నేడే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. కీలక అజెండా ఇదే!

రైతుభరోసాను కౌలు రైతులకు అమలు చేయడం, గృహలక్ష్మి అమలు, ధరణి పోర్టల్‌ తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు.

నేడే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. కీలక అజెండా ఇదే!
  • పరిపాలనపై పట్టు దిశగా!
  • నేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. రేవంత్‌ సర్కారుకు తొలిసారి
  • ప‌థ‌కాల అమ‌లుపై క‌స‌ర‌త్తు
  • కొత్త రేష‌న్ కార్డులు, గృహ‌ల‌క్ష్మి,
  • ధ‌ర‌ణి, కౌలు రైతుల‌కు రైతు భ‌రోసా
  • తదితర అంశాలపై కీలక చర్చలు
  • 28 నుంచి గ్రామాల్లో ప్ర‌జాపాల‌న స‌భ‌లు


విధాత‌, హైద‌రాబాద్‌: పాల‌న‌పై ప‌ట్టు సాధించే దిశ‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ‌డివ‌డిగా అడుగులేస్తున్నారు. తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. పాల‌న‌లో త‌న మార్క్ చూపించే ప్ర‌య‌త్నాల్లో రేవంత్ ఉన్నారు. ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత‌ మొద‌టిసారిగా జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌చివాల‌యంలోని వెస్ట‌ర్న్‌డోమ్‌లో నిర్వ‌హించే ఈ స‌మావేశంలో ప్ర‌జాపాల‌న‌పై క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశ‌నం చేయ‌నున్నారని తెలుస్తున్నది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు,వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప‌ట్టిన వెంట‌నే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమ‌లు చేశారు. ఆ వెంట‌నే ఆర్థిక, విద్యుత్తు, ధ‌ర‌ణిపై స‌మీక్ష‌లు నిర్వ‌హించి, ప్రభుత్వ ఉద్దేశాలను వివరించారు. వెంట వెంట‌నే అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించి శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేసిన రేవంత్ రెడ్డి ఇప్ప‌డు మ‌రో అడుగు మందుకేసి గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల‌నుంచి స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ మేర‌కు జిల్లా, డివిజ‌న్‌, మండ‌ల స్థాయి నుంచి అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల‌లో ప్ర‌జాపాల‌న స‌భ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ స‌భ‌ల ద్వారా యావ‌త్ ప్ర‌భుత్వ యంత్రాంగంతో పాటు ప్ర‌జా ప్ర‌తినిధులంతా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటార‌న్న సంకేతాన్ని ఇవ్వాల‌నేది ముఖ్యమంత్రి అభిప్రాయంగా తెలుస్తున్నది.


మొద‌టి రోజునే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి అక్క‌డే ప్ర‌జా దర్బార్‌లను నిర్వ‌హిస్తున్నారు. దీని ద్వారా సామాన్య ప్ర‌జ‌లు నేరుగా సీఎంను, మంత్రులను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోనే వీలు కల్పించారు. గ‌త ప్ర‌భుత్వం ఇందుకు విరుద్ధంగా ప్ర‌జ‌లను ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం లేదనే భావనతో ఉండేది. అందుకే ఏనాడూ ఆనాటి సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను క‌లిసి విన‌తులు స్వీక‌రించే కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌లేదు. తాజాగా రేవంత్ రెడ్డి పాత పద్ధతికి తిలోద‌కాలు ఇచ్చి నేరుగా ప్ర‌జ‌ల‌ను క‌లిసి విన‌తులు స్వీక‌రించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇదే త‌ర‌హాలో అన్ని గ్రామాల‌లో కూడా ప్ర‌జా పాల‌న సభ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వ‌మే నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌న్న కాన్సెప్ట్ తీసుకున్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విజ్ఞప్తుల ఆధారంగా సదరు స‌మ‌స్య‌లపై విధాన నిర్ణ‌యాలు తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నార‌న్న చ‌ర్చ కూడా అధికార వ‌ర్గాల‌లో జ‌రుగుతోంది.


నాలుగు అంశాలపై కీలక నిర్ణయాలు!

క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ముఖ్యంగా నాలుగు అంశాల‌పై సీఎం రేవంత్ విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవ‌కాశం ఉందని చెబుతున్నారు. ఆరు గ్యారెంటీల అమ‌లును వంద రోజులో అమ‌లు చేయ‌డం అనేది ప్ర‌ధాన అంశంగా ఉండ‌నున్న‌ది. ఇందులో భాగంగా కొత్త రేష‌న్ కార్డుల జారీ, గృహ‌ల‌క్ష్మి పథకం అమ‌లుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ధ‌ర‌ణి స‌మ‌స్య‌తో పాటు, రైతు భ‌రోసాను కౌలు రైతుల‌కు అమ‌లు చేసే అంశాల‌పై చ‌ర్చించి క‌లెక్ట‌ర్ల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వ‌నున్నారని చెబుతున్నారు.


ప్రజాపాలనపై దృష్టి

గత ప్రభుత్వ లోపాలను అరికట్టడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజా పాలన’పై సీఎం రేవంత్ క‌లెక్ట‌ర్ల‌కు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్న ప్రభుత్వం.. ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో వివరిస్తారని సమాచారం. దీనితోపాటు, ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకై ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు.


28 నుంచి ప్రజాపాలన సదస్సులు

ఈ నెల 28 నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు ప్ర‌జాపాల‌న స‌ద‌స్సులు నిర్వ‌హిస్తారు. ఈ స‌ద‌స్సులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి. ఈ ప్రజాపాలన స‌భ‌ల‌కు స్థానిక సర్పంచ్‌లు, కార్పొరేటర్‌లు, కౌన్సిలర్‌లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు.