12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు

సీజేపీ వ్యంగ్య రూపంలో ఏర్పడినప్పటికీ.. ఏళ్ల తరబడి పరీక్ష పత్రాల లీకేజీ నేపథ్యంలో నీట్‌ 2026 పేపర్‌ లీకేజీతో ఉద్యమరూపాన్ని సంతరించుకున్నది. వాస్తవానికి దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 152 పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ లీకేజీల మూలంగా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడి, మానసిక క్షోభకు గురయ్యారు. కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు.

విధాత, హైదరాబాద్:

దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో పేపర్ లీకేజీలు జరుగుతునే ఉన్నాయి. ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ప్రతి సంవత్సరం ఇదొక తంతుగా మారింది. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు కఠిన చర్యలకు దిగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లీకేజీలకు కారణమైన వారిపై కేసులు పెట్టడం, ఆ తరువాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలో ఆటలాడుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద గత కొన్ని రోజులుగా కాక్రోచ్‌ జనతా పార్టీ అనే పేరుతో యువత పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టారు. ప్రముఖ సామాజిక వేత్త, విద్యావేత్త, పరిశోధకుడు సోనం వాంగ్‌చుక్‌ నిరాహార దీక్షతో దేశంలోని యువత రగిలిపోతున్నది. వాంగ్‌చుక్‌ను హాస్పిటల్‌కు బలవంతంగా తరలించినా ఉద్యమం ఆగలేదు. సోమవారం పార్లమెంటు వద్దకు యువత నిరసనగా బయల్దేరడంతో పోలీసులు తీవ్ర దమనకాండకు దిగారు. సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రిని కలువగలిగినప్పటికీ కనీస హామీ కూడా లభించలేదు. సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. తక్కువ మార్కులు వచ్చాయని గగ్గోలు పెట్టినా ఆన్ లైన్ మూల్యాంకనం నిర్వహించిన బ్లాక్ లిస్టెడ్ కంపెనీ పై ఇంత వరకు చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వంత రాష్ట్రం అయిన గుజరాత్ లో గత 12 సంవత్సరాలలో 11 పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నది. తలతి (2015), తలతి (2016), టీఏటీ (2018), ముఖ్య సేవిక (2018), నయాబ్ చిట్నిస్ (2018), లోక్ రక్షక్ దళ్ (2018), క్లర్క్ (2019), జీఎస్ఎస్ఎస్బీ హెడ్ క్లర్క్ (2021), బీ.కామ్ ఫైనల్ ఇయర్ (2021), ఫారెస్టు గార్డు (2022), జూనియర్ క్లర్క్ (2023) పరీక్షా ప్రశ్న పత్రాలు బహిరంగ మార్కెట్ లో లభ్యమయ్యాయి. సోషల్ మీడియా ఖాతాల్లో ప్రశ్న పత్రాలు చక్కర్లు కొట్టాయి. పేపర్ లీకేజీ కోసం ప్రత్యేకంగా ఖాతాలు నిర్వహించి కోట్ల రూపాయలు అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకున్నరంటే దళారులు ఎంతగా బరితెగించారనేది స్పష్టమవుతున్నది. ఇన్ని లీకేజీలు జరుగుతున్న కట్టడి చేయడంలో గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.

