Drought | గోదారి త‌ల్లి నీళ్లు రంగు మార‌లేదు.. క‌రువొచ్చేస్తోందా?

Drought ప్ర‌కృతికి- మ‌నిషికి మ‌ధ్య లిపిలేని భాష‌, సంభాష‌ణ‌ కృష్ణా, గోదావ‌రి బేసిన్‌లో నిండ‌ని రిజ‌ర్వాయ‌ర్లు, డ్యామ్‌లు తెలంగాణ‌లో అతి త‌క్కువ వ‌ర్ష‌పాతం 122 ఏళ్ల చ‌రిత్ర‌లో జూన్‌లో అత్యల్ప వర్షపాతం ఎల్‌నినో ముంచుతుందా, తేల్చుతుందా? ప్ర‌కృతికి, మ‌నిషికి మ‌ధ్య కూడా ఒక లిపిలేని భాష ఉంటుంది. మాధ్య‌మం లేని సంభాష‌ణ కూడా జ‌రుగుతుంటుంది. అవును.. క‌రువు కాట‌కాలు, వ‌ర‌ద‌లు, తుఫానులు, పిడుగులు వంటి వైప‌రీత్యాలు రాబోతున్న‌ట్లు ప్ర‌కృతి అనేక ర‌కాలుగా తెలియ‌జేస్తుంది. దానిని అర్థం చేసుకునే […]

  • By: Somu    latest    Jul 20, 2023 12:30 AM IST
Drought | గోదారి త‌ల్లి నీళ్లు రంగు మార‌లేదు.. క‌రువొచ్చేస్తోందా?

Drought

  • ప్ర‌కృతికి- మ‌నిషికి మ‌ధ్య లిపిలేని భాష‌, సంభాష‌ణ‌
  • కృష్ణా, గోదావ‌రి బేసిన్‌లో నిండ‌ని రిజ‌ర్వాయ‌ర్లు, డ్యామ్‌లు
  • తెలంగాణ‌లో అతి త‌క్కువ వ‌ర్ష‌పాతం
  • 122 ఏళ్ల చ‌రిత్ర‌లో జూన్‌లో అత్యల్ప వర్షపాతం
  • ఎల్‌నినో ముంచుతుందా, తేల్చుతుందా?

ప్ర‌కృతికి, మ‌నిషికి మ‌ధ్య కూడా ఒక లిపిలేని భాష ఉంటుంది. మాధ్య‌మం లేని సంభాష‌ణ కూడా జ‌రుగుతుంటుంది. అవును.. క‌రువు కాట‌కాలు, వ‌ర‌ద‌లు, తుఫానులు, పిడుగులు వంటి వైప‌రీత్యాలు రాబోతున్న‌ట్లు ప్ర‌కృతి అనేక ర‌కాలుగా తెలియ‌జేస్తుంది. దానిని అర్థం చేసుకునే మ‌న‌షులే త‌గ్గిపోతున్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోనేకాదు, మొత్తంగా ద‌క్షిణాది రాష్ట్రాలు క‌రువు ప‌రిస్థితుల‌ను ఎదుర్కోబోతున్నాయ‌న‌డానికి ఇప్ప‌టివ‌ర‌కూ న‌మోదైన అత్య‌ల్ప వ‌ర్ష‌పాత‌మే నిద‌ర్శ‌నం.

కానీ ఈ విష‌యాన్ని ఏ వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌కంటే ముందే ఉభ‌య గోదావ‌రి జిల్లాల రైతులు ప‌సిగ‌ట్టేస్తారు. జూన్ మాసాంతం లేదా జూలై మొద‌టివారంలోగా గోదావ‌రి న‌ది నీళ్లు త‌న రంగు మార్చుకుంటే ఆ ఏడాది వ‌ర్షాల‌కు ఢోకా ఉండ‌ద‌ని న‌మ్ముతారు. ఈ రంగు మార‌డం ఆల‌స్య‌మైతోందంటే ఆ ఏడాది క‌రువు వ‌స్తుంద‌ని వారు ఇట్టే ప‌సిగ‌ట్టేస్తారు. నీరు రంగు ఎందుకు మారుతుందంటే…దుక్కి దున్ని చ‌దును చేసిన చెల‌క భూముల‌పై విస్తృత భూ భాగంలో భారీగా వ‌ర్షాలు కురిసి పొంగిపొర్లిన‌ప్పుడు, ఆ న‌దుల నీళ్లు మ‌ట్టి రంగును సంత‌రించుకుంటాయ‌న్న‌ది రైతు ఉద్దేశం.

