Warangal | పండుగలు సరే.. పంట కొనుగోలు సంగతేమిటి?: MLA సీతక్క

warangal కల్లాల్లో ధాన్యంతో కంటిమీద కునుకులేదు ఆగమాగవుతున్న అన్నదాతలు ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి ఖరీఫ్ వచ్చినా కదలని సర్కారు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చెరువుల పండుగ, చేపల పండుగ, రైతుల పండుగలన్నీ సరే, పండించిన పంట కొనుగోలు సంగతి ఏమిటంటూ ములుగు ఎమ్మెల్యే, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దనసరి సీతక్క ప్రశ్నించారు. శనివారం ములుగుజిల్లాలో కల్లాల్లోని ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ […]

Warangal | పండుగలు సరే.. పంట కొనుగోలు సంగతేమిటి?: MLA సీతక్క

warangal

  • కల్లాల్లో ధాన్యంతో కంటిమీద కునుకులేదు
  • ఆగమాగవుతున్న అన్నదాతలు
  • ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
  • ఖరీఫ్ వచ్చినా కదలని సర్కారు
  • ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చెరువుల పండుగ, చేపల పండుగ, రైతుల పండుగలన్నీ సరే, పండించిన పంట కొనుగోలు సంగతి ఏమిటంటూ ములుగు ఎమ్మెల్యే, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దనసరి సీతక్క ప్రశ్నించారు. శనివారం ములుగుజిల్లాలో కల్లాల్లోని ధాన్యాన్ని ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కష్టాలను, నష్టాలను, అంచనా వేసి ప్రభుత్వంతో నష్ట పరిహారం ఇప్పించాల్సిన అధికారులు అధికార పార్టీ ఉత్సవాలకు, సమావేశాలకు జనాల్ని తరలిస్తూ బానిసలుగా బ్రతకడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటని అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదంటూ అన్నదాత పుట్టెడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి ఉత్సవాల్లో పాల్గొనడం అత్యంత అమానవీయ చర్య అని అన్నారు.

అందరి కడుపు నింపే రైతన్న పండించిన పంటను అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి కోసం అప్పులు తెచ్చిన రైతన్న ఆ అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటే పరామర్శించాల్సిన ప్రభుత్వాలు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఇది ప్రజా స్వామ్యమా లేక కీచక రాజ్యమా? అని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు.

ఖరీఫ్ వచ్చినా..

యాసంగిలో పండించిన పంట ఖరీఫ్ సీజన్ దగ్గరికి వస్తున్న కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లోనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో ధాన్యం పెట్టుకొని కంటిమీద కునుకు లేకుండా రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ధాన్యం తరలించడానికి వాహనాలు రాక ఇబ్బందులు ఎరుర్కొంటున్నారని అన్నారు.

ములుగు జిల్లాకు మిల్లులను కేటాయించి, పండించిన ధాన్యాన్ని, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. తరుగు పేరుతో రైతు శ్రమను దోచుకుంటున్న మిల్లర్లపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఆగడాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నష్టపరిహారం చెల్లించని ప్రభుత్వం

పండించిన పంటను సరైన సమయానికి కొనేనాథుడు లేక అన్నదాతలు లబోదిబోమంటున్నారని సీతక్క అన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కనీసం నష్ట పరిహారం ఇవ్వకుండా పంట ఇన్సూరెన్స్ డబ్బులు దోచుకుతింటూ, రైతన్నను చావు దెబ్బ తీస్తున్నారని అన్నారు. పంట పెట్టుబడికి అప్పులు చేసి పంట పండిస్తే, చివరికి ఆ పంటను అమ్ముకునే సమయంలో సరైన సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం భద్రపరుచుకోవడానికి సరైన వసతులు కల్పించక, తరుగు పేరుతో రైతుని దగా చేస్తున్నారని విమర్శించారు. మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, అకాల వర్షాలతో అతలాకుతలం అవుతున్న రైతుకు ఆపన్న హస్తం అందించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ధాన్యం రవాణా చేయడానికి వాహనాలు కాంట్రాక్టు ఒక్కరికే ఇస్తూ, ధాన్యం సరఫరా చేయకుండా, ఇసుక రవాణా చేస్తూ, వాహనాల చుట్టూ రైతులు కాళ్ళరిగేలా తిరిగినా కూడా కనికరించడం లేదన్నారు.

రైతున్నల దగ్గర అదనపు డబ్బులు తీసుకుంటూ దగా చేస్తున్న కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోకుండా, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటూ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యపు బస్తాలను వాహనాలను సమకూర్చి తరలించి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.

వచ్చే ఖరీఫ్ సీజన్ దగ్గరగా ఉండడం వల్ల పంట పెట్టుబడి కోసం వెంటనే పంట రుణాలు రైతన్నకు అందజేయాలని కోరారు. పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని సీతక్క డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సీతారాం నాయక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి, కోరం రామ్మోహన్, ఈక శేషు, వంశీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.