Vanaparthi | చిట్యాల‌లో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాల్లు

Vanaparthi ఇనుము పరిశ్రమను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు విధాత‌: వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలో ప్రాచీనకాలం నాటి ఇనుము ఉత్పత్తి క్షేత్రాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు భైరోజు చంద్రశేఖర్, డా. శ్యాంసుందర్ గుర్తించారు. మూలోనిగుట్ట సమీపంలోని తగళ్ళగడ్డలో 14 ఎకరాల వ్యవసాయభూమిలో చిట్టెం కుప్పలు, కుప్పలుగా కనిపిస్తున్నది. ఇనుము ఉత్పత్తి తరువాత మిగిలే వ్యర్థమే చిట్టెం. ఆ పొలం లోపల చిట్టెం నిక్షేపం ఉందని పొలం యజమాని మాదారం జగపతి […]

Vanaparthi | చిట్యాల‌లో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాల్లు

Vanaparthi

  • ఇనుము పరిశ్రమను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు

విధాత‌: వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలో ప్రాచీనకాలం నాటి ఇనుము ఉత్పత్తి క్షేత్రాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు భైరోజు చంద్రశేఖర్, డా. శ్యాంసుందర్ గుర్తించారు. మూలోనిగుట్ట సమీపంలోని తగళ్ళగడ్డలో 14 ఎకరాల వ్యవసాయభూమిలో చిట్టెం కుప్పలు, కుప్పలుగా కనిపిస్తున్నది. ఇనుము ఉత్పత్తి తరువాత మిగిలే వ్యర్థమే చిట్టెం. ఆ పొలం లోపల చిట్టెం నిక్షేపం ఉందని పొలం యజమాని మాదారం జగపతి రావు (65 సం)తెలియజేసారు.

తమ పూర్వీకులు ఈ బీడు భూమిని వ్యవసాయోగ్యమైన పొలంగా మార్చుకునేటపుడు 20 అడుగుల చుట్టుకొలతగల ఇటుకల కట్టడం ఆనవాల్లు, ఇనుము కరిగించడానికి వాడే మూసలు, పెద్ద పెద్ద గొట్టాలు, పెద్ద పెద్ద మట్టిసట్టి, గాగుల వంటి పెంకులు దొరికినట్టు పెద్దలు చెప్పేవారని జగపతిరావు అన్నారు.

భూమిదున్ను తున్నప్పుడు 16 అంగుళాల పొడవు, 8 అంగుళాల వెడల్పు, 6 అంగుళాల మందంతో ఉన్న ఇటుకలు బయటపడుతుంటాయి. పొలంలో లభించిన చిట్టెం ముద్దలను చేలగట్లలకు హద్దులుగా అమర్చుకోగా.. ట్రాక్టర్ల కొద్ది చిట్టెం ముద్దలను సమీపంలో పారే వాగు అంచు వెంట పారపోసినారట. 20 యేండ్ల క్రితం ఈ పొలంలో 120 రాగినాణేలున్న చిన్న మట్టికుండ లభించినట్లు, వాటిని కూలీలు తలాకొన్ని తీసుకవెళ్ళినట్లు జగపతిరావు తెలిపారు.

ఇనుము కరిగించగా మిగిలిన బొగ్గు బూడిదను సమీప పోలాలలో పోసేవారని ఇపుడు గ్రామంలో సదురం(చదరం) భూములుగా పిలువబడే వ్యవసాయ పొలంలో చాలా సంవత్సరాలకు పూర్వం బూడిద కుప్పలు, ఇనుమును కరిగించిన మూసల అవశేషాలు, కుండపెంకులు అవశేషాలు లభించేవని గ్రామస్తులు తెలియజేసారు.

అంతేగాకుండా గ్రామానికి చెందిన ఎర్రగుట్టలో ఇప్పటికి మన్ను త్రవ్వితే ముడి ఇనుపఖనిజం ముద్దలు, ముద్దలు రాళ్ళ రూపంలో లభిస్తుంది. ఈ గ్రామ చుట్టుపక్కల నైసర్గిక స్వరూపాన్ని, ప్రాచీన _చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇక్కడికి సమీపంలో పెద్ద మందడి, చిన్న మందడి, అమ్మాయిపల్లి అనే గ్రామాలు ఉన్నాయి.

మందడి అంటి అశ్వశాల. అశ్వసైన్య స్థావరంగా మందడి గ్రామాల ప్రస్థావన చోళుల కాలంలోని శాసనంలో పేర్కొనబడింది. అమ్మ అంటి తల్లి, అయి/ఆయో అంటే ఇనుము ఉత్పత్తికి కారణభూతమైన తల్లిగా, లోహకారక దేవతగా పూజించబడే ‘మమ్మాయి’ దేవత నిలయమైన గ్రామం “అమ్మాయిపల్లి” గా ఏర్పడి ఉండవచ్చు. దీనికి బలం చేకూర్చే మమ్మాయి దేవతాశిల్పం గణపురం కమ్మరిగేరి శివాలయంలో ‘మొమ్మాయి’గా ప్రజల చేత పూజలందుకుంటున్నది.

గణపురంలోని గిరిదుర్గంపై ఉండే సైన్యానికి అవసరమైన ఆయుధాలను గణపురంలోను, సమీప గ్రామమైన మానాజిపేటలో తయారు చేసేవారని తమ పెద్దల ద్వారా తెలిసినట్లు స్థానిక కమ్మరవృత్తి వారు తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి చిట్యాలలో కూడా ఆనాడు వ్యవసాయయోగ్య మైన పనిముట్లకు, యుద్ధసామాగ్రికి అవసరమైన ఇనుము ఉత్పత్తి చేసే పరిశ్రమ ఉండేదని చెప్పవచ్చు.

లభించిన ఆధారాలను బట్టి ఈ ప్రాంతంలో రెండు వేల సంవత్సరాలకు పూర్వమే చిట్యాల ముడి ఇనుము ఖనిజ నిక్షేపాలు, ఇనుము ఖనిజ ఉత్పత్తి కేంద్రం ఉండేదని చిట్టెం కుప్పల వల్లనే ఈ గ్రామానికి చిట్యాల పేరు స్థిరపడిందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలియజేసారు.

క్షేత్ర పరిశోధన: బైరోజు చంద్రశేఖర్, డా. బైరోజు శ్యామసుందర్, 9441612629, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు..