Cholesterol Reducing Foods : ఇలా చేస్తే మీ శరీరంనుంచి కొవ్వు పారిపోతుంది
డయాబెటిస్ ఉన్నవారు కొలెస్ట్రాల్ నియంత్రణకు సాచురేటెడ్ కొవ్వులు (డీప్ ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్) తగ్గించాలి. చేపలు, సోయా, పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని పెంచాలి.
మన దేశంలో 25 ఏళ్లు పైబడిన వారిలో 11.4 శాతం మందిలో డయాబెటీస్ ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. వీరిలో 81.2 శాతం మందిలో లిపిడ్ అసాధారనంగా ఉంది. డయాబెటీస్ ఉన్నవారిలో 90 శాతం మందిలో అధిక ట్రైగ్లిజరైడ్స్, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్), ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. ఈ రెండు కలిసి అనేక వ్యాధులకు దరితీస్తాయి. ఎక్కువగా గుండె సంబంధిత సమస్యల ముప్పును 2 నుంచి 4 రెట్లు పెంచుతాయి.
కాబట్టి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ఆహారం తీసుకోవడం, వండే విధానంలో మార్పుతో ఈ పరిస్థితులు రాకుండా చేసుకోవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు.
అయితే డయాబెటిస్ ఉన్నవారు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా వారికి వారే ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలన్న ప్రశ్నలు వేసుకోవాలి.
ఆహారాన్ని పోషకాల కొలతలతో తీసుకోవడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు, ఆచరణకు సాధ్యం కాని పద్దతులను కొంతకాలం పాటించి లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేయడం కంటే, ఆచరణకు సులువుగా ఉండే విధానాలను శాశ్వతంగా పాటించడం ఎంతో మేలు.. అవేంటో ఒక సారి చూద్దాం..
డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చెప్పే మొదటి సూచన శాచురేటెడ్ కొవ్వులు తగ్గించుకోవాలని, మన వంటలో వాడే ఏ నూనెను వేడి చేసినా, మరిగించినా కూడా శాచురేటెడ్ అయిపోతుందని జాతీయ పోషకాహార పరిశోధన సంస్థ ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పింది. అందుకే డీప్ ఫ్రై పదార్థాలను బాగా తగ్గించాలి. ఫ్యాక్టరీల్లో ప్రాసెస్ చేసిన మాంసాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలతో తయారు చేసి ప్యాక్ చేసిన తీపి వస్తువులు, మార్కెట్‌లో ప్రాచుర్యంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన రెడీ స్నాక్స్‌లోనూ ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అనే కొవ్వు పదార్థాల వాడకం వల్ల ముప్పు పొంచి ఉంది.
ఆహారంలో జంతు ఉత్పత్తుల వాడకం తగ్గించాలి కానీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మేక, గొర్రె వంటి రెడ్ మీట్ కాకుండా, చికెన్, చేపలు తీసుకోవడం బెటర్.
సముద్రపు చేపల్లో ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు, రక్తనాళాలకు ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటిని వేయించుకు తింటే వాటిలో ఉన్న గుడ్ కొలస్ట్రాల్ పోయి నష్టం జరుగుతుంది.
చేపలు తినడం వేరు, వాటి నూనెలను వాడటం వేరు. చేప నూనెలు గుండె ఆరోగ్యానికి మంచిదని ప్రాచారం జరుగుతుంది. ఇది కొంత మేరకు నిజమే.. కొన్ని రకాల చేప నూనెలు వాడటం వల్ల రక్తంలోని ఒక రకం కొవ్వు ట్రైగ్లిజరైడ్లు తగ్గి గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కానీ మార్కెట్లలో అమ్మే కొన్ని రకాల చేప నూనె సప్లీమెంట్లు కొన్ని సందర్భాల్లో గుండె లయకు నష్టం కలిగిస్తాయని అధ్యయనాల్లో తేలింది.
ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాల్లో పండ్లు, కూరగాయలు, గింజలు ముందు వరుసల్ ఉంటాయి. ఇవి శాచురేటెడ్ కొవ్వును తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది. ప్రోటీన్ అధికంగా ఉండే సోయా ఉత్పత్తులు శాచురేటెడ్ కొవ్వులకు మంచి ప్రత్యామ్నాయాలు. శరీరంలో పేరుకు పోయిన కొవ్వును తగ్గించుకోవడానికి సోయా చాలా ఉపయోగపడుతుంది.
ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల కొలస్ట్రాల్ నియంత్రణతోపాటు, డయాబెటీస్ కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అది కొలస్ట్రాల్ ను బంధించి శరీరం నుంచి తరిమేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు ప్రతి రోజు 40 గ్రాములు కరిగే ఫైబర్ ను ఆహారంలో తీసుకుంటే మేలని వైద్యులు చెబుతున్నారు. కూరగాయలు, పండ్లతో పాటు జొన్న, అవిసె, రాగులు వంటి తృణధాన్యాలు తీసుకుంటే కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇక చివరగా యోగా, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి కూడా కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram