Supreme Court| ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సాగుతున్న తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్ వెంకటరత్నం ధర్మాసనం ప్రశ్నించింది.

Supreme Court| ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం

న్యూఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు( Telangana phone tapping case) దర్యాప్తు సాగుతున్న తీరుపై సుప్రీంకోర్టు( Supreme Court) ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్ వెంకటరత్నం ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర రావు(Prabhakar Rao) బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగించింది.

నిందితుడు ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరించడం లేదని, 5 ఐఫోన్ ల పాస్ వర్డ్ లలో కేవలం రెండింటి రీసెట్ కు మాత్రమే ఆయన సహకరించారి ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఆ రెండింటిలో కూడా ఎలాంటి డేటా లేదని, మరో మూడు ఐడీలు ఓపెన్ కాలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా ఇంకా ఏమి డేటా కావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. కేసు విచారణ జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. విచారణ తిరిగి రేపటికి వాయిదా వేసింది.

ఈ కేసులో ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ..అతను దర్యాప్తుకు సహకరించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని..అతని బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ కేసులో కీలక ఆధారాలను ప్రభాకర్ రావు ధ్వంసం చేశారంటూ కోర్టుకు తెలిపింది. డిజిటల్ ఎక్విప్‌మెంట్, పాస్ వర్డ్ ఇవ్వకుండా విసిగించడంతోపాటు విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించడం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తమ వాదనలను వినిపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్, పాస్ వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో ప్రభాకర్ రావు బృందం అప్పటి ప్రభుత్వ పెద్దల కోసం ప్రతిపక్ష రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, సెలబ్రెటీలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తుంది. విచారణలో భాగంగా పలువురి వాంగ్మూలాలను సైతం సిట్ నమోదు చేసింది.