మహారాష్ట్రలో వదిన, మరదళ్ల మధ్య ఫైట్..! ఎవరీ సునేత్ర పవార్..?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయంగా ఇప్పటికే పేరొందిన నాయకులు.. తమ కుటుంబ సభ్యులను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయంగా ఇప్పటికే పేరొందిన నాయకులు.. తమ కుటుంబ సభ్యులను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే శరద్ పవార్, అజిత్ పవార్ కుటుంబాల మధ్య రసవత్తర రాజకీయం చోటు చేసుకుంది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేయబోతుందని వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో వదిన, మరదళ్ల మధ్య బిగ్ ఫైట్ ఉండబోతోందని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.
అయితే బారామతి నియోజకవర్గం నుంచి సునేత్ర పవార్ పోటీ చేస్తారనే దానికి అజిత్ పవార్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి కొత్త వ్యక్తి పోటీలో ఉంటారని అజిత్ పవార్ తెలిపారు. మొదటిసారి పోటీ చేసే అభ్యర్థిని గెలిపించాలని, అభివృద్ధికి ఓటేయాలని ఆయన అభ్యర్థించారు. దాంతో ఆయన సతీమణీ సునేత్రను బరిలో దింపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. బారామతి తదుపరి ఎంపీ సునేత్ర పవార్ అని నియోజకవర్గం అంతటా శనివారం బ్యానర్లు వెలిశాయి. ఈ పరిణామాలన్నీ ప్రస్తుత వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఎవరీ సునేత్ర పవార్..?
అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ బారామతి నియోజకవర్గంలో సోషల్ వర్క్ చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా అనే ఎన్జీవోను నెలకొల్పి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యా ప్రతిష్ఠాన్ అనే విద్యాసంస్థకు ట్రస్టీగా ఆమె వ్యవహరిస్తున్నారు. 2011లో ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫోరమ్ యొక్క థింక్ ట్యాంక్‌లో ఆమె భాగమయ్యారు. అజిత్ పవార్, సునేత్ర పవార్‌కు ఇద్దరు కుమారులు జయ్ పవార్, పార్థ పవార్ ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నుంచి పార్థ్ పవార్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
బారామతి పవార్ ఫ్యామిలీకి కంచుకోట
బారామతి లోక్‌సభ నియోజకవర్గం పవార్ ఫ్యామిలీకి కంచుకోట. గత 55 ఏండ్ల నుంచి పవార్ కుటుంబమే రాజకీయంగా మనుగడ కొనసాగిస్తోంది. 1967లో తొలిసారిగా బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లోనూ శరద్ పవార్ విజయం సాధించారు. బారామతి నుంచి 1984, 1996, 1998, 1999, 2004లో శరద్ పవార్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1991లో బారామతి నుంచే అజిత్ పవార్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అజిత్ పవార్. ఇక 2009 లోక్‌సభ ఎన్నికల నుంచి సుప్రియా సూలే బారామతి నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు సునేత్ర పవార్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎవరు గెలుస్తారనేది వేచి చూడాల్సిందే.