Salary Controversy | తెలంగాణలో జీతాల లొల్లి… స్వీపర్‌కు రూ.2 లక్షలు.. ఎస్ఈకి రూ.7 లక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల అంశం మరసారి చర్చల్లోకి వచ్చింది. ఒకవైపు స్వయానా సీఎస్‌ రామకృష్ణారావు ఈ జీతాల వ్యవహారాన్ని కదపగా.. మరోవైపు విద్యా కమిషన్‌ సైతం టీచర్లకు ఎక్కువ జీతాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై ప్రజల్లో తీవ్ర చర్చలు సాగుతున్నాయి.

Salary Controversy | తెలంగాణలో జీతాల లొల్లి… స్వీపర్‌కు రూ.2 లక్షలు.. ఎస్ఈకి రూ.7 లక్షలు
  • ఐఏఎస్ అత్యధిక జీతం రూ.3 లక్షలే
  • ఉపాధ్యాయుల జీతాలపై కమిషన్ ఆక్షేపణ
  • కొత్త చర్చకు తెరలేపిన తెలంగాణ సర్కార్
  • ఇవేమీ జీతాలంటున్న తెలంగాణ ప్రజలు

విధాత, హైదరాబాద్:
Salary Controversy | ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల అంశం సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో విస్తృత‌ చర్చకు దారితీస్తోంది. ఫంక్షన్లు, గ్రామాల రచ్చబండల దగ్గర ఏ ఐదారుగురు కలిసినా.. ఇంత భారీ జీతాలు ఇస్తున్నారా? అని విస్తుపోతున్నారు. స్వీపర్ జీతం నెలకు రూ.2 లక్షలు, కరెంటు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్ఈ) జీతం రూ.7 లక్షలంట… ఇంతగా ఎలా పెంచారు? అంటూ మధ్యతరగతి ప్రజలు మండిపోతున్నారు. ఈ జీతాల లెక్కలు చెప్పింది ఎవరో కాదు. ఉపాధ్యాయుల జీతాలపై విద్యా కమిషన్ వివరించగా, స్వీపర్, ఎస్ఈ జీతాలను స్వయానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామ‌కృష్ణారావు లేవనెత్తారు. రెండు మూడు రోజులు అటు ఇటుగా ఇద్దరూ జీతాల విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో చర్చకు తెరలేపారంటున్నారు. ఈ జీతాల వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

పదేళ్లలో మూడింతలు పెరిగిన జీతాలు, పెన్షన్లు

తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉందని గత బీఆర్ఎస్ పాలకులు ప్రభుత్వ నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ధనిక రాష్ట్రం అంటూ వివిధ వర్గాల ప్రజలకు తాయిలాలు ప్రకటించి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదే ఒరవడిలో ప్రభుత్వ ఉద్యోగులు ఊహించని విధంగా రెండు పీఆర్సీలు ఇచ్చారు. ఈ నిర్ణయాల మూలంగా లాభం జరిగిందా, నష్టం జరుగుతోందా అనేదానిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్చను ముందు పెట్టింది.

సీఎస్‌ వ్యాఖ్యలతో రచ్చ

గత నెల చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామ‌కృష్ణారావు అమీర్ పేటలోని సెస్‌ ఆడిటోరియంలో 16వ ఆర్థిక కమిషన్ సిఫారసులపై జరిగిన సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో ఇచ్చిన జీతాలతో పోల్చితే 2025 నాటికి 300 శాతం పెరిగాయని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నాలుగింతలు పెరిగిందన్నారు. రెండు పే రివిజన్ కమిషన్ సిఫారసుల మూలంగా ఇంత భారీగా వేతనాలు, పెన్షన్లు పెరిగాయని స్పష్టం చేశారు. 2014లో ప్రతి నెలా రూ.1,500 కోట్లు ఉండగా ఇప్పుడది రూ.6వేల కోట్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా వేతనాలు, పెన్షన్ల కోసం రూ.6వేల కోట్ల చొప్పున విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఇంజినీర్ వేతనం రూ.7 లక్షలు కాగా, స్వీపర్ లేదా అటెండర్ జీతం రూ.2 లక్షల వరకు ఉందని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేసే చీఫ్ ఇంజినీర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణి విద్యుత్ సంస్థలకే పరిమితం కాదని, మున్సిపాల్టీలలో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి ప్రారంభ జీతం నెలకు రూ.28వేలు ఉందన్నారు. మూడు దశాబ్ధాల సర్వీసు ఉన్న డ్రైవర్ లేదా పారిశుధ్య కార్మికుడికి ప్రతి నెలా రూ.1 లక్ష కన్నా ఎక్కువగా వేతనం పొందుతున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో రెగ్యులరైజ్ చేసిన పారిశుధ్య కార్మికులు (మొత్తం సిబ్బందిలో రెండు శాతం) వేతనం నెలకు సగటున రూ.70వేల వరకు పొందుతున్నారన్నారు. భారీగా వేతనాలు ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ మధ్యకాలంలో తెలంగాణ లో డిమాండ్ పెరిగిందన్నారు. 563 గ్రూప్ వన్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా ఒక్క పోస్టుకు 799 మంది పోటీపడ్డారన్నారు. ఈ పోస్టులను దక్కించుకునేందుకు సంవత్సరాల తరబడి చదివారని, కోచింగ్ సంస్థలకు కాసులు కురిశాయని చెప్పారు. బడ్జెట్‌లో జీతాలు, పెన్షన్లకు వ్యయం పెరగడంతో పాటు, ఆర్థిక వనరులు కూడా పెరిగాయన్నారు. ఆర్థిక పురోగతిలో 11 శాతం పెరుగుదల ఉందని ఆయన వివరించారు.

