యుద్ధాన్ని ముగిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అంటే రెండుమూడు రోజుల్లోనే ఉక్రెయిన్ పాదాక్రాంతం అవుతుంద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ భావించా రు. కానీ ఉక్రెయిన్ సేన‌ల వీరోచిత ప్ర‌తిఘ‌ట‌న‌తో పుతిన్‌కు అనుకొన్న‌ది ఒక‌టి, ఐన‌ది ఒక‌టిగా మారిపో యింది.

మ‌రో రెండు నెల‌లు అయితే ఏడాది కావ‌స్తున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం దీర్ఘ‌కాలిక యుద్ధంగా మారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఇరువైపులా ల‌క్ష‌మంది సైనికుల చొప్పున రెండు ల‌క్ష‌ల మంది చనిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఉక్రెయిన్‌లో మ‌రో 40వేల మంది సాధార‌ణ పౌరులు చ‌నిపోయారు. యుద్దం కార‌ణంగా క‌నీసం 78ల‌క్షల మంది నిరాశ్ర‌యులైన‌ట్లు ప‌రిశీల‌కులు చెప్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ త‌న తొలి విదేశీ ప‌ర్య‌ట‌న‌గా అమెరికా వెళ్లాడు. అక్క‌డి పార్ల‌మెంటును ఉద్దేశించి ప్ర‌సంగించిన జెలెన్‌స్కీ త‌మ‌కు ఆయుధ‌, ఆర్థిక స‌హాయం అందించాల‌ని అమెరికాను కోరాడు. ఆధునాత‌న, మెరుగైన ఆయుధాల‌ను ఇవ్వాల‌ని అమెరికాను డిమాండ్ చేశాడు. దానికి జో బైడెన్ కూడా సానుకూలంగా స్పందించారు.

మొద‌టి విడ‌తగా వెంట‌నే 67 బిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక సాయంతో పాటు, పేట్రియాటిక్ క్షిప‌ణిల‌ను అందించ‌నున్న‌ట్లు అమెరికా తెలియ‌జేసింది. వ‌చ్చే ఏడాది కూడా మ‌రో 45 మిలియ‌న్ డాల‌ర్ల సాయం అందిస్తామ‌ని కూడా బైడెన్ ప్ర‌క‌టించారు. ఈ ప‌రిస్థితుల‌ను చూస్తే.. ఉక్రెయిన్ వార్ ఇప్ప‌ట్లో ముగిసే సూచ‌న‌లు క‌నిపించ‌టం లేదు.

ఈ నేప‌థ్యంలోనే.. ర‌ష్యా కూడా దీర్ఘ‌కాలిక యుద్ధానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. మ‌రో మూడు ల‌క్ష‌ల సేన‌ల‌ను ఉక్రెయిన్ స్పెష‌ల్ మిలిట‌రీ ఆప‌రేష‌న్ కోసం ఉక్రెయిన్‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు ర‌ష్యా చేస్తున్న‌ది. ఇదిలా ఉంటే… ర‌ష్యాలో ఉక్రెయిన్ యుద్ధంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ది. యుద్ధ క్షేత్రానికి వెళ్ల‌టానికే సైనికులు నిరాక‌రిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఎప్పుడు ముగుస్తుందో తెలియ‌ని యుద్ధంలోకి వెళ్తున్న సైనికులకు తాము స‌జీవంగా తిరిగి వ‌స్తామ‌న్న ఆశ‌లు అడ‌గంటుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ర‌ష్యా సైనికులు త‌మ వీర్యాన్ని ఫ్రీజ్ చేసి భ‌ద్ర‌ప‌ర్చు కొనేందుకు ఆస్ప‌త్రుల‌కు క్యూ క‌డుతున్నారు.

ర‌ష్యాలోని అతిపెద్ద న‌గ‌రం పీట‌ర్స్ బ‌ర్గులోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో సైనికుల వీర్యాన్ని ఫ్రీజ్ చేసే ఏర్పాట్లు చేసేందుకు ప్ర‌భుత్వం కూడా ఒప్పుకున్న‌ది. గ‌తంలో ఈ ఐవీఎఫ్ కేంద్రానికి ర‌ష్యా మ‌హిళ‌లు, పురుషులు వ‌చ్చేవారే కాదు, కానీ ఈ మ‌ధ్య‌న పురుషులు ముఖ్యంగా సైనికులు త‌మ వీర్యాన్ని ఫ్రీజ్ చేసుకునేందుకు ఎక్క‌వ సంఖ్య‌లో వ‌స్తున్నార‌ని ఆస్ప‌త్రి డాక్ట‌ర్ తెలిపారంటే ప‌రిస్థితి ఎలా ఉన్న‌దో ఊహించుకోవ‌చ్చు.

వీర్యాన్ని ఫ్రీజ్ చేసుకొని, ఆ త‌ర్వాత వారి భార్య‌లు కావాల‌నుకుంటే భ‌ద్ర‌ప‌ర్చుకొన్న త‌మ భ‌ర్త‌ల వీర్యంతో బిడ్డ‌ల‌ను క‌నొచ్చ‌ని భావిస్తున్నారు. అంటే.. యుద్ధంలోకి వెళ్తున్న వారు తిరిగొస్తారో లేదోన‌న్న భ‌యాలు ఏ రీతిన ఉన్నాయో ఇది చెప్ప‌క‌నే చెబుతున్న‌ది.

మ‌రో వైపు అమెరికా ఆధునాత‌న ఆయుధ సాయం, ఆర్థిక సాయం అంద‌టంతో ఉక్రెయిన్ క‌ద‌నోత్సాహంతో ఉన్న‌ది. ర‌ష్యా సేన‌ల‌ను ఎంత కాల‌మైనా ఎదురించి నిలుస్తామ‌ని ఉక్రెయిన్ సేన‌లు భావాస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఉక్రెయిన్ సైనిక విభాగ‌పు అధిప‌తి కిరిల్ బుడానోవ్ ర‌ష్యాతో దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం.