BRS | కేటీఆరే ఇక దిక్కు! మార్పులపై సిటింగ్‌లలో పెరుగుతున్న టెన్షన్‌

BRS | ఆయన వచ్చేస్తున్నారు.. మంచి జరుగకపోదా! ఆశావహులు, అసంతృప్తుల ఎదురుచూపులు మార్పులపై సిటింగ్‌లలో పెరుగుతున్న టెన్షన్‌ ఎన్నాళ్లీ ఎదురుచూపులంటున్న ఉద్యమకారులు విధాత: బీఆరెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన వెలువడగానే అమెరికా పర్యటనకు వెళ్లిపోయిన మంత్రి కేటీఆర్ శనివారం తిరిగి వస్తున్నారు. దీంతో తొలి జాబితాల్లో టికెట్లు దక్కనివారు, ఇంకా టికెట్‌ వస్తుందనే ఆశలోనే ఉన్నవారు, అసంతృప్తివాదులు, ఉద్యమకారులు కేటీఆర్ రాక కోసం కళ్లనిండా ఆశలు నింపుకొని ఎదురు చూస్తున్నారు. కాగా.. తాము […]

BRS | కేటీఆరే ఇక దిక్కు! మార్పులపై సిటింగ్‌లలో పెరుగుతున్న టెన్షన్‌

BRS |

  • ఆయన వచ్చేస్తున్నారు.. మంచి జరుగకపోదా!
  • ఆశావహులు, అసంతృప్తుల ఎదురుచూపులు
  • మార్పులపై సిటింగ్‌లలో పెరుగుతున్న టెన్షన్‌
  • ఎన్నాళ్లీ ఎదురుచూపులంటున్న ఉద్యమకారులు

విధాత: బీఆరెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన వెలువడగానే అమెరికా పర్యటనకు వెళ్లిపోయిన మంత్రి కేటీఆర్ శనివారం తిరిగి వస్తున్నారు. దీంతో తొలి జాబితాల్లో టికెట్లు దక్కనివారు, ఇంకా టికెట్‌ వస్తుందనే ఆశలోనే ఉన్నవారు, అసంతృప్తివాదులు, ఉద్యమకారులు కేటీఆర్ రాక కోసం కళ్లనిండా ఆశలు నింపుకొని ఎదురు చూస్తున్నారు.

కాగా.. తాము ఊహించని తీరులో ప్రకటించిన అభ్యర్థులలో మార్పులు చేర్పులు జరిగి, తమకు టికెట్లు దక్కుతాయా లేక ప్రత్యామ్నాయ పదవులపై గట్టి హామీలైన ఇస్తారా? అన్న దింపుడు కల్లం ఆశలతో ఉన్న వారంతా కేటీఆర్‌తో చర్చల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనతో చర్చించి, అక్కడి నుంచి వచ్చే హామీకి అనుగుణంగా తమ భవిష్యత్తుపై ఒక స్పష్టత తెచ్చుకోవాలని ఆశిస్తున్నారని సమాచారం.

జాబితాతో ఎగసిని అసంతృప్తి

బీఆరెస్ తొలి జాబితా వెలువడగానే పలు నియోజకవర్గాల్లో సిటింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలను మార్చాలని పెద్ద ఎత్తున ఆశావహులు, అసంతృప్తులు అసమ్మతిని లేవదీశారు. అయితే మంత్రి కేటీఆర్ వచ్చాక మాట్లాడుదాం అంటూ సీనియర్‌ నేతలు వారిని బుజ్జగిస్తూ వచ్చారు.

ఇక కేటీఆర్ రాష్ట్రానికి చేరుకోగానే ఆయనతో మాట్లాడి టికెట్‌పై తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. దాదాపు 25 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఆశావహులు, అసంతృప్తులు, ఉద్యమకారులు కేటీఆర్‌తో భేటీ కోసం ఎదురు చూస్తుండటం ఆసమ్మతి తీవ్రతకు నిదర్శనంగా కనిపిస్తున్నది.

బుజ్జగింపుల దిశగా ఎమ్మెల్సీ పదవులిస్తామంటే నమ్మే పరిస్థితి లేదని గులాబీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఎందుకంటే ఉన్న 40 ఎమ్మెల్సీల్లో గవర్నర్‌ కోటా ఇద్దరు ఎమ్మెల్సీల భర్తీ ప్రతిపాదన పెండింగ్ పక్కన పెడితే మిగతా స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఖాళీలు లేవు. ఎమ్మెల్యే టికెట్లు సాధించిన పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పదవులను వదులుకుంటారు.