రూ.15 లక్షల కోట్లలో రూ.12 లక్షల కోట్లు జీతాలు, పెన్షన్లు, అప్పులకే

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు రూ.15 లక్షల కోట్లు వ్యయం చేయడం లేదా విడుదల చేయడం జరిగిందని సీఎస్‌ వెల్లడించారు. ఇందులో రూ.12 లక్షల కోట్లు (80 శాతం) ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్లు, అప్పులు తీర్చడానికే చెల్లించినట్లు వివరించారు. ఒక రాష్ట్రం లేదా దేశం అభివృద్ధి సాధించడానికి, ప్రభుత్వ ఆస్తులు తయారు చేయడానికి మూలధన కేటాయింపులు ముఖ్యమన్నారు. ఇందుకోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఆస్తుల అమ్మకాల ద్వారా కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే సమకూరాయన్నారు. రైతు బంధు పథకానికి రూ.7వేల కోట్లు విడుదల చేశామని, ఇందులో ఆరు శాతం వరకు దుబారా ఉండవచ్చని ప్రధాన కార్యదర్శి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

విద్యా కమిషన్ సిఫారసులపై భగ్గుమన్న టీచర్లు

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది జీతాలపై తెలంగాణ విద్యా కమిషన్ కూడా ఇటీవలే నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది. తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదిక – 2026 తీవ్ర చర్చనీయాంశమైంది. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది జీతాలు అధికంగా ఉన్నాయని, మార్కెట్ సగటుతో పోల్చాలని కమిషన్ అభిప్రాయపడింది. ఈ సిఫారసులపై ఉపాధ్యాయ సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. విద్యా కమిషన్ నివేదిక విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి చర్చలు జరిపిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు కే కేశవ రావు చెప్పాల్సి వచ్చింది. జీతాలు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం లేదని ఆయన కొట్టిపారేశారు. తెలిసీ తెలియక విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. సమాజంలో విద్యార్థులు దారితప్పకుండా వారికి విద్యా బుద్ధులు నేర్పి గొప్పవాళ్లుగా తిర్చిదిద్ది ప్రయోజకులు చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి అని ఆయన కొనియాడారు.

తప్పుల తడకలా నివేదిక

ప్రతిపక్షాలు మాత్రం ఈ నివేదిక తప్పుల తడకగా ఉందని విమర్శిస్తున్నాయి. కమిషన్ నివేదికలో జీతాలే కాకుండా విద్యా వ్యవస్థ పటిష్టం చేసేందుకు పలు సిఫారసులు చేసింది. 50 శాతం హెడ్మాస్టర్ పోస్టులను నేరుగా నియమించాలని, ఐదేళ్ల తరువాత వంద శాతం పోస్టులను నేరుగా నియామకం చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల పనితీరు ప్రతి ఐదేళ్లకు ఒకసారి మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. ఇకనుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించాలనే ప్రతిపాదన సైతం వివాదాస్పదమైంది. ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు అధ్యాపకులు వేర్వేరుగా మూల్యాంకనం చేయాలని కూడా పేర్కొంది. ఈ సిఫారసులపై ప్రభుత్వ ఉపాధ్యాయులు, సంఘాల అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రస్తుత మార్కెట్ కన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయని, భవిష్యత్తులో సమీక్షించాలని సిఫారసులు చేయడం అన్యాయమని మండిపడ్డాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, కొఠారి కమిషన్ నివేదికకు భిన్నంగా విద్యా కమిషన్ సిఫారసు చేయడం సరైంది కాదన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువగా ఉన్నాయని, ఆ వివరాలు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also |

Indian Rupee : యుద్దం ఎఫెక్ట్..భారీగా పడిపోయిన రూపాయి విలువ !
99 Day Prajapalana | 99 రోజుల ప్రణాళిక బాగానే ఉంది.. కానీ.. అమలు పైనే అసలు ఫలితం
Gulf Countries | గల్ఫ్ దేశాల అసలు బలహీనత పడింది.. యుద్దంలో తాగునీటి ప్లాంట్లు కాపాడుకోవడమే మెయిన్ టాస్క్!