Dementia | డిమెన్షియా సునామీ

భారతదేశంలో డిమెన్షియా (మతిమరుపు) నిశ్శబ్ద మహమ్మారిలా పెరుగుతోంది. 60 ఏళ్లు పైబడిన వారిలో 7.4% మంది బాధపడుతుండగా ఈ సంఖ్య 2036 నాటికి రెండింతలు కానుంది.

Dementia | డిమెన్షియా సునామీ

భారతదేశం ఇప్పుడు మెల్లగా కానీ వేగంగా దగ్గరపడుతున్న ఒక నిశ్శబ్ద మహమ్మారిని ఎదుర్కొంటోంది. అదే… డిమెన్షియా. వయసు పెరిగేకొద్దీ సహజంగా వచ్చే మతిమరుపుగా భావించి అశ్రద్ధ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అల్జీమర్స్‌, పార్కిన్సన్ వంటి న్యూరోడీజెనరేటివ్‌ వ్యాధులు యుక్త వయసులో కూడా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన వాళ్లలో మతిమరుపు లేదా అల్జీమర్స్ వ్యాధి 7.4 శాతం ఉన్నట్టుగా లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా స్టడీ లో తేలింది. ప్రస్తుతం సుమారు 88 లక్షల మంది భారతీయులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2036 నాటికి రెండింతలు కావొచ్చని అంచనా. ఇదే కోవలోకి వచ్చే మరో వ్యాధి పార్కిన్ సన్ కూడా ప్రమాదకరంగా పెరుగుతోందంటున్నాయి అధ్యయనాలు. హైటెక్ నగరాల్లో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు పరిశోధకులు. గాలికాలుష్యమై మాంగనీస్, నికెల్, లెడ్ లాంటి లోహాలు ఈ సమస్యకు పెంచుతున్నాయని చెబుతున్నారు.

డిమెన్షియా అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, డిమెన్షియా అనేది పలు రకాల మెదడు సంబంధిత వ్యాధుల వలన నాడీకణాలు క్రమంగా ధ్వంసమవడం ద్వారా కలిగే సిండ్రోమ్. ఇది వయసుతో వచ్చే సహజ జ్ఞాపకశక్తి తగ్గుదల కంటే ఎక్కువ స్థాయిలో మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. ఇది బాధితులకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు, సంరక్షకులకు, సమాజానికీ ఆర్థిక, మానసిక భారంగా మారుతుంది.
డిమెన్షియా అనేది ఒక గొడుగు పదం — దీనిలో అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి అనేక న్యూరో వ్యాధులు ఉన్నాయి.

యంగ్-ఆన్‌సెట్ డిమెన్షియా: పెరుగుతున్న కొత్త ఆందోళన

సాధారణంగా వృద్ధాప్య వ్యాధిగా భావించిన డిమెన్షియా ఇప్పుడు యువ వయసులో కూడా కనిపిస్తోంది. ఇలా 65 ఏళ్లకు ముందే లక్షణాలు మొదలయ్యే డిమెన్షియాను యంగ్-ఆన్‌ సెట్ డిమెన్షియా అంటారు. చాలా సందర్భాల్లో ఇలా చిన్న వయసులోనే కనిపించే డిమెన్షియా లక్షణాలను స్ట్రెస్ వల్ల కలిగే ఇబ్బందులుగా పొరబడటం వల్ల ట్రీట్ మెంట్ లో ఆలస్యం అవుతుంటుంది. అయితే కొన్ని రకాల బయోమార్కర్ల ద్వారా ఈ సమస్య ఉన్నట్టు ముందే గుర్తించవచ్చంటున్నారు పరిశోధకులు. రక్తపరీక్ష ద్వారా ఈ బయోమార్కర్లను గుర్తిస్తే డిమెన్షియా రావడానికి కొన్నేళ్ల ముందే తెలుసుకోవచ్చంటున్నారు.

జీవనశైలిలో మార్పు..

సెడిటరేనియన్ లైఫ్ స్టయిల్ మెదడు పనితీరు దెబ్బతినడానికి కారణమవుతుందంటున్నారు వైద్య నిపుణులు. కంప్యూటర్ జాబ్స్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, స్ట్రెస్, డయాబెటిస్, బీపీ లాంటి జబ్బులు ఈ రిస్కు పెంచుతాయి. కాబట్టి ప్రతిరోజూ గంట సేపు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, టైం ప్రకారం తినడం, నిద్రపోవడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం లాంటి అలవాట్ల ద్వారా మెదడు త్వరగా డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.