దేశంలో ప్రతి గంటకూ ముగ్గురి హత్య.. ఎన్‌సీఈఆర్‌బీ నివేదిక వెల్లడి
దేశంలో 2022 సంవత్సరానికి సంబంధించి మొత్తం 28,522 హత్య కేసులు నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఈఆర్‌బీ) నివేదిక వెల్లడించింది

విధాత: దేశంలో 2022 సంవత్సరానికి సంబంధించి మొత్తం 28,522 హత్య కేసులు నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఈఆర్‌బీ) నివేదిక వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా సగటున రోజుకు 78, ప్రతి గంటకూ మూడు కంటే ఎక్కువ హత్యలు (Murders in Country) జరుగుతున్నట్లు తెలిపింది. అయితే 2021లో నమోదైన 29,272, 2020లో నమోదైన 29,193 కేసుల కంటే 2022లో తక్కువ హత్య కేసులే నమోదయ్యాయని తెలిపిందే.
రాష్ట్రాల వారీగా చూస్తే హత్య కేసుల నమోదులో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 2022లో 3,491 కేసులు నమోదయ్యాయి. తర్వాత బిహార్ (2,930), మహారాష్ట్ర (2,295), మధ్యప్రదేశ్ (1,978), రాజస్థాన్ (1,834), పశ్చిమ బెంగాల్ (1,696) ఉన్నట్లు ఎన్‌సీఈఆర్‌బీ నివేదిక వెల్లడించింది. సిక్కింలో అత్యంత తక్కువ గా 9 హత్యా కేసులు నమోదు కాగా.. తర్వాత నాగాలాండ్ (21), మిజోరం (31), గోవా (44), మణిపుర్ (47) లు ఉన్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిల్లీలో అత్యధికంగా 509 హత్యలు జరగగా.. జమ్మూ కశ్మీర్ (99), పుదుచ్చేరి (30), చండీగఢ్ (18), దాద్రా నగర్ హవేలీ, దయ్యూ దామన్ (16), అండమాన్ నికోబార్ దీవులు (7) లడఖ్ (5) లక్షద్వీప్ (0) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హత్యల్లో చనిపోయిన వారిలో 95.4 శాతం మంది మేజర్లేనని నివేదిక పేర్కొంది. అలాగా ప్రాణాలు కోల్పోయిన వారిలో 70 శాతం మంది మగవారేని, తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని వెల్లడించింది.
హత్యలకు ప్రధాన కారణం ఇదే..
దేశంలో నమోదైన హత్య కేసుల్లో 9,962 ఘటనలకు ఇరువురి మధ్య ఉన్న తగాదాలే కారణమని ఎన్‌సీఆర్‌బీ (NCRB) వెల్లడించింది. ఈ కారణంతో మహారాష్ట్రలో 1130 హత్యలు జరగగా తర్వాత తమిళనాడులో 1,045 మర్డర్లు జరిగాయి. వ్యక్తిగత కక్షలు, శత్రుత్వం కారణంగా 3,761 మంది హత్యకు గురయ్యారు. కట్నం, క్షుద్రపూజలు, శిశు బలులు, మత ఘర్షణలు, కులతత్వం, రాజకీయ విభేదాలు, చిన్న చిన్న గొడవలు, పరువు హత్యలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు మొదలైనవి హత్యలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.