Pcc chief: మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ
మంత్రివర్గ విస్తరణ అంశంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. మే నెలాఖరున లేదంటే జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై తాజాగా ఊహాగానాలు మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

– ముఖ్యమంత్రి మార్పు ఊహాగానమే
– మంత్రుల మధ్య ఎటువంటి విబేధాల్లేవు
– పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Pcc chief: మంత్రివర్గ విస్తరణపై తాజాగా మళ్లీ ఊహాగానాలు జోరందుకున్న విషయం తెలిసిందే. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి క్యాబినెట్ బెర్త్ ఖాయమంటూ ఇటీవల మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. దీంతో విస్తరణ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా ఈ అంశంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.
మే నెలాఖరున లేదంటే జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. శనివారం ఆయన నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఆశావహులు ఎక్కువ మంది ఉండటం.. ఖాళీలు తక్కువగా ఉండటంతోనే విస్తరణ ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చిందని చెప్పారు.
విస్తరణ అంశంలో ముఖ్యమంత్రి, అధిష్ఠానానిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. తాము కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విబేధాలు లేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మారబోతున్నట్టు వస్తున్న వార్తలను మహేశ్ కుమార్ గౌడ్ కొట్టి పారేశారు. ఇదంతా కేవలం విపక్షాల సృష్టి అంటూ క్లారిటీ ఇచ్చారు.
సురేఖ కామెంట్లు వక్రీకరించారు ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రి కొండా సురేఖ కామెంట్లను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇటీవల మహిళా కాంగ్రెస్ చేసిన ఆందోళనపై స్పందిస్తూ అదంతా సర్వ సాధారమేనని పేర్కొన్నారు. 26, 27 తేదీల్లో పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పారు.