వ్యాపం కుంభకోణం… 45 మందికి పైగా మిస్టరీ మరణాలు…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాలే కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. 2014 లో ఎంపీ బోర్డు 12వ తరతగతి మ్యాథ్స్, 2023లో ఎంపీ పట్వారీ, 2023 లో ఎంపీ బోర్డు 12వ తరగతి, 2023 లో ఎన్.హెచ్.ఎం కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ ఎగ్జామ్, 2023 లో బర్కతుల్లా యూనివర్సిటీ బీబీఏ ఎగ్జామ్, 2024 లో డీఏవీవీ ఎంబీఏ సెమిస్టర్ పరీక్షల ప్రశ్న పత్రాలు అంగట్లో సరుకులుగా మారాయి. కొన్ని సంవత్సరాల పాటు వ్యాపం కుంభకోణం పేరు దేశ వ్యాప్తంగా మరుమోగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ హయాంలో వ్యసాయిక్ పరీక్షా మండలం (వ్యాపం) అనే స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్ష్లతో పాటు ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్య విద్య ప్రవేశానికి సంబంధించిన ఈ పరీక్ష పెద్ద కుంభకోణంగా ఇప్పటికీ చెబుతుంటారు. ఇందులో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపార వేత్తలు భాగస్వామ్యం అయి లక్షలాది మంది విద్యార్థుల ఉసురు పోసుకున్నారు. అనర్హులు అయిన వారు దళారులు, రాజకీయ నాయకులు, వ్యాపం ఉద్యోగులకు భారీగా లంచాల ఆశచూపి ఉత్తమమైన ర్యాంకులు తెచ్చుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ కుంభకోణం బట్టబయలు అయ్యింది. ఈ కుంభకోణంలో అప్పటి విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఆయన ఆధీనంలో పనిచేసే ఓ పీ శుక్లా, సుధీర్ శర్మ, ఆర్ కే శివహరే, రవికాంత్ ద్వివేది ఉన్నారు. ఇవ కాకుండా కట్నీ హవాలా, డబ్ల్యూసీడీ అంగన్ వాడీ కుంభకోణాలు కూడా జరిగాయి. వ్యాపం కుంభకోణం విలువ అక్షరాలా రూ.10వేల కోట్ల వరకు ఉంటుందని, దీనికి బాధ్యులైన వారిలో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కాని ఇంత వరకు ఒక్కరినీ కూడా జైలులో వేయలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో జరిగిన కుంభకోణంలో నకిలీ అంగన్ వాడీలు, లబ్ధిదారులను సృష్టించారు. 2013 లో ఈ కుంభకోణం బయటకు రాక ముందే ఇందులో భాగస్వామ్యులుగా, పాత్రదారులు గా ఉన్నవారు అనుమానాస్పదంగా మరణించారు. 2015 వరకు వ్యాపం కేసుకు సంబంధించి 32 మంది చనిపోగా, మీడియాకు అందిన సమాచారం ప్రకారం నలభై మంది వరకు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. చాలా కేసుల్లో సరైన ఆధారాలు లేకపోవడం మూలంగా వాటిని పోలీసులు ఈ కేసులను మూసివేశారు. 2013 లో వ్యాపం కింద నిర్వహించిన 27 వేర్వేరు పరీక్షలలో దాదాపు 20 లక్షల మంది వరకు హాజరయ్యారు. ఈ సంఖ్య ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ జనాభాకు సమానం. అసలు అభ్యర్థికి బదులుగా మరొకరు పరీక్షలు రాయడం, రోల్ నెంబర్ తారు మారు చేయడం, మార్కుల షీటును ట్యాంపర్ చేయడం వంటివి జరిగాయి. అసలు అభ్యర్థులకు బదులుగా ఇతరులు మోసపూరితంగా పరీక్షలకు హాజరయ్యారు. నకిలీ అభ్యర్థులు పరీక్షలు రాసేలా నిర్వహాకులు ఏర్పాట్లు చేశారు. ఇంజిన్ బోగీ సిస్టమ్ అనగా ఒక అభ్యర్థి పక్కన మరొక నకిలీ అభ్యర్థి వచ్చేలా రోల్ సెంబర్ల విధానాన్ని అనుసరించారు. పరస్పరం మాట్లాడుకుని జవాబు పత్రాన్ని నింపుకుంటారు. జవాబు పత్రంలో సహాధానాలు రాయకుండా ఉద్ధశపూర్వకంగా ఖాళీగా పెట్టి, వాటిని స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన తరువాత జవాబులతో నింపుతారు. ఆ తరువాత కంప్యూటర్ లోని మార్కుల షీట్లను తారుమారు చేసి అత్యధిక మార్కులు వచ్చేలా చూస్తారు. 2016 సంవత్సరంలో సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేస్తున్న పిటిషన్లను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్ లోని అప్పటి బీజేపీ ప్రభుత్వం రూ.1.25 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని అంచనా. వ్యాపం కుంభకోనంలో సీబీఐ 86 మందిపై ఛార్జీ షీట్ దాఖలు చేసినా ఇప్పటి వరకు ఒక్కరు కూడా జైలుకు వెళ్లకపోవడం గమనార్హం.

ఆదిత్యనాథ్‌ పాలనలో కూడా లీకేజీలు…

ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో కూడా లీకేజీలు నిరాటంకంగా జరుగుతునే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2014లో సీపీఎంటీ, 2015 లో యూపీపీసీఎస్ ప్రిలిమ్స్, 2016లో యూపీ పాలిటెక్నిక్, 2017లో పోలీసు ఇన్ స్పెక్టర్, 2021లో యూపీ టీచర్ అర్హత పరీక్ష, 2021 లో యూపీ ప్రిలిమినరీ అర్హత పరీక్ష, 2022 యూపీ 12వ బోర్డు ఇంగ్లీషు పరీక్ష, 2024 లో యూపీపీఎస్సీ ఆర్ఓ, ఏఆర్ఓ, 2024 లో యూపీ పోలీసు కానిస్టేబుల్ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. 2024 లో జరిగిన పోలీసు కానిస్టేబు రిక్రూట్ మెంట్ పరీక్షకు 48 లక్షల మంది హాజరు కాగా, ప్రశ్నపత్రం లీక్ కావడం ప్రభుత్వం రద్ధు చేసింది. జవాబు కీ లకు సంబంధించి గుజరాత్ తో బలమైన సంబంధం కలిగి ఉన్నట్లు వెల్లడి అయ్యింది. ఈ పశ్న పత్రాలను గుజరాత్ లో ముద్రించగా, ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను రవాణా చేసింది. ట్రాన్సపోర్టు గోదాం నుంచి, గుజరాత్ నుంచి ఈ ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్ధారించారు. దేశంలో జరిగే అన్ని పేపర్ లీకేజీలకు గుజరాత్ కేంద్ర బిందువు అని అక్కడి రాజకీయ నాయకులే చెబుతుండడం విశేషం.

