వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రవీంద్ర ఎవరు..అనంతపురంతో లింకేంటి?

అక్టోబర్ 5 నుండి వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ పోటీ పడగా ఈ పోరులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు అతని పేరు మారుమ్రోగిపోతుంది. సెంచరీ చేయడమే కాక ధాటిగా ఆడుతున్న హ్యారీ బ్రూక్‌ను కూడా ఔట్ చేశాడు రచిన్ రవీంద్ర.
ప్రస్తుతం అతని పేరు మారుమ్రోగిపోతున్న నేపథ్యంలో అసలు ఈ రచిన్ రవీంద్ర ఎవరూ..? అతనికి భారత్‌తో ఉన్న సంబంధం ఏంటనే విషయంపై నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర.. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌తోనే ఆరంగేట్రం చేసిన రచిన్ ఇప్పటి వరకు 18 టీ20లు, 13 వన్డే మ్యాచ్‌లు ఆడి, బౌలింగ్ 26 వికెట్స్ తీసాడు. ఇక బ్యాటింగ్‌లో కేవలం అర్ధ సెంచరీ చేశాడు.
అయితే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రచిన్ రవీంద్ర ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్లు మొయిన్ ఆలీ, మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఈజీగా బౌండరీలు బాదుతూ అందరిని ఆశ్చర్యపరిచాడు. 23 ఏళ్ల రచిన్ రవీంద్ర విషయానికి వస్తే ఆయన తల్లిదండ్రులు అందరు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడే సెటిల్ కాగా, మనోడు క్రికెట్ ఓనమాలు నేర్చుకుంది ఇండియాలోనే.
ప్రతీ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న ఆర్‌డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్)కి వచ్చి క్రికెట్ ఆడతుంటాడు రచిన్… తన తండ్రి రవి కృష్ణమూర్తి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్ తరుపున రచిన్ రవీంద్రతో పాటు ఇతర ప్లేయర్లు, న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడుతుండేవారట. తాను భారత బ్యాట్స్‌మెన్స్ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌ని ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లు కలిసేలా రచిన్ అనే పేరు పెట్టారని రచిన్ రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని వెల్లడించాడు.