ట్రాఫిక్‌లో చిక్కుకుని.. పిజ్జా ఆర్డర్‌.. ఉన్న చోటుకే డెలివరీ!

ట్రాఫిక్‌లో చిక్కుకుని.. పిజ్జా ఆర్డర్‌.. ఉన్న చోటుకే డెలివరీ!

విధాత: బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాలపై నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఈ వార్త మాత్రం వాటికి బాబులాంటిదే అనడంలో సందేహం లేదు. సాధారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. రెండు నిమిషాలకో ఐదు నిమిషాలకో కనీస దూరమైన వెళతాం. కానీ.. బెంగళూరులో బుధవారం ఇంటికి వెళ్లేందుకు రోడ్ల మీదకు వచ్చినవారికి గంటల సమయం పట్టింది.

అయితే.. ఈ సమయంలో ఒక వ్యక్తి అంత ట్రాఫిక్‌లోనూ దర్జాగా పిజ్జా ఆర్డర్‌ చేసి.. దానిని అదే ట్రాఫిక్‌లో కారు వద్దకే తెప్పించుకున్న వీడియో ఒకటి నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది. రిషి అనే డిజైన్‌ ఇంజినీర్‌.. బెంగళూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడు. దాంతో కారులో నుంచే పిజ్జా ఆర్డర్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌ పోస్ట్‌లో పంచుకున్నాడు. తీవ్ర ట్రాఫిక్‌లో ఇరుక్కున్న తాము డోమినోస్‌ పిజ్జా ఆర్డర్‌ ఇచ్చామని, డెలివరీ బాయ్‌ తమ లైవ్‌ లొకేషన్‌.. ఆర్డర్‌ ఇచ్చిన ప్రాంతానికి కొద్ది మీటర్ల దూరంలో తమ ఆర్డర్‌ను తీసుకొచ్చి ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్న తమ కారు వద్ద అందజేశాడని పేర్కొన్నాడు. సదరు వీడియోను కూడా ఆయన పోస్ట్‌ చేశాడు. ఈయన ఇలా ఈ వీడియో పోస్ట్‌ చేశాడో లేదో.. లక్షల్లో వ్యూస్‌ అందుకున్నది.


ఈ వీడియోను చూసిన ఒక నెటిజన్‌ కొంటెగా కామెంట్‌ చేస్తూ.. ‘ఈసారి నేను అర్బన్‌ కంపెనీ నుంచి మసాజ్‌ బుక్‌ చేసుకుంటాను’ అని రాస్తూ బెంగళూరు ట్రాఫిక్‌ దుస్థితిని చాటాడు. అంత ట్రాఫిక్‌లోనూ కారు వద్దకు పిజ్జాను డెలివరీ చేసిన డెలివరీ బాయ్‌పైనా ప్రశంసలు కురిశాయి. ఇది నిజానికి వారికి పెద్ద సవాలు వంటిదని పలువురు వ్యాఖ్యానించారు.


అంతకు ముందు రోజే బెంగళూరులో బంద్‌ జరిగింది. బుధవారం నగర రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. చాలామంది ఉద్యోగులతోపాటు.. స్కూలు పిల్లలు సైతం ఇళ్లకు చేరేందుకు రాత్రి 8 గంటలు దాటిపోయింది. భారీ సంఖ్యలో వాహనాలు, అనేక చోట్ల ట్రాఫిక్‌కు అవాంతరాలు కలగడం వల్లే బుధవారం తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ అయిందని పోలీసులు చెబుతున్నారు