SC వర్గీకరణ రణం..! మంద కృష్ణ హౌజ్ అరెస్ట్
పోలీసుల ముందస్తు అరెస్టులతో భగ్నం.. ఏపీలో కొన్నిచోట్ల రాస్తారోకోలు.. నిరసనలు.. విధాత: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు కేంద్రం చట్టబద్ధత కల్పించకుండా జాప్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపు నిచ్చిన మంద కృష్ణ మాదిగను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఎమ్మార్పీఎస్‌తో పాటు తొమ్మిది అనుబంధ సంఘాలు జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పటికీ పోలీసులు ముందస్తు ఆరెస్టులతో ఈ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ […]

- పోలీసుల ముందస్తు అరెస్టులతో భగ్నం..
- ఏపీలో కొన్నిచోట్ల రాస్తారోకోలు.. నిరసనలు..
విధాత: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు కేంద్రం చట్టబద్ధత కల్పించకుండా జాప్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపు నిచ్చిన మంద కృష్ణ మాదిగను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఎమ్మార్పీఎస్‌తో పాటు తొమ్మిది అనుబంధ సంఘాలు జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పటికీ పోలీసులు ముందస్తు ఆరెస్టులతో ఈ కార్యక్రమాన్ని భగ్నం చేశారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బిజెపి మాటలు ఎనిమిదేళ్లుగా నీటి మూటలయ్యాయని ఆరోపిస్తూ మందకృష్ణ ఎస్సీ వర్గీకరణకు కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన జాతీయ రహదారి దిగ్భంధ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులతో విఫలం చేశారు. దీంతో జాతీయ రహదారి వెంట చౌటుప్పల్ వద్ద ఆందోళనలకు సిద్ధమైన వలిగొండ, చౌటుప్పల్ కార్యకర్తలను రహదారి పైకి రాకముందే పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్లకు తరలించారు.
వలిగొండ నుంచి జాతీయ రహదారి దిగ్భందానికి వెళ్తున్న మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ దుబ్బ దానయ్య మాదిగను, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ పల్లెర్ల రామచందర్ మాదిగ, ఎంఎస్పి మండల కన్వీనర్ కందుల అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు మస్కు నరసింహ మాదిగ, మండల నాయకులు దేశపాక సుదర్శన్ మాదిగ ,ఎస్సి ఉపకులం బుడగ జంగాల జిల్లా నాయకులు ఎదురుగట్ల చిన్న యాదగిరిలను నాగారం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
ఇదే రీతిలో నకిరేకల్, చిట్యాల, కట్టంగూర్, తిప్పర్తి, కోదాడ, ప్రాంతాల్లో పోలీసులు జాతీయ రహదారి దిగ్బంధానికి పాల్పడకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకొని వదిలేశారు. హైవే పైకి వచ్చి రాస్తారోకోతో దిగ్బంధానికి ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్ మా జన సోషలిస్ట్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడి శంకర్ మాదిగ, బకరం శ్రీనివాస్ ఎర్రసాని గోపాల్‌లతో పాటు పలువురిని అరెస్టు చేశారు.
తెలంగాణలో జాతీయ రహదారి దిగ్బంధాన్ని పోలీసులు విఫలం చేసినప్పటికీ ఇదే రహదారి పై ఆంధ్ర ప్రాంతంలో పలుచోట్ల ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కొద్దిసేపు రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే తమ జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమం పలుచోట్ల విజయవంతమైందని, ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని ప్రజల్లో ఎండగట్టగలిగామని హౌజ్ అరెస్ట్ కాబడిన మందకృష్ణ మాదిగ మీడియాకు వెల్లడించారు.
ఇకనైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టి ఆమోదింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్రానికి వ్యతిరేకంగా తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు.