పాకిస్థాన్‌ 24వ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ప్రమాణం

పాకిస్థాన్‌ 24వ ప్రధాన మంత్రిగా పీఎంఎల్‌(ఎన్‌)కు చెందిన షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం ప్రమాణం చేశారు. అధ్యక్ష భవనం ఐవాన్‌ ఐ సదర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వి ప్రమాణం చేయించారు

  • By: Somu    latest    Mar 04, 2024 11:55 AM IST
పాకిస్థాన్‌ 24వ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ప్రమాణం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ 24వ ప్రధాన మంత్రిగా పీఎంఎల్‌(ఎన్‌)కు చెందిన షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం ప్రమాణం చేశారు. అధ్యక్ష భవనం ఐవాన్‌ ఐ సదర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వి ప్రమాణం చేయించారు. పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఆయన రెండోసారి ప్రధాని అయ్యారు.


సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌), పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ మధ్య ఒప్పందం నేపథ్యంలో ఆయన ప్రధాన పదవిని చేపట్టడారు. గతంలో 2022 ఏప్రిల్‌ నుంచి 2023 ఆగస్ట్‌ వరకు సంకీర్ణ ప్రభుత్వంలో షరీఫ్‌ ప్రధానిగా ఉన్నారు. అనంతరం పార్లమెంటు రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లారు.


ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని, షెహబాజ్‌ సోదరుడు నవాజ్‌ షరీఫ్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌, ఇరత పీఎంఎల్‌ (నవాజ్‌) నాయకులు, పీపీపీ సింధ్‌ ముఖ్యమంత్రి మురద్‌ అలీ షా తదితర నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షాల నినాదాల మద్య షెహబాజ్‌ ఆదివారం నాడు మెజార్టీ నిరూపించుకున్నారు. పార్లమెంటులో నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 336 మందికిగాను షెహబాజ్‌ను 201 మంది సమర్థించారు. ఆయన ప్రత్యర్థి, ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్ఫాఫ్‌ (పీటీఐ) నాయకుడు ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారుడు ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌కు 92 ఓట్లు వచ్చాయి.


ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో షెహబాజ్‌ షరీఫ్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కానీ.. మొత్తం 265 సీట్లకు పోటీచేసి 75 సీట్లు తెచ్చుకోవడం ద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ను గట్టెక్కించాలంటే కొత్త ప్రధాని కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.