Happiest Country | ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశం ఫిన్లాండ్‌.. భారత్ స్థానం ఎంతో తెలుసా..?

Happiest Country | ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశం ఫిన్లాండ్‌.. భారత్ స్థానం ఎంతో తెలుసా..?

Happiest Country : ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్‌కే మరోసారి అగ్ర స్థానం దక్కింది. ఈ జాబితాలో వరుసగా ఏడుసార్లు ఫిన్లాండే తొలి స్థానం సంపాదించడం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవం (World Happiest Day) అయిన బుధవారం (మార్చి 20) న యూఎన్‌ ఆధారిత వరల్డ్‌ హ్యాపీనెస్ ఇండెక్స్‌ సంస్థ తాజా ర్యాంకులను విడుదల చేసింది.

ప్రపంచంలోని 143 కు పైగా దేశాలకు చెందిన ప్రజల మనోభావాలను తెలుసుకుని వరల్డ్ హ్యాప్పినెస్‌ ఇండెక్స్‌ ఈ జాబితాను రూపొందించింది. జాబితాలో నార్డిక్‌ దేశాలైన ఫిన్లాండ్‌ (1), డెన్మార్క్‌ (2), ఐస్‌లాండ్‌ (3) వరుసగా తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి. భారత్‌ గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జాబితాలో 126 వ స్థానంలో నిలిచింది. ఇక చైనా (60), నేపాల్‌ (95), పాకిస్థాన్‌ (108), మయన్మార్‌ (118) దేశాలు జాబితాలో మన కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.

ఇక 2020లో తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లినప్పటి నుంచి అఫ్గానిస్థాన్‌ మానవతా విపత్తుతో బాధపడుతోంది. దాంతో ఈ హ్యపీనెస్‌ ఇండెక్స్‌లోని 143 దేశాల్లో ఆ దేశమే అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్రజల ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లాంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. గడిచిన దశాబ్ద కాలంలో అమెరికా (23), జర్మనీ (24) దేశాలు తొలిసారి టాప్‌-20 కంటే కిందకు దిగజారాయి.

అయితే టాప్‌ 20లో కోస్టారికా (12), కువైట్ (13) చోటు దక్కించుకోవడం విశేషం. ఇదిలావుంటే ఈ ఏడాది కూడా టాప్‌-10లో పెద్ద దేశమేది లేదు. టాప్‌-10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన దేశాలు నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. టాప్‌-20లో కెనడా, యూకేల్లో మాత్రమే మూడు కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నది. పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసులో ఉన్నావారే ఆనందంగా ఉన్నట్లు వెల్లడయ్యిందని వల్డ్ హ్యాప్పీనెస్‌ ఇండెక్స్‌ పేర్కొంది. కానీ అది ప్రపంచవ్యాప్తంగా ఒకేలా లేదని తెలిపింది.

ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు పేర్కొంది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసుల వారిలో సంతోషం పెరిగినట్లు తెలిపింది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకే రకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే విషయమని హ్యాప్పీనెస్‌ ఇండెక్స్‌ పేర్కొన్నది.

ఫిన్లాండ్‌కే అగ్రస్థానం ఎందుకు..?

మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెల్లా ప్రకారం.. ఫిన్‌లాండ్ దేశం సంతోషంగా ఉండటానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఇతర దేశాలు దీనిని అనుసరిస్తే, అవి కూడా జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. వాటిలో మొదటి కారణం.. ఐక్యతా భావం. అది ఫిన్లాండ్‌లో ఎక్కువ. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారంలో అందరూ సాయపడుతారు. సామరస్యంగా జీవిస్తారు. చుట్టుపక్కల వారి పట్ల శ్రద్ధ భావం కలిగి ఉండాలని దేశ ప్రజలకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఇది వారి అభివృద్ధిలో ముఖ్య భాగం.

ఫిన్లాండ్‌లో ప్రతి కుటుంబం పొరుగు వారితో సంతోషంగా గడుపుతుంది. అక్కడి పెంపకం తీరువల్ల చిన్నప్పటి నుంచే అందరిలో దయా గుణం అలవడుతుంది. ఇక ఫిన్లాండ్‌ సంతోషంగా ఉండటానికి రెండో కారణం.. అక్కడి ప్రభుత్వ సంస్థలు ప్రజల వృద్ధి కోసం సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇక మూడో కారణం.. అక్కడ ఎక్కువ సంపాదించేవారు, తక్కువ సంపాదించేవారు అనే తేడా ఉండదు. అన్ని పనులకు సమాన సంపాదన ఉంటుంది. దాంతో పేదరికం ఉండదు. అవినీతికి అవకాశం ఉండదు. అంతేగాక ఫిన్‌లాండ్ తొలి నుంచీ సంపన్న దేశం. జనాభా తక్కువ. డబ్బు కొరత లేని దేశం. ఈ కారణాల రీత్యా ఫిన్‌లాండ్‌ ఎప్పుడూ అత్యంత సంతోషకరమైన దేశాల్లో తొలి స్థానంలో నిలుస్తూ వస్తున్నది. కొనసాగుతోంది.