Rajkot game zone fire | ప్రమాద స్థలిలో 2000 లీటర్ల పెట్రోల్!
32 మంది మృతికి కారణమైన గుజరాత్‌లోని రాజ్‌కోట్ టీఆర్పీ గేమ్‌జోన్ అగ్నిప్రమాదానికి దాని యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

ఎన్వోసీ లేకుండా నడుస్తున్న గేమ్‌జోన్
యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం
రాజ్‌కోట్ ఘటనపై ప్రాథమిక నివేదిక
రాజ్‌కోట్: 32 మంది మృతికి కారణమైన గుజరాత్‌లోని రాజ్‌కోట్ టీఆర్పీ గేమ్‌జోన్ అగ్నిప్రమాదానికి దాని యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో రెండు వేల లీటర్ల పెట్రోల్ స్టోర్ చేసి ఉన్నట్టు కనుగొన్నారు. తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా గేమ్‌జోన్‌ను నిర్వహించడం వల్లే భారీ ప్రమాదం చోటు చేసుకున్నది తేల్చారు. అంతేకాదు.. ఈ టీఆర్పీ గేమ్ జోన్‌ను ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) లేకుండా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పైగా దాదాపు నాలుగేళ్లుగా నివాస ప్రాంతాల మధ్య దీనిని కొనసాగిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
ఈ గేమ్ జోన్ షెడ్డు లాంటి ఒక దుర్బలమైన కట్టడంలో నిర్వహిస్తన్నారని, దానికి స్టెబిలిటీ సర్టిఫికెట్ ఉన్నదో లేదో కూడా తెలియడం లేదని సమాచారం. దీనిపై స్పందించేందుక్ ఆర్‌అడ్‌బీ అధికారులుగానీ, స్టెబిలిటీ సర్టిఫికెట్ జారీ చేయాల్సిన అధికారులు గానీ అందుబాటులోకి రాలేదని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. రైడ్ సర్టిఫికెట్ పొందటం ద్వారా ఈ గేమ్‌జోన్‌ను దాని నిర్వాహకులు మూడంతస్తులకు విస్తరించారని చెబుతున్నారు. అమ్యూజ్‌మెంట్ పార్క్ కోసం నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతులు సంపాదించినప్పటికీ.. అనేక భద్రతా అంశాలను గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది.
ప్రమాద స్థలంలో 2వేల లీటర్ల పెట్రోల్
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 2వేల లీటర్లకుపైగా పెట్రోల్ నిల్వ చేసిన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ భవనంలో వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా టైర్లను ఎక్కడపడితే అక్కడ పడేశారు. ఫలితంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గేమ్‌జోన్‌కు ఎన్వోసీ లేదని రాజ్‌కోట్ మేయర్ నయనా పెధాదియా చెప్పారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ లేకుండా ఇంత పెద్ద గేమ్‌జోన్‌ను ఎలా నిర్వహిస్తున్నారన్న విషయంలో దర్యాప్తు జరుపుతామని పెధాదియా తెలిపారు. ఈ విషయంపై రాజకీయం చేయడాన్ని అనుమతించబోమని అన్నారు. గేమ్‌జోన్ నుంచి బయటకు వచ్చేందుకు ఒక్కటే మార్గం ఉన్నదని ఎన్డీటీవీ పేర్కొన్నది.
ప్రవేశద్వారం వద్ద నిర్మాణం కూలిపోవడంతో చాలా మంది చిక్కుకుపోయరని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలం నుంచి 27 మృతదేహాలను వెలికితీశామని అదనపు కమిషనర్ వినాయక్ పటేల్ తెలిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని, వారి పరిస్థితి స్థిరంగా ఉన్నదని చెప్పారు. చనిపోయినవారి దేహాలు బొగ్గుల్లా మారిపోవడంతో డీఎన్‌ఏ నమూనాల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంపై గుజరాత్ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం ఈ కేసులో వాదనలు వింటామని తెలిపింది. ఇదిలాఉంటే.. మృతుల సంఖ్య 32కు పెరిగినట్టు అధికారులు తెలిపారు.