MMTS రైలులో లైంగిక దాడి యత్నం.. బ‌య‌ట‌కు దూకిన యువతి!

హైదరాబాద్ కొంపల్లిలో ఎంఎంటీఎస్‌ రైలు బోగీలో ప్రయాణిస్తున్న యువతి ఒంటరిగా ఉండటాన్ని ఆసరగా చేసుకుని ఓ యువకుడు ఆమెపై లైంగిక దాడి యత్నం చేశాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ యువతి నడుస్తున్న రైలు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలకు గురైంది.

MMTS రైలులో లైంగిక దాడి యత్నం.. బ‌య‌ట‌కు దూకిన యువతి!

Sexual Assault Attempt On MMTS Train :

ఎంఎంటీఎస్ (MMTS Train) రైలులో ఓ యువతిపై లైంగిక దాడి ఘటన సంచలనం రేపింది. హైదరాబాద్ కొంపల్లిలో ఎంఎంటీఎస్‌ రైలు బోగీలో ప్రయాణిస్తున్న యువతి ఒంటరిగా ఉండటాన్ని ఆసరగా చేసుకుని ఓ యువకుడు ఆమెపై లైంగిక దాడి యత్నం చేశాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ యువతి నడుస్తున్న రైలు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన బాధిత యువతి మేడ్చల్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ స్విగ్గీలో పని చేస్తుంది.

తన సెల్ ఫోన్ రిపేర్ కోసం మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైలులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. సెల్ ఫోన్ రిపేర్ అనంతరం యువతి తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎంఎంటీఎస్ రైలు మహిళ బోగీలో ఎక్కి మేడ్చల్ బయలు దేరింది. అప్పటికే ఆ బోగీలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గమధ్యంలో అల్వాల్ రైల్వే స్టేషన్​లో దిగిపోయారు. అనంతరం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మహిళల బోగీలోకి ప్రవేశించిన ఆగంతకుడు.. ఆ బోగీలో ఆ యువతి ఒక్కరే ఉండటాన్ని గమనించి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యువతి నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది.

తీవ్ర గాయాలతో గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడిపోయిన యువతిని చూసిన అటుగా వెళ్తున్న పాదచారుడు 108కు సమాచారం ఇవ్వడంతో గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. యువకుడు చెక్స్ షర్ట్ ధరించి నల్లగా, సన్నగా ఉన్నాడని.. సుమారు 25 ఏళ్ల వయసు ఉంటుందని బాధిత యువతి తెలిపింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్​స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు. యువకుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని రైల్వే ఎస్పీ చందన దీప్తీ పరామర్శించారు. ప్రాణపాయం తప్పిందని.. కోలుకుంటుందని.. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

యువతిపై లైంగిక దాడి బాధాకరం: ఎమ్మెల్సీ కవిత

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు. మహిళా భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని సూచిస్తున్నానన్నారు. ఘటనపై కవిత రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఫోన్‌లో మాట్లాడారు. యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీని ఆరా తీశారు. ఆమెకు సరైన వైద్యం అందించి.. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.