ఇది ప్ర‌కృతిని న‌మ్ముకుని, పంట పొలాల‌తో సావాసం చేసే జాన‌ప‌దుల‌కు మాత్ర‌మే తెలిసిన ప్ర‌కృతి భాష‌. ఈ మాట 15 రోజుల క్రిత‌మే గోదావ‌రి జిల్లాకు చెందిన ఒక రైతు ఒక మీడియా మిత్రుడికి చెప్పారు. ఆ మిత్రుడు ఈ విష‌యాన్ని ఆ రోజే విధాత‌కు చెప్పారు. ఇప్పుడు ఆ రైతు మాట ఎంత స‌త్య‌మో… భార‌త వాతావ‌ర‌ణ శాఖ విడుద‌ల చేసిన వ‌ర్ష‌పాత నివేదిక చ‌దివాక అర్థ‌మైంది. ఆ రైతుకు ప్ర‌కృతి రూపంలో వ‌చ్చిన హెచ్చ‌రిక‌ నిజమే అన్న‌ట్లు ద‌క్షిణ భార‌త‌దేశ వ్యాప్తంగా అత్య‌ల్ప వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

గోదావ‌రి, కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతంలోని చాలా డ్యాములు, రిజ‌ర్వాయ‌ర్ల‌లో నీరు నిండ‌టం లేదు. వ‌ర్షాలు లేవు… ప్ర‌వాహం లేదు. ఈ పాటికి 60 నుంచి 70 శాతం నీళ్ల‌తో నిండుకుండ‌లా క‌నిపించాల్సిన చాలా డ్యాములు, రిజ‌ర్వాయ‌ర్లు గ‌త ఏడాది నింపుకున్న నీటితోనే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇంత‌కంటే క‌రువుకు వేరే సాక్ష్యం కావాలా?

122 ఏళ్ల చ‌రిత్ర‌లో జూన్‌లో అత్యల్ప వర్షపాతం

దక్షిణ భారతదేశంలో 122 ఏళ్ల చ‌రిత్ర‌లో జూన్‌లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. భారతదేశంలో అత్యధిక వర్షాలు కురుస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళలో కూడా కొన్ని జిల్లాల్లో ఈ ఏడాది చాలా తక్కువ వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, అత్యంత తీవ్రమైన బిప‌ర్ జాయ్ (Biparjoy) తుఫాను, మావార్, బంగాళాఖాతం గాలుల మధ్య పరస్పర చర్యలు ఈ అత్య‌ల్ప వ‌ర్ష‌పాతానికి కార‌ణ‌మ‌ని తేలింది. IMD లెక్క‌ల ప్రకారం, ద‌క్షిణ భార‌త‌దేశం జూన్ నెలలో మొత్తం 88.6 మిల్లీమీటర్ల (మిమీ) వర్షపాతం న‌మోదైంది. 1971-2020 సంవ‌త్స‌రాల మధ్య కురిసిన స‌గ‌టు వ‌ర్ష‌పాతం కంటే ఇది 45 శాతం తక్కువ. జూన్ చివరి నాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 10 శాతం ఉన్నప్పటికీ అనేక దక్షిణ భారత రాష్ట్రాలు వర్షపాతంలో భారీ లోటును కలిగి ఉన్నాయి.

తెలంగాణ‌లో అతిత‌క్కువ వ‌ర్ష‌పాతం

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) బులెటిన్ ప్రకారం, జూన్ 1నుండి జూలై 11 వరకు తెలంగాణ‌లో కుర‌వాల్సిన సాధారణ వర్షపాతం 197.5 మి.మీ. కాగా, కురిసింది కేవ‌లం 150.4 మి.మీ. అంటే సాధార‌ణం కంటే 24 శాతం త‌క్కువ వ‌ర్ష‌పాతం తెలంగాణ‌లో న‌మోదైంది. గత ఏడాది ఇదే కాలంలో రాష్ట్రంలో 395.6 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది.