పశ్నాపత్రాలు సోషల్ మీడియాలో తొలుత రాగా, ఇది నకిలీ వార్త అంటూ యూపీ సర్కార్ కొట్టేసింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. సీబీఐ రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేసింది. దీంతో పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షను రద్ధు చేసి 48 లక్షల మంది అభ్యర్థులను తీవ్ర వేదన, ఒత్తిడికి గురి చేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే జమ్మూ కశ్మీర్ లో 5, హిమాచల్ ప్రదేశ్ 4, ఉత్తరాఖండ్ 4, పంజాబ్ లో ఒకటి, హర్యానా 6, రాజస్థాన్ 11, బిహార్ 6, అరుణాచల్ ప్రదేశ్ లో ఒకటి, అసోం 8, మణిపూర్ ఒకటి, జార్ఖండ్ 2, ఒడిశా 4, ఏపీ లో ఒకటి, తమిళనాడు 2, తెలంగాణ 4, కేరళ 2, కర్నాటక 7, మహారాష్ట్రలో 11 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్న పత్రాలు కూడా లీకయ్యాయి.

2014 నుంచి ఇప్పటి వరకు 38 పేపర్ లీకేజీలు జరిగాయంటే ఎంత సమర్థవంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది. ఇందులో ఈ మధ్యకాలంలో విన్పిస్తున్నది నీట్ 2026 పేపర్ లీకేజీ. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్ష కోసం 23 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. గెస్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు భవితవ్యం గందగోళంగా తయారై మళ్లీ పరీక్షలు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ గెస్ పేపర్ ను కనిష్టంగా రూ.30వేల నుంచి రూ. లక్షల వరకు డిమాండ్ ను బట్టి వేలం పెట్టి విక్రయించారు. నాగపూర్ కు చెందిన ఒక విద్యార్థి ఏకంగా రూ.28 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ లో సీజేపీ ఆధ్వర్యంలో పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం చలో పార్లమెంటుకు పిలువు నివ్వడంతో, పోలీసులు ఆందోళనకారులను నిలువరించేందుకు లాఠీ ఛార్జీ, టియ్ గ్యాస్ ప్రయోగించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దేశాన్ని మేమే కాపాడుతున్నామని, మేమే అసలు సిసలు దేశ భక్తులం అని చెప్పుకునే పార్టీ ఏలుబడిలో 2017 లో ఇండియన్ ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్ష పేపర్ లీకయ్యింది. 2016 లో నీట్ ఫేజ్ 1, ఫేజ్ 2 పేపర్లు కూడా లీక్ అయినా కేంద్రం కఠిన చట్టాలు చేయకుండా తాత్సారం చేస్తుండడం ఆందోళన కలిగించే అంశమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనంలో ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నది. 2019 లో తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలకు కారణమైన గ్లోబరీనీ టెక్నాలజీ (కో ఎంప్ట్ ఎడ్యుటెక్) సంస్థకు మూల్యాంకనం బాధ్యతను సీబీఎస్ఈ అప్పగించింది. 9.7 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో 3.8 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పాతిక మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఆన్ స్క్రీన్ మార్కింగ్ మూల్యాంకనానికి తనదే బాధ్యత అని విద్యా శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ప్రకటించారు కాని రాజీనామా చేయలేదు. ప్రతిపక్షాలు గొంతెత్తుతున్నా, దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తని విధంగా మౌనం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం గ్లోబరీనా టెక్నాలజీని బ్లాక్ లిస్టులో చేర్చగా, దాన్ని కో ఎంప్ట్ ఎడ్యుటెక్ గా మార్చి సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ కాంట్రాక్టు దక్కించుకున్నది. ఈ సంస్థకు ప్రయోజనం కలిగేలా సీబీఎస్ఈ తన టెండర్ నిబంధనలనే మార్చుకోవడం మూలంగా లక్షలాది మంది సీబీఎస్ విద్యార్థులను నిద్రలేని రాత్రులకు గురిచేసింది.

Latest News