వరంగల్‌ తూర్పులో వింత.. చాన్నాళ్లకు పర్యటించిన మేయర్! ఎమ్మెల్యే లేకపోవడమే కారణమా?

మేయర్‌కూ ఓ అవకాశం చిక్కింది! దర్గా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలన ఆ కార్పొరేటర్లు ప్లేటు ఫిరాయించారా? 'పోటీ' భయంతో మేయర్‌కు నో ఎంట్రీ? అధిష్ఠానం దృష్టికి అన్ని సమస్యలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హమ్మయ్య.. చాలా రోజుల తర్వాత 'ది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్' గుండు సుధారాణికి నగర పరిధిలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికారిక పర్యటన చేసేందుకు అవకాశం చిక్కింది. సుధారాణి మేయర్‌గా నగరానికంతా ప్రాతినిధ్యం వహించాల్సి ఉన్నప్పటికీ. వరంగల్ తూర్పు […]

  • By: krs    latest    Feb 10, 2023 4:13 PM IST
వరంగల్‌ తూర్పులో వింత.. చాన్నాళ్లకు పర్యటించిన మేయర్! ఎమ్మెల్యే లేకపోవడమే కారణమా?
  • మేయర్‌కూ ఓ అవకాశం చిక్కింది!
  • దర్గా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలన
  • ఆ కార్పొరేటర్లు ప్లేటు ఫిరాయించారా?
  • ‘పోటీ’ భయంతో మేయర్‌కు నో ఎంట్రీ?
  • అధిష్ఠానం దృష్టికి అన్ని సమస్యలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హమ్మయ్య.. చాలా రోజుల తర్వాత ‘ది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్’ గుండు సుధారాణికి నగర పరిధిలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికారిక పర్యటన చేసేందుకు అవకాశం చిక్కింది. సుధారాణి మేయర్‌గా నగరానికంతా ప్రాతినిధ్యం వహించాల్సి ఉన్నప్పటికీ. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పర్యటన చేయాలంటే ‘ఆమెకు’ అనధికార ‘నో ఎంట్రీ’ కొనసాగుతూ వస్తోంది.

తూర్పులో మేయర్‌కు అప్రకటిత ‘నో ఎంట్రీ’

బాహాటంగా ఈ విషయం చెప్పుకోకపోయినప్పటికీ చాలా కాలంగా మేయర్‌కు తూర్పులో అప్రకటిత అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ అనుమతి నిరాకరణ వెనుక తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హస్తముందనేది బహిరంగ సత్యం. ఎమ్మెల్యేను కాదని మేయర్‌ను.. ఏ కార్పొరేటర్ ఆహ్వానించక పోవడంతో ఆమె మిగిలిన నియోజకవర్గాలకే పరిమితం అవుతూ వస్తున్నారు. మేయర్, ఎమ్మెల్యేలిద్దరూ గులాబీ పార్టీకి చెందిన వారు కావడం ఇక్కడ కొసమెరుపు.

దర్గా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మేయర్

బుధవారం తూర్పులో ఓ వింత చోటుచేసుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొందరు సైటైరికల్‌గా మాట్లాడుకుంటున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఉర్సు దర్గా ఉత్సవాల ఏర్పాట్లను మేయర్ తాజాగా పరిశీలించారు.

ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మౌలిక సదుపాయాలైన తగు లైటింగ్,మంచి నీటి వసతి, నిరంతరం విద్యుత్ సరఫరా వంటి ఏర్పాటు చేయాలని, శానిటేషన్ పక్కాగా జరగాలని అధికారులకు సూచించారు.

ఈ నెల 13 నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అధికారులతో పాటు డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం, స్థానిక కార్పొరేటర్ మరుపల్ల రవి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడమే కారణమా?

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్థానికంగా లేకపోవడంతో ఈ సాహసం చేశారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిమిత్తం ఆయన హైదరాబాద్ వెళ్లడంతో మేయర్ సుధారాణి తూర్పులో పర్యటించేందుకు అవకాశం లభించిందని ఆ పార్టీ వర్గాలు చెవులు కోరుక్కుంటున్నాయి.

ఐదు సెగ్మెంట్‌లూ.. తూర్పులో ఇబ్బంది

హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద దైన వరంగల్ నగరానికి సుధారాణి మేయర్. అధికార గులాబీ పార్టీ నుంచే ఆమె మేయర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ తక్కువలు పక్కన పెడితే ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లుంటాయి.

వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలు ఉంటాయి. అన్ని సెగ్మెంట్లలో మేయర్ గా సుధారాణి తన బాధ్యతలు, పర్యటనలు, కార్యక్రమాలు, సాధారణంగానే కొనసాగిస్తుంటారు. కానీ ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వచ్చేసరికి అనధికారికంగా నో ఎంట్రీ కొనసాగుతోందనేది అధిష్టానం ఎరిగిన నిజమే.

ఆ ఇద్దరు కార్పొరేటర్లు సహకరించారా?

ఉర్సు దర్గా ఉత్సవాల ఏర్పాట్లకి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే నరేందర్ కలెక్టరుతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మేయర్ తాజాగా ఏర్పాట్లు పరిశీలించడం గమనార్హం. సాధారణంగా తూర్పులో ఎమ్మెల్యేను కాదని ఏ కార్పొరేటర్ మేయర్‌ను ఆహ్వానించడం లేదు.

తాజాగా ఈ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలనకు మేయర్ ను స్థానిక కార్పొరేటర్ మరుపల్ల రవి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం ఆహ్వానించారా? లేక మేయర్ తానుగా వెళ్ళారా? అని చర్చ సాగుతుంది. కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కాదని ఎలా? ఆహ్వానించారని సంశయం వ్యక్తం అవుతుంది. వీళ్ళు మేయర్ పక్షం చేరుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే?

అసలు విషయం ఏంటంటే? సుధారాణి కూడా వరంగల్ తూర్పు నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగారు. టీడీపీ నుంచి ఈ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యత వహించారు. ఈ కారణంగా భవిష్యత్తులో ఆమె నుంచి తనకు ఏమైనా పోటీ ఉంటుందా? అనే అనుమానంతో ఆమెకు తూర్పులో అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డ వేస్తున్నారనేది అందరికి తెలిసిన విషయం.

ఇందులో మరో విషయం ఏమిటంటే తాను మేయర్‌గా బాధ్యత వహిస్తూనే ఎమ్మెల్యేగా అవకాశం లభించడంతో నరేందర్‌ను సహజంగా ఈ పోటీ భయం వెంటాడుతోంది. అందుకే మేయర్ సుధారాణికి తూర్పులో ఎంట్రీ లేకుండా ఎత్తులు వేస్తున్నట్లు గులాబీ వర్గాలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ అన్ని విషయాలు అధిష్టానానికి కూడా తెలవడం మరో గమ్మత్తయిన విషయం.