“గత సంవత్సరంతో పోలిస్తే, తెలంగాణాలో 65 శాతం వర్షపాతం లోటు నమోదైంది” అని టిఎస్‌డిపిఎస్ నివేదిక‌లో స్ప‌ష్ట‌మైంది. జూన్ 24 నుండి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి కానీ, నిల‌క‌డ‌గా లేవు. వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేటలో సాధారణం కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదైంది, మిగిలిన 29 జిల్లాల్లో -5 శాతం (జనగాం జిల్లాలో) నుండి -51 శాతం (ఖమ్మం జిల్లాలో) వరకు లోటు వర్షపాతం నమోదైంది.

‘సగటు’ రుతుపవనాలున్నాఆందోళ‌న‌లో అన్న‌దాత‌

ఈసారి భార‌త‌దేశ వ్యాప్తంగా సగటు రుతుపవనాలు ఉన్న‌ప్ప‌టికీ కొన్ని రాష్ట్రాల్లో అసాధార‌ణ వ‌ర్షాలు ప‌డుతుంటే, మ‌రికొన్ని రాష్ట్రాల్లో అత్య‌ల్ప వ‌ర్షాలు న‌మోద‌వుతున్నాయి. ఇది అన్న‌దాత‌ల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. కొన్ని ఉత్త‌రాది, వాయువ్య రాష్ట్రాల్లో అధిక వర్షాలు పడుతుంటే, దక్షిణాది, తూర్పు ప్రాంతాలు మాత్రం వ‌రుణుడి క‌రుణ‌కోసం త‌పిస్తున్నాయి. జార్ఖండ్, బీహార్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మరియు కేరళలో 41శాతం వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతం. మ‌రోవైపు భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్తగా వేసిన వరి పంటలు దెబ్బతిన్నాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైతుల పంట‌లు నీట మునిగాయి.

ద‌క్షిణాదిలో మాత్రం వ‌ర్షాభావం కార‌ణంగా వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశ‌న‌గ పంట‌లకు అద‌ను దాటిపోయింది. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణతో సహా ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల్లో సోయాబీన్స్, వేరుశెనగ, పప్పులు, చెరకు వంటి పంట‌ల విస్తీర్ణం ప్ర‌మాద‌ర‌కంగా త‌గ్గిపోయింది. దీని ప్ర‌భావం కూర‌గాయ‌ల పంట‌ల‌పై కూడా భారీగా ప‌డింది. ఫ‌లిత‌మే ఆకాశాన్నంటుతున్న కూర‌గాయ‌ల రేట్లు. సెప్టెంబరు మధ్యకాలం వచ్చేసరికి, అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరగడం మొదలవుతుంది, ఆలస్యంగా నాటిన పంటల దిగుబ‌డికి ఇది ప్ర‌ధాన అవ‌రోధంగా మారుతుంది. ఇక ఆగ‌ష్టు నెల‌లో వ‌ర్ష‌పాతాన్ని ఎల్‌నినో భారీగా త‌గ్గించ‌వ‌చ్చ‌నే వాతావ‌ర‌ణ సంస్థ‌ల అంచ‌నాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

తాగునీటికి గండ‌మేనా?

కర్ణాటకలో, బెంగళూరుకు తాగునీటికోసం కావేరి నీటిని సరఫరా చేసే కృష్ణరాజసాగర్ (కెఆర్‌ఎస్) డ్యామ్ వంటి చాలా ప్రధాన డ్యామ్‌లు గరిష్టంగా 30 అడుగుల కంటే తక్కువ నీటి మట్టంతో దాదాపు అడుగంటిపోతున్న‌ ప‌రిస్థితి ఉంది. ఈ డ్యామ్‌లో గతేడాది 124.8 అడుగుల నీటి మ‌ట్టం ఉంటే, ఈసారి 106.5 అడుగులకు ప‌డిపోయింది. హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలకు ఉపయోగపడే తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 4.1TMC నీరు మాత్రమే ఉంది, ఇది గత సంవత్సరం 43.9 TMC కంటే గణనీయంగా తగ్గింది. కర్ణాటకలోని కావేరి, తుంగభద్ర వంటి నదుల్లో నీరు నిండేందుకు ఉప‌యోగ‌ప‌డే పరివాహక ప్రాంతాలు రుతుపవనాల సీజన్‌లో మొదటి 35 రోజులలో సాధారణ వర్షపాతం కంటే మూడింట ఒక వంతు కంటే తక్కువగా కురిసినట్లు కర్ణాటక రాష్ట్ర అధికారులు స్ప‌ష్టం చేశారు. ఈ ప‌రిస్థితి సాగు నీటికేకాదు, తాగునీటికి, క‌రెంటు ఉత్ప‌త్తికి కూడా గండంగా మారుతుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

గోదావరికి చేరుతున్న నీరు అంతంత మాత్ర‌మే…

మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో ఉద్భవించి బంగాళాఖాతంలో కలుస్తున్నగోదావరి నది భారతదేశంలో రెండవ పొడవైన నది. ఇది భారత ఉపఖండంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతాలలో ఒకటి.ఈ న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతంలోని గంగాపూర్ మొద‌లుకొని, జయక్వాడి ఆనకట్ట, బాబ్లీ బ్యారేజీ, విష్ణుపురి బ్యారేజీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇంకా ఆశించిన మేర‌కు ప్ర‌వాహం రాలేదు. రిజ‌ర్వాయ‌ర్లు, డ్యామ్‌లు సైతం ఈ ఏడాది నీటికోసం ఎదురుచూసే ప‌రిస్థితి. జ‌యక్వాడి బ్యారేజ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 27.52 శాతం మాత్ర‌మే నీరు వ‌చ్చింది. గ‌తేడాది ఇదే స‌మ‌యానికి 72 శాతం నిండిపోయింది. మంజ‌రా డ్యామ్ ఇప్ప‌టివ‌ర‌కు 22.86 శాతం మాత్ర‌మే నిండింది. దూధాన డ్యామ్‌లో 25 శాతం మాత్ర‌మే నిండింది. మాన‌ర్ డ్యాం 32 శాతం నిండింది, గ‌త ఏడాది ఈపాటికే వంద‌ శాతం నిండింది.

కృష్ణా బేసిన్‌లో అదే ప‌రిస్థితి

కృష్ణా న‌ది ప‌రీవాహ‌క ప్రాంతంలోనూ ఇవే వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జూలై నాటికి కూడా స‌గ‌టు వ‌ర్ష‌పాతం న‌మోదు కాలేదు. ఆగ‌స్టు నాటికి కూడా పూర్తిగా నిండే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. జూలై 19నాటికి కృష్ణా బేసిన్‌లోని వివిధ డ్యాముల్లో క‌నీస నీటి మ‌ట్టం కూడా లేని ప‌రిస్థితి ఉంది. ఆల‌మ‌ట్టి డ్యామ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 21.88 శాతం మాత్ర‌మే నీరు చేరింది. గ‌తేడాది ఈపాటికి 70 శాతం నిండిపోయింది. నారాయ‌ణ‌పుర డ్యామ్ ఇప్ప‌టివ‌ర‌కు 41.8 శాతం నిండ‌గా, గ‌తేడాది ఈపాటికే అది 84 శాతం నిండింది. తుంగ‌భధ్ర డ్యాం ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 10.35 శాతం మాత్ర‌మే నీరు నిండ‌గా, గ‌తేడాది జూలై మూడో వారం నాటికి 91.54 శాతం నిండింది.

ఘ‌ట‌ప్ర‌భలో ఇప్ప‌టివ‌ర‌కు 15 శాతం నీరు నిండగా, గ‌తేడాది ఈపాటికి 58.7 శాతం నిండింది. మ‌ల‌ప్ర‌భలో ఇప్ప‌టివ‌ర‌కు18 శాతం నిండ‌గా, గ‌తేడాది 59 శాతం నిండింది. భ‌ద్ర డ్యాం ఇప్ప‌టివ‌ర‌కు 38.96 శాతం నిండ‌గా, గ‌తేడాది ఈపాటికి 93.5 శాతం నిండింది. ఇటు కృష్ణా, అటు గోదావ‌రి బేసిన్‌లోని ప్ర‌ధాన డ్యామ్‌లు, రిజ‌ర్వాయ‌ర్లు నిండేందుకు ఇంకా చాలా రోజులు ప‌ట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో వ‌రి, ప‌త్తి, ప‌ప్పు ధాన్యాల పంట‌లు స‌కాలంలో విత్తుకునే ప‌రిస్థితి లేద‌న్నదిగులు రైతుల్లో నెల‌కొంది. ఈసారి నీటిక‌రువుతోపాటు, తిండి గింజ‌ల క‌రువు కూడా వ‌చ్చేసిన‌ట్లే అన్న ఆందోళ‌న క‌నిపిస్తోంది.