72 Years Bihar Farmer Enters Bihar Elections | బీహార్ ఎన్నికల బరిలో 72ఏళ్ల రైతు.. గెలిస్తే ఉచిత విద్య అందిస్తానని హామీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో 72 ఏళ్ల రైతు రామ్ స్వార్థ్ ప్రసాద్ నిలిచారు. చేరియా బరియార్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన, గెలిస్తే ఉచిత విద్య అందిస్తానని, వ్యవసాయానికి పరిశ్రమ హోదా కల్పిస్తానని హామీ ఇచ్చారు.

విధాత : బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బేగుసరాయ్ కు చెందిన ఓ 72 సంవత్సరాల రైతు నామినేషన్ దాఖలు చేశారు. చేరియా బరియార్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యనున్నారు. బర కొడాబంద్పూర్ గ్రామానికి చెందిన రామ్ స్వార్థ్ ప్రసాద్, ప్రొటెస్ట్ సర్వ సమాజ్ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ వేశారు. రామ్ స్వార్థ్ తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తల కలిసి శుక్రవారం మంజౌల్ ఉపవిభాగాల కార్యాలయంలో తన అభ్యర్థిత్వాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా రామ్ స్వార్థ్ మాట్లాడుతూ, ప్రతీ చోటా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడం మా ప్రాధాన్యత అని అన్నారు. తాను గెలిస్తే విద్యను ఉచితంగా అందిస్తామని హామినిచ్చారు. ఆయన ప్రధాన వాగ్ధానాలలో వ్యవసాయానికి ఒక పరిశ్రమ స్థాయి ఇవ్వడం, విదేశీ వస్తువుల దిగుమతిని ఆపడం, స్థానిక ఉపాధిని పెంపొందించడానికి చిన్న పరిశ్రమలను స్థాపించడం ఉన్నాయి.
గౌరవం, జీవనోపాధి, స్థానిక సాధికారత అవసరముందని రామ్ స్వార్థ్ తెలిపారు. ‘మేము సమస్యలతో విసుగు చెంది.. వాటిని తట్టుకోలేక ఎన్నికల పోటీలోకి ప్రవేశించాం. నేను చెరియా బారియర్పూర్ లో అందరికంటే ఎక్కువ ఓట్లతో ఎన్నికల్లో గెలుస్తాను’ అని రామ్ స్వార్థ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, చెరియా బారియర్పూర్ నియోజకవర్గం బేగూసరాయిలోని ఏడు సీట్లలో ఒకటి గా ఉంది. నవంబర్ 6న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలు చేయడానికి శనివారం చివరి రోజు.