భార‌తీయ విద్యార్థుల పంట పండింది.. ఏడాది కాలంలో 1,40,000 అమెరిక‌న్ వీసాల జారీ

అమెరికా (America) లో చ‌దువుకోవాల‌నుకున్న విద్యార్థుల పంట పండింది. ఎన్న‌డూ లేని స్థాయిలో గ‌త ఏడాది కాలంలో 2022 అక్టోబ‌ర్ నుంచి 2023 సెప్టెంబ‌ర్ మ‌ధ్య 1,40,000 మంది భార‌తీయ విద్యార్థుల‌కు వీసాలు జారీ కావ‌డం విశేషం.

భార‌తీయ విద్యార్థుల పంట పండింది.. ఏడాది కాలంలో 1,40,000 అమెరిక‌న్ వీసాల జారీ

విధాత‌: అమెరికా (America) లో చ‌దువుకోవాల‌నుకున్న విద్యార్థుల పంట పండింది. ఎన్న‌డూ లేని స్థాయిలో గ‌త ఏడాది కాలంలో 2022 అక్టోబ‌ర్ నుంచి 2023 సెప్టెంబ‌ర్ మ‌ధ్య 1,40,000 మంది భార‌తీయ విద్యార్థుల‌కు వీసాలు జారీ కావ‌డం (US Visas to Indian Students) విశేషం. అమెరికాకు విద్యార్థుల వ‌ల‌స‌ల్లో ఇది ఒక కీల‌క ప‌రిణామ‌మ‌ని నిపుణులు పేర్కొంటున్నారు.


ఇక్క‌డే కాకుండా ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న అమెరిక‌న్ ఎంబ‌సీలు, కాన్సులేట్లు అన్నీ వీసాల జారీని పెంచాయి. ఈ ఏడాది కాలంలోనే నాన్ మైగ్రెంట్ వీసాల సంఖ్య కోటి దాట‌డం విశేషం. అమెరికాలో చ‌దువుకోవ‌డానికి, అక్క‌డి యూనివ‌ర్సిటీల‌కు ఉన్న డిమాండ్‌ను ఇది సూచిస్తోంది.


అదే విధంగా ప‌ర్యాట‌కుల‌కు, వ్యాపారుల‌కు జారీ చేసే స్వ‌ల్ప‌కాల విజిటింగ్ వీసాల‌కూ డిమాండ్ పెరిగింద‌ని భార‌త్‌లో యూఎస్ ఎంబ‌సీ పేర్కొంది. ఈ విభాగంలో 80 ల‌క్ష‌ల వీసాల‌ను జారీ చేసిన‌ట్లు పేర్కొంది. 2015 త‌ర్వాత ఇదే అత్య‌ధిక‌మ‌ని.. ఇది అమెరికాపై ప్ర‌పంచ‌దేశాల పౌరుల‌కు కొన‌సాగుతున్న నమ్మ‌కాన్ని సూచిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డింది.


ఈ ఏడాది గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే 2023 ఆర్థిక సంవ‌త్సరంలో 6 ల‌క్ష‌ల స్టూడెండ్ వీసాల‌ను జారీ చేశామ‌ని.. 2017 త‌ర్వాత ఇదే అత్య‌ధిక‌మ‌ని తెలిపింది. 2023లో 10 ల‌క్ష‌ల నాన్ ఇమిగ్రెంట్ వీసాల‌ను ప్రాసెస్ చేసినందుకుగానూ భార‌త్‌లో యూఎస్ మిష‌న్ సంబ‌రాలు చేసుకుంది. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న బంధానికి ఇది ఒక నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంది. గ‌త ఏడాది 12 ల‌క్ష‌ల మంది భార‌తీయులు అమెరికాలో ప‌ర్య‌టించార‌ని.. అక్క‌డి ప‌ర్యాట‌కంలో భాగ‌స్వాములైనందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.


కాగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమెరికా వీసా కోసం దాఖ‌ల‌వుతున్న ద‌ర‌ఖాస్తుల్లో భార‌త్‌వే 10 శాతం. విద్యార్థుల వీసాల్లో 20 శాతం, ఉద్యోగ వీసాల్లో 65 శాతం భార‌తీయుల‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఇంట‌ర్వ్యూల నిడివిని త‌గ్గించ‌డం, వీసా రెన్యువ‌ల్ విధానాన్నీ సుల‌భ‌త‌రం చేయ‌డం, త‌ర‌చుగా అమెరికా వ‌చ్చే వారికి మిన‌హాయింపులు ఇవ్వ‌డం వంటి చ‌ర్య‌లు ప్ర‌పంచవ్యాప్తంగా ఎక్కువ వీసాల జారీకి తోడ్ప‌డ్డాయ‌ని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.