Warangal | కల్లాల్లో ధాన్యం… రైతన్న పరిస్థితి దైన్యం.. ధైర్యం కోల్పోతున్న అన్నదాతలు

Warangal ధాన్యం కొనుగోల్లు జాప్యం కొనుగోలు కేంద్రాల్లో వసతుల కరువు పరదాలు, గోనె సంచులు ఇవ్వని అధికారులు ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి, కలెక్టర్, రైతు సంఘాలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన పంట నేల పాలు కాగా, చేతికందిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. వర్షం బారి నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నాన్న అగచాట్లు పడుతున్నారు. ఒకవైపు ప్రకృతి […]

Warangal | కల్లాల్లో ధాన్యం… రైతన్న పరిస్థితి దైన్యం.. ధైర్యం కోల్పోతున్న అన్నదాతలు

Warangal

  • ధాన్యం కొనుగోల్లు జాప్యం
  • కొనుగోలు కేంద్రాల్లో వసతుల కరువు
  • పరదాలు, గోనె సంచులు ఇవ్వని అధికారులు
  • ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలి
  • కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి, కలెక్టర్, రైతు సంఘాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన పంట నేల పాలు కాగా, చేతికందిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. వర్షం బారి నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నాన్న అగచాట్లు పడుతున్నారు. ఒకవైపు ప్రకృతి పగబట్టగా, మరోవైపు ప్రభుత్వం రైతన్నల సహనాన్ని పరీక్షిస్తుంది. సరైన వసతులు లేని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.

దైన్య స్థితిలో ఉన్న రైతన్న ధైర్యం కోల్పోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, అధికారులు ప్రకటనలు చేయడం తప్ప ధాన్యం కొనుగోలులో వేగం ప్రదర్శించడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆరబోసేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం తేమ శాతం పేరుతో కొనుగోళ్లు జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్ రావు ధాన్యం కొనుగోలుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి సందర్శించి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

రైతు సంఘాల ప్రతినిధులు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రైతు సంఘాల నాయకులు

యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, ప్రొఫెసర్ మరింగంటి యాదగిరాచార్యులు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్), అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్), తెలంగాణ రైతు సంఘం ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పర్వతగిరి మండలం కొంకపాక, గోపనపల్లి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు పరిస్థితి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఒక గింజ కొనుగోలు చేయలేదు: రైతు సంఘాల నాయకులు

ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి కొంటున్నట్లు అధికార యంత్రాంగం చెబుతున్నారని కానీ ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేవని రైతు సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్రాలు ఏర్పాటు చేసి మూడు రోజులు దాటినా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని, కనీసం రైతులకు కావాల్సిన పరదాలు సైతం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నదన్నారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి 20 రోజులు దాటిన, కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం 18 లోపు ఉన్నా టోకెన్స్, గోనె సంచులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సెంటర్లలో ఉండాల్సిన సిబ్బంది సైతం అందుబాటులో లేరని ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం భయాందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించి రైతులకు టోకెన్లు అందించి, గోనె సంచులను సరఫరా చేసి, సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో‌ ఏఐకెఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్ ఇతర నాయకులు రైతులు పాల్గొన్నారు.

ఆందోళ‌న చెందొద్దు, ప్ర‌భుత్వం ఆదుకుంటుంది: మంత్రి ఎర్రబెల్లి

ఆకాల వ‌ర్షాలు రైతుల‌ను ఆగం చేశాయ‌ని, అనేక మంది రైతులు పంట‌లు న‌ష్ట‌పోయార‌ని, వారిని ఆదుకోవ‌డానికే కేంద్రం కాద‌న్నా, వ‌ద్ద‌న్నా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నార‌ని, ఇప్పుడు ధాన్యం కూడా త‌డ‌వ‌డం రైతుల‌కు ఆశ‌నిపాతంగా మారింద‌ని, అయితే, న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని త‌డిసిన ధాన్యం రైతుల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు భ‌రోసానిచ్చారు.

దేవ‌రుప్పుల మండ‌లం సీతారాంపురం గ్రామంలో ఆకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని మంత్రి మంగ‌ళ‌వారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ధైర్యం చెప్పారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లోత‌ట్టు ప్రాంతంలో పెట్ట‌డం ప‌ట్ల సంబంధిత అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, వ‌చ్చిన ధాన్యాన్ని వెంట వెంట కొనుగోలు చేసి, గోదాముల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: కలెక్టర్

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కొనుగోలు చేస్తామని, ఎటువంటి ఆందోళన చెందవద్దని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నాడు హాసనపర్తి మండలంలోని నాగారం, వంగపాడు, సిద్దపుర్ గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 60 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 8270మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆమె అన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తామని అన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, వర్షానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్ కప్పుకోవాలని, ధాన్యం తడిస్తే అరబెట్టుకోవాలని కలెక్టర్ తెలిపారు. రైతులు కొంత ఓర్పుతో సంయమనం పాటించాలని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పిడి శ్రీనివాస్ కుమార్, సివిల్ సప్లై డి ఎం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.