Warangal చెరువు లోతట్టు ప్రాంతవాసుల ఆందోళన అప్రమత్తమైన జిల్లా అధికారులు చెరువు నీటితో పొంచి ఉన్న ప్రమాదం స్థానికులను పునరావసర శిబిరానికి తరలిస్తున్నారు కట్టను పరిశీలించడంలో ఇరిగేషన్ అధికారుల అలసత్వం అవసరమైన చర్యలను చేపట్టడంలో నిమగ్నం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరం నడిబొడ్డులో ఉన్న భద్రకాళి చెరువుకు శనివారం గండి పడింది. వరుసగా కురిసిన వర్షాలతో చెరువుకు భారీగా వరద నీరు పెరిగి కట్ట దెబ్బతింది. దీంతో బలహీనంగా ఉన్న కట్ట తెగిపోయి, చెరువు […]
Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరం నడిబొడ్డులో ఉన్న భద్రకాళి చెరువుకు శనివారం గండి పడింది. వరుసగా కురిసిన వర్షాలతో చెరువుకు భారీగా వరద నీరు పెరిగి కట్ట దెబ్బతింది. దీంతో బలహీనంగా ఉన్న కట్ట తెగిపోయి, చెరువు నీరంతా వెళ్ళిపోతుంది. గండిపడడంతో చెరువు సమీపంలో ఉన్న పోతననగర్, సరస్వతినగర్, కాపువాడ ప్రాంతాలకు ప్రమాదం పొంచిఉన్నది.
ప్రమాదం నేపథ్యంలో స్థానికంగా నివాస గృహాలవారిని పునరావాస కేంద్రాలకు తరలించే పనిని చేపట్టారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. వర్షం లేకపోవడంతో పనులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే భారీ స్థాయిలో కురిసిన వర్షాలు నేపథ్యంలో భద్రకాళి చెరువు కట్ట పటిష్టతను ఎప్పటికప్పుడు పరిశీలించడంలో ఇరిగేషన్ అధికారులు వైఫల్యం చెందడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
చెరువు సామర్థ్యానికి మించిన వరదరావడం, కట్ట బలహీనంగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితి లేనప్పటికీ సకాలంలో గండి పూర్వక పోతే లోతట్టు ప్రాంతవాసులకు ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే చెరువులో పూర్తి సామర్థ్యం నీరు నిండి ఉండడం ప్రధాన కారణం. నీరంతా లోతట్టు ప్రాంతాలపైకి చేరితే తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గండి కూడా పెరిగే అవకాశం ఉంది.
జిల్లా కేంద్రం కావడం అధికారులు, అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉన్నందున అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమై అవసరమైన పనులు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. గండి పూడ్చడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నప్పటికీ వరద నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.