Telangana Assembly Sessions
- ఈ నెల 31న రాష్ట్ర కేబినెట్
- నిర్ణయించిన ప్రభుత్వం
విధాత: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈనెల 31వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అలాగే ఆగస్టు 3వ తేదీ నుంచి అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి మండలి సమావేశం ఈనెల 31 మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో జరుగనున్నది. ఈ మంత్రి మండలి సమావేశంలో దాదాపు 40 నుంచి 50 అంశాల చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై సమీక్షిస్తారు.
రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై చర్చిస్తారు. అలాగే ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై చర్చిస్తారు. అలాగే ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినేట్ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపుతో పాటు ఇతర అంశాలపై మంత్రి మండలి చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నది.
ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ
శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఆగస్టు 3 వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది అసెంబ్లీ బిఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశం పలు బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది