పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్-అమెరికా మధ్య పరస్పర సైనికదాడులు ఉదృతమవ్వడం గల్ఫ్ లో యుద్ద ఉద్రిక్తతలను తీవ్రం తరం చేయగా..యుద్దంతో సంబంధం లేని దేశాలపై యుద్ద ప్రభావం పడుతుంది. అమెరికా దాడులను నిరసిస్తూ..ఇరాన్ అమెరికా బలగాలకు ఆతిథ్యమిస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ సహా పలు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతుంది.లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో అమెరికా పశ్చిమాసిలోని ఒమన్ తీరంలో అనూహ్యంగా భారత నౌకపై మిస్సైల్ దాడికి పాల్పడటం కలకలం రేపింది. అమెరికా దాడిలో నౌక డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ లు దుర్మరణం చెందినట్లుగా కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దాడి సమయంలో నౌకలో 24మంది భారతీయులు ఉండగా…మిగతా 21మంది భారతీయులను ఒమన్ సైన్యం రక్షించింది. తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురు రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ట్యాంకర్ షిప్ పై కాల్పులు జరిపామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యపై ఆగ్రహం వ్యక్తంజేసింది.
పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపేయాలని… అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరగాలని పేర్కొంది. అంతేగాకుండా దిల్లీలో అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్‌ను పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. అంతకుముందు మూడు రోజుల క్రితం కూడా 24 మంది భారతీయులున్న మరో నౌకపై కూడా ఒమన్ తీరంలో అమెరికా నౌకాదళం దాడి చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు హర్మూజ్ మా ఆధీనంలో ఉందని, మా అనుమతులతో వాణిజ్య నౌకలు ముందుకెళ్లవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించగా..హర్మూజ్ మూసివేశామని, మా అనుమతులు లేకుండా ఎవరు సాహసించి ముందుకెళ్లినా దాడులు తప్పవంటూ ఇరాన్ హెచ్చరించింది. దీంతో పశ్చిమాసియా యుద్దం అంతా గందరగోళంగా,ఉద్రిక్తతలతో సాగుతుంది.
