చెరుకు రసం.. వీళ్లు అసలు తాగకూడదు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతకు గురవడంతో పాటు డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతకు గురవడంతో పాటు డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో శీతల పానీయాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ప్రధానంగా నిమ్మ రసం, చెరుకు రసంతో పాటు ఇతర జ్యూస్‌లు తాగేందుకు ఇష్టపడుతుంటారు. జ్యూస్‌లను తీసుకుని శరీరాన్ని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే చాలా మంది చెరుకు జ్యూస్‌ను తాగేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే తక్కువ ధరలో లభ్యమవుతుంది కాబట్టి. అంతేకాకుండా శరీరాన్ని కూడా హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇక చెరుకు రసంలో ఐరన్, పోటాషియం, కాల్షియం, కాపర్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తహీనతను నివారించడంలో కూడా సహాయపడుతాయి. ఇన్ని రకాలుగా చెరుకు రసం మేలు చేసినప్పటికీ.. కొందరికి హానీ కూడా కలిగిస్తుంది.
డయాబెటిస్‌తో బాధపడేవారు, దంతాలలో కుహరం ఉన్నవారు, ఊబకాయంతో బాధపడేవారు, తరుచూ కడుపునొప్పికి గురయ్యేవారు, జలుబుతో బాధపడేవారు చెరుకు రసానికి దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చెరుకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తక్కువగా కలిగి ఉండి, గ్లైసెమిక్ లోడ్‌ను అధికంగా కలిగి ఉంటుంది. ఇవి డయాబెటిక్ రోగి రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. అందుకే మధుమేహంతో బాధపడేవారు చెరుకు రసానికి దూరంగా ఉంటే మంచిది.

దంత కుహరం సమస్యలు ఉన్నవారు కూడా చెరుకు రసం తాగకపోవడమే మంచిది. ఎందుకంటే చెరుకు రసంలో సహజంగానే చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ చక్కెర నోటిలో బ్యాక్టీరియాను పెంచేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దంత కుహరంతో బాధపడేవారు చెరుకు రసానికి దూరంగా ఉండాలి.
మరి ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారు అసలు చెరుకు రసం జోలికి పోకూడదు. చెరుకు జ్యూస్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి. దీంతో దీన్ని ఎక్కువగా తీసుకుంటే మరింత బరువు పెరగడానికి కారణమవుతుంది. చక్కెర అధికంగా ఉండటంతో దీని వల్ల శరీరంలో కొవ్వు వేగంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు బరువు తగ్గాలనుకుంటే, చెరకు రసం తాగడం మానుకోండి.
కడుపునొప్పితో బాధపడేవారిపై కూడా చెరుకు రసం ప్రభావం చూపుతుంది. చెరుకు రసంలో ఉండే పొలికోసనాల్ జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని కారణంగా వాంతులు, నిద్రలేమి, అతిసారం ఏర్పడే అవకాశం ఉంది. జలుబుతో బాధపడేవారు కూడా దూరంగా ఉంటే మంచిది.