Vitro Gametogenesis | పురుషుడు, స్త్రీ, శృంగారం లేకుండానే పిల్లలు.. !
Vitro Gametogenesis విధాత: లేబొరేటరీలో పిల్లలను సృజించే ప్రక్రియలో పరిశోధకులు భారీ ముందడుగు వేశారు. వీర్యం, అండం, కనీసం అండాశయం కూడా లేకుండా పూర్తిగా శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో పిల్లలను సృష్టించడం ఈ పరిశోధనలో విశేషం. మహిళలు పిల్లలను కనడానికి పురుషులు అవసరం లేని రోజులొస్తాయని అందరూ అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే ఆలోచనా ధోరణిలో ఒక అడుగు ముందుకు వేసి పిల్లలు పుట్టడానికి పురుషులూ, స్త్రీలు, వారి మధ్య శృంగారం కూడా అవసరం లేకుండా పరిశోధనలు జరుగుతున్నాయి. […]

Vitro Gametogenesis
విధాత: లేబొరేటరీలో పిల్లలను సృజించే ప్రక్రియలో పరిశోధకులు భారీ ముందడుగు వేశారు. వీర్యం, అండం, కనీసం అండాశయం కూడా లేకుండా పూర్తిగా శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో పిల్లలను సృష్టించడం ఈ పరిశోధనలో విశేషం. మహిళలు పిల్లలను కనడానికి పురుషులు అవసరం లేని రోజులొస్తాయని అందరూ అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే ఆలోచనా ధోరణిలో ఒక అడుగు ముందుకు వేసి పిల్లలు పుట్టడానికి పురుషులూ, స్త్రీలు, వారి మధ్య శృంగారం కూడా అవసరం లేకుండా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విధానంలో భాగంగా నడివయసు వారి వీర్యం లేదా అండం నుంచి కాకుండా మిగిలిన కణాలను తీసుకుని కొత్త జెర్మ్ కణాలను సృష్టిస్తారు. ఆ తర్వాత ఐవీఎఫ్ (IVF)లలో ఉపయోగిస్తున్న విధానాన్ని ఉపయోగించి బేబీలను తయారుచేస్తారు.
పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలనుకునే యువతీయువకుల సంఖ్య అమెరికా (America) లో బాగా పెరుగుతోంది. ఆ మార్కెట్‌ను ఒడిసిపట్టుకోవడానికి కన్సెప్షన్ అనే స్టార్టప్ సంస్థ పరిశోధనలు చేసి విట్రో గామిటోజెనిక్స్ (ఐవీజీ) అనే ఈ విధానాన్ని కనిపెట్టింది. స్టెమ్ సెల్‌ను అండంగా మార్చడమే ఈ విధానంలో ప్రత్యేకత అని కన్సెప్షన్ సహ వ్యవస్థాపకుడు మాట్ క్రిసిలోఫ్ వెల్లడించారు. దీని కోసం ఒక వ్యక్తి చర్మం నుంచి కానీ రక్తం నుంచి కానీ నమూనాలను సేకరిస్తారు. వీటిలో ఉండే ఇన్డ్యూస్డ్ ప్లూరీపొటెంట్ స్టెమ్ సెల్స్ (ఐపీసీఎస్) తో మనం అండాశయ కణాలనైనా లేదా వీర్య కణాలనైనా ఉత్పత్తి చేయవచ్చు. ఆ తర్వాత వీటిని ల్యాబ్‌లోనే పొదిగి బేబీలు జన్మించేలా చేస్తారు. దీని వల్ల క్యాన్సర్ చికిత్స వల్ల కానీ, వయసు మీరిపోవడం వల్ల కానీ లేదా ఇతర ఏ కారణాల వల్లనైనా మహిళలు పిల్లలను కనే అవకాశాన్ని కోల్పోతే ఈ విధానం అక్కరకు రానుంది. దీని వల్ల వారి జెనెటిక్ లక్షణాలతోనే
మగవారి సాయం లేకుండా పిల్లలను పొందవచ్చు. స్వలింగ సంపర్కులకు, ట్రాన్స్‌జెండర్ జంటలకు సైతం ఈ విధానం వల్ల పిల్లల కష్టాలు తొలగిపోతాయి.
పలు అనుమానాలు.. వివిధ సందేహాలు
అయితే ఈ విధానంపై సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని డిజైనర్ బేబీస్‌ని తయారుచేసే ప్రమాదముందని తెలిపారు. మనకు కావాల్సిన శారీరక ప్రమాణాలతో, నిర్దిష్ట తెలివితేటలతో పుట్టించే పిల్లలను డిజైనర్ బేబీస్‌గా వ్యవహరిస్తారు. అయితే ఈ భయాలను ఐవీజీ పరిశోధకులు కొట్టిపడేస్తున్నారు. తమ పరిశోధన సరైన దిశలోనే సాగుతోందని, దీనిని సరైన దిశలో ఉపయోగించేలా ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ భయాలకన్నా.. ఒక ఒంటరి వ్యక్తికి కుటుంబాన్ని ఇస్తుందన్న భావనతోనే ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని క్రిసిలోఫ్ వ్యాఖ్యానించాడు.