Moon | చందమామ సేఫ్‌.. గ్రహశకలం ఢీకొట్టే అవకాశం లేదని గుడ్‌న్యూస్‌ చెప్పిన నాసా

చంద్రుడు ఇప్పుడు సేఫ్‌! అంతరిక్షంలో చందమామపైకి దూసుకొస్తున్న ముప్పు తప్పిపోయింది. 2024వైఆర్‌ 4 అనే గ్రహశకలం 2032లో చంద్రుడిని ఢీకొడుతుందని కొంతకాలంగా ఉన్న భయాందోళనలను నాసా చెరిపివేసింది.

Moon | చందమామ సేఫ్‌.. గ్రహశకలం ఢీకొట్టే అవకాశం లేదని గుడ్‌న్యూస్‌ చెప్పిన నాసా

Moon | చంద్రుడు ఇప్పుడు సేఫ్‌! అంతరిక్షంలో చందమామపైకి దూసుకొస్తున్న ముప్పు తప్పిపోయింది. 2024వైఆర్‌ 4 అనే గ్రహశకలం 2032లో చంద్రుడిని ఢీకొడుతుందని కొంతకాలంగా ఉన్న భయాందోళనలను నాసా చెరిపివేసింది. ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టే ప్రమాదం లేదని స్పష్టం చేసింది. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ చేసిన తాజా పరిశోధన వివరాలను వెల్లడించింది.

చంద్రుడిపైకి ఒక గ్రహశకలం దూసుకొస్తున్న విషయాన్ని 2024లో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. చందమామపైకి వస్తున్న ఆ ఆస్టరాయిడ్‌కు 2024వైఆర్‌4 అనే నామకరణం చేశారు. ఇది 2032 డిసెంబర్‌ 22 నాటికి చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందని నిర్ధారించారు. ఈ క్రమంలో జరిగే విస్ఫోటనం ఎంత ప్రళయాన్ని సృష్టిస్తుందో అంచనా వేసిన శాస్త్రవేత్తలు భయాందోళనలకు గురయ్యారు. ఎందుకంటే.. ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టినప్పుడు.. హిరోషిమాపై పడిన అణుబాంబు శక్తికి 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుంది. అలాగే చంద్రుడిపై సుమారు కిలోమీటర్‌ వ్యాసార్థంతో భారీ గొయ్యి ఏర్పడుతుంది. ఇది చంద్రుడితోపాటు భూమికి పెను ముప్పుగా మారే అవకాశం ఉంది.

అదెలా అంటే.. అంత భారీ విస్ఫోటనం జరిగినప్పుడు ఎగిసిపడే దుమ్ము, శకలాలు భూమిపైకి ప్రయాణించే అవకాశం ఉంది. ఆ శకలాలు భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు సహజంగానే మండుతూ ఉల్కల్లా కింద పడుతాయి. అప్పుడు భూమిపై ఉన్న భవనాలు, నిర్మాణాల మీద అవి పడితే భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. అవే శకలాలు భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్‌ను ఢీకొడితే.. కమ్యూనికేషన్ వ్యవస్థలు, జీపీఎస్‌, నావిగేషన్‌ సిస్టమ్‌, బ్యాంకింగ్‌ నెట్‌వర్క్స్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఈ 2024వైఆర్‌ 4 గ్రహశకలం గమనంపై ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నాసాకు చెందని జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ కూడా ఆ డేటాను పరిశీలించి.. చంద్రుడికి ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించింది. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.

పరిశోధన ఎలా చేశారు?

2024వైఆర్‌4 గ్రహశకలాన్ని జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ నిశితంగా పరిశీలించినప్పుడు ఆ ఆస్టరాయిడ్‌ నుంచి స్వల్ప కాంతి ప్రతిబింబించినట్లుగా గుర్తించారు. ఇది చంద్రుడు – భూమి మధ్య దూరంలో చిన్న బాదంపప్పు పెడితే ఎంత ఉంటుందో.. అంత పరిమాణంలో ఈ కాంతి వెలువడింది. ఇంకా చెప్పాలంటే.. మనకు ఆకాశంలో కనిపించే మసకబారిన నక్షత్రం వెలుగు కంటే ఇది దాదాపు నాలుగు బిలియన్‌ రెట్లు తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే భూమిపై ఉన్న టెలిస్కోప్‌లు, ఇతర అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు దీన్ని గమనించలేకపోయాయి. కానీ అత్యంత సున్నితత్వం, కదిలే లక్ష్యాలను కచ్చితంగా ట్రాకింగ్ చేయగల వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ మాత్రం ఈ కాంతిని గుర్తించింది. దాని ఆధారంగా ఆ ఆస్టరాయిడ్‌ కచ్చితమైన కక్ష్యను లెక్కించింది.