ఇక 2025లో మాత్రం మరో ఏడు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. నెలలోనే రాజకీయాలు మారిపోతున్న వేళ.. రెండేళ్లు అంటే ఇంకెన్ని మార్పులుంటాయో అర్థం చేసుకోవడం కష్టం ఏమీ కాదు. గతంలో ఎమ్మెల్సీ హామీలు పొందిన నేతలే ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నారన్న చర్చ అసంతృప్తులను మరింత అభద్రతా భావానికి గురి చేస్తున్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

కేటీఆర్ రాకతో సిటింగ్‌లలో ఉత్కంఠ

మంత్రి కేటీఆర్‌తో ఆశావహులు, అసంతృప్తివాదులు భేటీ కానున్న నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు పొందిన సిటింగ్ ఎమ్మెల్యేల్లో, అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. అంసతృప్తులతో చర్చల తర్వాత కేటీఆర్ టికెట్ల మార్పుపై నిర్ణయం తీసుకుంటే ఎక్కడ తమ టికెట్ గల్లంతవుతుందేమోనన్న గుబులు వారిని కలవర పెడుతున్నదని చెబుతున్నారు.

ప్రధానంగా సీఎం కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న వారిలో ఉప్పల్ టికెట్ ఆశించిన బొంతు రామ్మోహన్‌, సిటింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కంటోన్మెంట్ ఆశావహులు మన్నె క్రిశాంక్‌, గజ్జెల నరేశ్‌, మధిర ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి, జహీరాబాద్ టికెట్ ఆశించిన ఢిల్లీ వసంత్‌ ఉన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తిరుగుబాటు నేపథ్యంలో ఆయన టికెట్ రద్దయితే బొంతు రాంమోహన్ పేరు కూడా రేసులో వినిపిస్తున్నది.

అటు శంభీపూర్ రాజు, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా మల్కాజిగిరి టికెట్ సాధనకు కేటీఆర్‌తో భేటీ కోసం ఎదురు చూస్తున్నారన్న చర్చ నడుస్తున్నది. అంబర్ పేట సిటింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశంకు టికెట్ వద్దంటూ టికెట్ ఆశించిన ఎడ్ల సుధాకర్ రెడ్డి, దూసరి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ పద్మావతి తమ వాదనలను కేటీఆర్‌కు వినిపించాలని అనుకుంటున్నట్టు సమాచారం.

కొత్తగూడెం బీఆరెస్ నేత దిండిగళ్ల రాజేందర్‌, కోదాడకు చెందిన కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మునుగోడుకు చెందిన రవి ముదిరాజ్‌, కర్నాటి విద్యాసాగర్, వెన్‌రెడ్డి రాజు సహా ఇతర అసంతృప్తివాదులు, నాగార్జున సాగర్‌, దేవరకొండ, నకిరేకల్‌, నల్లగొండలలో సిటింగ్‌లకు టికెట్లను వ్యతిరేకిస్తున్న నేతలంతా కేటీఆర్‌తో భేటీ కోసం ప్రయత్నిస్తున్నారు.

అలాగే నిర్మల్ జిల్లా ముథోల్ టికెట్‌ను విఠల్‌రెడ్డికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రాజేశ్‌బాబు, పటాన్ చెరువు బీఆరెస్ నేత నీలం మధు ముదిరాజ్‌, పెద్దపల్లి, మంథని, రామగుండంకు చెందిన నల్ల మనోహర్‌రెడ్డి, చల్లా నారాయణరెడ్డి, కందుల సంధ్యారాణిలు కేటీఆర్ అపాయింట్‌మెంట్‌ కోరుతున్నారని సమాచారం.

మంచిర్యాల సిటింగ్ దివాకర్‌రావు టికెట్ మార్చాలని కోరుతున్న మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి, కల్వకుర్తి ఉద్యమకారులు బాలాజీసింగ్‌, హనుమాన్‌నాయక్‌లు, సంగారెడ్డి ఉద్యమకారులు, ఆశావహులు, భద్రాచలం టికెట్ ఆశించిన మార్కెట్ చైర్మన్ బుచ్చయ్య, నారాయణ ఖేడ్‌కు చెందిన విగ్రహం శ్రీనివాస్‌గౌడ్ ప్రభృతులు కేటీఆర్‌తో చర్చల కోసం ఎదురుచూస్తున్నారు.