విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ముస్లిం మైనార్టీలకు పిలుపునిస్తుందని కమిటీ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ సలీం పాషా, కోకన్వీనర్ షేక్ యూసఫ్ బాబాలు తెలిపారు. బీఆరెస్ పార్టీ పదేళ్లుగా ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన 12శాతం రిజర్వేషన్లు సహా ఇతర హామీలను అమలు చేయలేదన్నారు. అలాగే బీజేపీతో లోపాయికారిగా బీఆరెస్ సాగుతుందని, ఎంఐఎం బీఆరెస్‌కు మద్దతుగా వెలుతుందన్నారు. ముస్లింలు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఎదుర్కోంటున్న సమస్యలు, విధానాలపై కాంగ్రెస్ వైఖరీ సానుకూలంగా ఉందన్నారు. కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ కూడా భరోసానిచ్చేదిగా ఉందన్నారు.
ముస్లిం మైనార్టీ మేధావులు ఎన్నికల్లో ముస్లింల ప్రయోజనాల దిశగా అనుసరించాల్సిన తీరుపై విపులంగా చర్చించడం జరిగిందన్నారు. వారితో పాటు ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్స్ జేఏసీ నేతల అభిప్రాయాల మేరకు తెలంగాణ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కాగా ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఇండియన్ ముస్లిం లీగ్ సైతం కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది.