TSRTC | ఆర్టీసీ విలీనం సరే.. ఆస్తులు పదిలమేనా!
TSRTC | రాష్ట్రవ్యాప్తంగా సంస్థకు 80 వేల కోట్ల ఆస్తులు 11 రీజియన్లలో 1,404 ఎకరాల భూములు ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 251 ఎకరాలు కేవలం బస్‌భవన్ విలువే రూ.650 కోట్లు సంస్థ విలీనంతో ఆస్తులన్నీ ప్రభుత్వ చేతికి ఇప్పటికే భూములను అమ్ముతున్నసీఎం ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారని విపక్షాల ఆరోపణ విధాత: తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ ఆర్టీసీ) ప్రభుత్వంలో విలీనమైంది. ఈ సంస్థకు చెందిన వేల కోట్ల ఆస్తి కూడా రాష్ట్ర ప్రభుత్వ […]

TSRTC |
- రాష్ట్రవ్యాప్తంగా సంస్థకు 80 వేల కోట్ల ఆస్తులు
- 11 రీజియన్లలో 1,404 ఎకరాల భూములు
- ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 251 ఎకరాలు
- కేవలం బస్‌భవన్ విలువే రూ.650 కోట్లు
- సంస్థ విలీనంతో ఆస్తులన్నీ ప్రభుత్వ చేతికి
- ఇప్పటికే భూములను అమ్ముతున్నసీఎం
- ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారని విపక్షాల ఆరోపణ
విధాత: తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ ఆర్టీసీ) ప్రభుత్వంలో విలీనమైంది. ఈ సంస్థకు చెందిన వేల కోట్ల ఆస్తి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి సుమారు 80 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. 11 రీజియన్లలో 1,404 ఎకరాల భూములు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ సర్కారు ప్రభుత్వ భూములను అందినకాడికి అమ్మకానికి పెడుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి చెందిన వేల ఎకరాలు భూములు అమ్మేందుకే సంస్థను ప్రభుత్వంలో కేసీఆర్ విలీనం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రతి నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. గతంలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేసీఆర్ నాలుక మడతేసి.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేశారు. రైతుబంధు, రైతు రుణమాఫీ వంటి పథకాల అమలుకు ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకున్నాయి. ఎన్నికల వేళ కీలక పథకాల అమలుకు బ్రేక్ పడితే అది పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతుందని భావించి ఇటీవల హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు అమ్మగా వచ్చిన డబ్బులతో రైతుల రుణమాఫీ డబ్బులు చెల్లించినట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థ భూములు అమ్మే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలోనే కేసీఆర్ విలీనం నిర్ణయం తీసుకున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని కేసీఆర్ విలీనం చేసిందని ఆ సంస్థ ఆస్తులు అమ్ముకోవడానికేనని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు గతంలోనే తీవ్ర ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఆర్టీసీ ఆస్తులు పదిలమేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధిక ఆస్తులు ఆర్టీసీకే
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్టీసీకే అత్యధిక విలువైన భూములు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వరంగ సంస్థల భూముల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా, శాఖలవారీగా నివేదికలు సమర్పించాయి. వాటిలో అత్యంత విలువైన భూములు ఆర్టీసీ తెలిసింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైమ్ ఏరియాలో ఈ సంస్థకు భూములు ఉన్నాయి. దాదాపు ప్రతి జిల్లాలో వంద ఎకరాలకు పైగా ఆర్టీసీకి భూములు ఉన్నాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 251 ఎకరాల భూములు ఉన్నాయి. ఇలా సుమారు రూ.80 వేల కోట్ల వరకు ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి.
రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులు అంతంటే..
మొత్తం బస్టాండ్లు 364
11 రీజియన్లలో 97 డిపోలు
24 డివిజన్లు
రెండు జోనల్ వర్క్‌షాప్‌లు
ఒక బస్ బాడీ యూనిట్
రెండు టైర్ రీ ట్రేడింగ్ షాపులు
ఒక ప్రింటింగ్ ప్రెస్
హకీంపేట ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ
స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ
14 డిస్పెన్సరీలు
ఆర్టీసీ క్రాస్‌రోడ్డు బస్‌భవన్.