యువ నేత‌లు తరచూ పార్టీలు మారొద్దు

యువ శాసనసభ్యులు తరచూ పార్టీలు మారవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు

యువ నేత‌లు తరచూ పార్టీలు మారొద్దు
  • అది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది
  • మాజీ ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడు


విధాత‌: యువ శాసనసభ్యులు తరచూ పార్టీలు మారవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. పార్టీలు పెట్టడం వల్ల రాజకీయాలపై ప్రజల్లో ఆసక్తి తగ్గుతుందని, ఇది ప్రజాస్వామ్యానికి చేటు కూడా చేస్తుందని హెచ్చరించారు. బుధ‌వారం ఫుణెలో ప్రభుత్వ ఎంఐటీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌, ఎంఐటీ వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన 13వ భారతీయ ఛత్ర సంసద్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


“యువ రాజకీయ నాయకులు, విద్యార్థులకు నా సలహా — రాజకీయాల్లో చేరండి. నిర్మాణాత్మకంగా, శ్రద్ధగా ఉండండి. తరచుగా పార్టీలు మారవద్దు. ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం చేసుకోవడం కష్టం. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. వర్ధమాన రాజకీయ నాయకులు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండండి.. నాయకుడు అహంకారం, నియంతగా మారితే పార్టీలోనే చర్చించి నిర్ణయం తీసుకోండి.. ఇదే మార్గం.. లేకుంటే రాజకీయాలపై ప్రజల్లో గౌరవం పోతుంది”. అని పేర్కొన్నారు.


రాజకీయాల్లో ప్ర‌తిప‌క్షాలు నిరసన తెలపాలి.. ప్రభుత్వాన్ని తప్పుడు పనులు చేయకుండా నిరోధించాలి.. కానీ వారు శత్రువులు కాదని గుర్తుంచుకోవాల‌ని సూచించారు. ప్రభుత్వం, శాసనసభలు పనిచేయడానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. శాసనసభ్యులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని సూచించారు. బీజేపీలో చేరి నమ్మకంతో పని చేస్తూనే దానికి అధ్యక్షుడయ్యాన‌ని తెలిపారు.