సీతారాముల పెళ్లికి ప్రత్యేక చీరలు
భద్రాద్రి సీతారాముల కల్యాణం సిరిసిల్ల నేత కార్మికులు ప్రత్యేకతలతో, అద్భుతాలతో కూడిన చీరలను తయారు చేసి కానుకగా అందించబోతున్నారు

సిరిసిల్ల నేత కార్మికుల అద్భుత కానుకలు
విధాత : భద్రాద్రి సీతారాముల కల్యాణం సిరిసిల్ల నేత కార్మికులు ప్రత్యేకతలతో, అద్భుతాలతో కూడిన చీరలను తయారు చేసి కానుకగా అందించబోతున్నారు. సీతమ్మ కల్యాణం చీరను ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ మరోసారి అద్భుతమైన చీరను చేనేత మగ్గంపై
తీర్చిదిద్దారు. చీర అంచులపై భద్రాద్రి దేవాలయంలో ఉన్నటువంటి సీతారాముల ప్రతిరూపాలతో కూడిన అంచులు, చీర మొత్తం శంఖు, చక్ర, నామాలతో సీతారాముల కల్యాణ చిత్రం, చీర బార్డర్‌లో ‘జై శ్రీరామ్’ అంటూ వచ్చే విధంగా అద్భుత డీజైన్లతో చీరను మగ్గంపై ఆరు రోజుల పాటు శ్రమించి తయారు చేశాడు.
మరోవైపు ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళకారుడు నల్ల విజయ్ భద్రాచలంలోని సీతమ్మ కల్యాణానికి రంగులు మారే త్రీడీ చీరలు రూపొందించాడు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న దీని బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేశాడు. ఇందుకుగాను 48,000 ఖర్చయిందని, రంగులు మార్చే ఈ చీరను ఈ నెల 16న భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించిననున్నట్లుగా తెలిపారు.