Congress | సీఎంల ఎంపిక.. కాంగ్రెస్‌కు కష్టమవుతున్నది ఎందుకు ?
Congress | ఎన్నికల్లో గెలువడం కంటే.. ఎంపికలో ఇబ్బందులు గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చేదు జ్ఞాపకాలుగా గత అనుభవాలు అందుకే కర్ణాటక సీఎం ఎంపికలో ఆచీతూచీ అడుగులు విధాత: ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. కానీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మాత్రం.. రచ్చ గెలిచి ఇంట్లో గెలవడానికి ఆపసోపాలు పడుతున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన హస్తం (Congress) పార్టీ.. సీఎం ఎవరనేది తేల్చలేకపోతున్నది. నాలుగు రోజులుగా సీఎం ఎంపికపై కసరత్తు చేస్తున్నది. […]

Congress |
- ఎన్నికల్లో గెలువడం కంటే.. ఎంపికలో ఇబ్బందులు
- గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చేదు జ్ఞాపకాలుగా గత అనుభవాలు
- అందుకే కర్ణాటక సీఎం ఎంపికలో ఆచీతూచీ అడుగులు
విధాత: ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. కానీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మాత్రం.. రచ్చ గెలిచి ఇంట్లో గెలవడానికి ఆపసోపాలు పడుతున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన హస్తం (Congress) పార్టీ.. సీఎం ఎవరనేది తేల్చలేకపోతున్నది. నాలుగు రోజులుగా సీఎం ఎంపికపై కసరత్తు చేస్తున్నది.
గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆచీతూచీ అడుగులు వేస్తున్నది. ఆలస్యమైనా ఫరవాలేదు.. కానీ, ఆధిపత్య పంచాయితీకి తెరతీయవద్దని సామరస్యపూర్వకంగా చర్చలు జరుపుతున్నది. అయితే, చర్చలు కొలిక్కి వచ్చినట్టు, నాలుగో రోజైన బుధవారం సీఎం ఎవరనేది తేల్చనున్నట్టు తెలుస్తున్నది.
సీఎం ఎంపిక ఎప్పడూ తలనొప్పే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం.. వరుసగా కాంగ్రెస్ పరాజయాలను చవిచూస్తున్నది. ఉత్తరాదిలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉన్నది. నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పాలన సాగిస్తున్నది. దక్షిణాదికి గుమ్మం అయిన కర్ణాటకను పాలిస్తున్నబీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ గెలుపు హస్తం పార్టీకి అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చింది.
అయితే ఆ పార్టీకి ఎన్నికల్లో గెలవడం కంటే ముఖ్యమంత్రిని నిర్ణయించడమే ప్రతీసారి పెద్ద సమస్యగా మారుతున్నది. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇబ్బందిని ఎదుర్కొన్నది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కంటే సీఎం ఎంపికే తలనొప్పిగా మారుతున్నది. ఎంపికలో తొందరపాటు, ఇతర కారణాల వల్ల ఈ తొమ్మిదేండ్ల కాలంలో కాంగ్రెస్ చాలా నష్టపోయింది.
రాజస్థాన్‌లో రెండు వర్గాలుగా వీడిన పార్టీ
రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పటి పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ పార్టీని విజయతీరాలకు చేర్చారు. సీఎం కుర్చీపై సీనియర్ నేత గెహ్లాట్, పైలట్ మధ్య పోటీ ఏర్పడింది. అయితే అధిష్టానం గెహ్లాట్‌కు మొగ్గు చూపి సీఎం చేసింది.
ఈ నిర్ణయం పార్టీ పుట్టి ముంచుతుందని అంచనా వేయలేక పోయింది. సీఎం పదవి దక్కలేదనే కోపంతో 2021లో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ తన మద్దతు ఎమ్మెల్యలతో తిరుగుబాటు చేశారు. గెహ్లాట్‌కు దాన్ని సంఖ్యా బలంతో బలంగా తిప్పి కొట్టి తిరుగుబాటును అణచి వేశారు. కానీ, నేటికీ ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నది.
పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లో చేజేతులా..
పంజాబ్‌లో రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూకి అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కి అస్సలు పడేది కాదు. అయితే ఈ విబేధాలకు ముగింపు చెప్పడానికి అమరీందర్‌ని సీఎంగా తొలగించి దళితుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని చేసింది కాంగ్రెస్. కానీ, 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది.
ఆప్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌లోని వర్గవిభేదాలే ఆప్ విజయానికి కారణమయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దాంతో కమలనాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంచేపట్టింది.
ఉమ్మడి ఏపీలోనూ ఇదే తంతు
ఉమ్మడి ఏపీలోనూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆయన తనయుడు జగన్ సీఎం పదవిని ఆశించారు. కానీ, ఆయనకు కాకుండా మరొకరిని కట్టబెట్టింది. దాంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిసొంతంగా వైఎస్సార్‌సీపీ పెట్టుకొన్నారు. ఇప్పడు అధికారం చేపట్టి ప్రస్తుత ఏపీ సీఎంగా ఉన్నారు. గట్టి పట్టున్న ఏపీ రాష్ట్రాన్ని హస్తం పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటామని ప్రస్తుత సీఎం భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియో మధ్య ఒప్పందం కుదిరింది.
కానీ, బాఘేల్ మాట తప్పి ముఖ్యమంత్రిగా కొనసాగారు. అస్సాంలో మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌తో ఉన్న విబేధాలు, ముఖ్యమంత్రి కుర్చీ కోసం చేసిన ప్రయత్నాల్లో విఫలమైన హిమంత బిస్వా శర్మ.. 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ఒక్క మార్పు బీజేపీకి ఈశాన్య భారతాన్ని మొత్తం కట్టబెట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరీశ్ రావత్ ఎంపిక అనంతరం పార్టీ దారుణ ఓటమి చవిచూసింది.
అభ్యర్థుల మధ్య పోటీ మంచిదే కానీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్‌కు అన్ని రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం ఉన్నది. అనేక రాష్ట్రాల్లో విజయాలు సాధించింది. ఆయా సందర్భాల్లో సీఎంల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ ఇలా ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నది. ఆయా రాష్ట్రాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.
వాస్తవానికి ఇలా ఎక్కువ మంది అభ్యర్థులు ఉండట వల్ల జాతీయ స్థాయి పార్టీలకు మంచిదే. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారంతో తమ బలాన్ని పెంచుకుంటారు. రాష్ట్రాల్లోని నాయకుల బలాన్ని తగ్గిస్తారు. వాస్తవానికి కాంగ్రెస్ ఈ విషయంలో గతంలో చాలా బలంగా ఉండేది. కానీ, ఇప్పడు పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ గొడవల వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది. అనేకరాష్ట్రాల్లో అధికారాన్ని కూడా కోల్పోయింది