అంతరిక్షం నుంచి వెలిగిపోతూ కనిపించిన యూపీ-బీహార్.. నాసా మ్యాప్ వైరల్

2014 నుంచి 2022 వరకు భూమిపై రాత్రి వెలుగుల్లో వచ్చిన మార్పులను నాసా విడుదల చేసింది. అయితే యూపీ-బీహార్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రకాశవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

అంతరిక్షం నుంచి వెలిగిపోతూ కనిపించిన యూపీ-బీహార్.. నాసా మ్యాప్ వైరల్ నాసా విడుదల చేసిన ప్రపంచ నైట్ మ్యాప్‌లో యూపీ-బీహార్ ప్రాంతం అత్యంత ప్రకాశవంతంగా కనిపించిన దృశ్యం.

Uttar Pradesh-Bihar Shine From Space: NASA Night Lights Data Goes Viral

విధాత సైన్స్​ డెస్క్​ | హైదరాబాద్​:

NASA Night Lights | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA విడుదల చేసిన తాజా నైట్‌టైమ్ గ్లోబల్ మ్యాప్ (NASA Night-light Map) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2014 నుంచి 2022 వరకు భూమిపై రాత్రి సమయంలో వెలుగుల్లో వచ్చిన మార్పులను ఈ మ్యాప్ ద్వారా చూపించారు. ఈ చిత్రాలను సోషల్​ మీడియాలో నాసా పోస్ట్​ చేయగా, అందులో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్-బీహార్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రకాశవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా కనిపించడాన్ని కొందరు నెటిజెన్లు పట్టేసారు. అంతే.. ఒక్కసారిగా ఈ చిత్రం వైరల్​గా మారిపోయింది.

ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు తొమ్మిదేళ్లపాటు ప్రతిరోజూ సేకరించిన 16 లక్షల ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించారు. బంగారు రంగులో కనిపించిన ప్రాంతాలు ఎక్కువ వెలుగులను సూచిస్తే, ఊదా(Purple) రంగులో ఉన్న ప్రాంతాలు తక్కువ వెలుగులను సూచించాయి.

భారత్ అభివృద్ధికి సంకేతమా?

Close-up NASA satellite image showing India glowing brightly at night with UP Bihar belt visible

భారతదేశం రాత్రివేళ వెలుగులతో మెరిసిపోతున్న నాసా శాటిలైట్ చిత్రం.. యూపీ-బీహార్ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నాసా పోస్ట్​ చేసిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ఈ వెలుగులపై పెద్ద చర్చే జరుగుతోంది.  యూపీ-బీహార్ ప్రాంతం ఇలా వెలుగులు విరజిమ్మడం వెనుక విద్యుత్ సరఫరా మెరుగుదల, పట్టణీకరణ, పరిశ్రమల పెరుగుదల, రహదారులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణమని ఆ ప్రాంతపు నెటిజెన్లు పేర్కొన్నారు. ఒకప్పుడు గంటల కొద్దీ పవర్ కట్స్ ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు 21 నుంచి 23 గంటల వరకు విద్యుత్ అందుతోందని మరి కొందరు ఆనందం వ్యక్తం చేసారు.

చైనా, మధ్య ప్రాచ్యం, మధ్య అమెరికా ప్రాంతాలు కూడా బంగారు వర్ణంతో కనిపించగా, యూరప్‌లోని చాలా ప్రాంతాలు ఊదా రంగులో కనిపించాయి. అమెరికాలో పశ్చిమ ప్రాంతాల్లో బంగరు రంగు ఎక్కువగా ఉండగా, తూర్పు ప్రాంతాల్లో వెలుగులు తగ్గినట్టు మ్యాప్ సూచించింది.

ఈ మ్యాప్ భారతదేశంలో విద్యుత్ వినియోగం, అభివృద్ధి, పట్టణ విస్తరణ ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా తెలియజేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.