TTD | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. 19న ఆర్జిత సేవల టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఈనెల 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది

TTD | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. 19న ఆర్జిత సేవల టికెట్ల కోటా విడుదల

TTD | తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఈనెల 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు కేటాయించనున్నారు. టికెట్లు పొందిన డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.


కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్‌లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నది.

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. మే నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో తిరుమల, తిరుపతిలో వసతి గదులకు సంబంధించిన కోటాను విడుదల చేస్తుంది. 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వివరించింది.