Aadhaar | ఆధార్‌ వల్ల భారత్​లో ఏటా రూ. 90 వేల కోట్ల ఆదా : బీసీజీ నివేదిక

ఆధార్ ఆధారిత ధృవీకరణ, డీబీటీ విధానం అమలుతో భారత్‌లో ఏటా రూ. 90 వేల కోట్ల ప్రజాధనం ఆదా అవుతోందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక వెల్లడించింది. 12.7 శాతం నకిలీ లబ్ధిదారుల ఏరివేతతో సంక్షేమ పథకాలు నేరుగా అసలైనవారికే చేరుతున్నాయని పేర్కొంది.

Aadhaar | ఆధార్‌ వల్ల భారత్​లో ఏటా రూ. 90 వేల కోట్ల ఆదా : బీసీజీ నివేదిక

Aadhaar Authentication Saves $10 Billion Annually, Cuts 12.7% Fake Beneficiaries: BCG Report

  • 12.7 శాతం నకిలీ లబ్ధిదారుల ఏరివేత

(విధాత నేషనల్​ డెస్క్​)

దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేయడం వల్ల ప్రజాధన దుర్వినియోగం గణనీయంగా తగ్గిందని తాజా నివేదిక వెల్లడించింది. ఈ విధానం ద్వారా ప్రతి ఏడాది సుమారు 10 బిలియన్ యూఎస్ డాలర్ల (89,500 కోట్ల రూపాయలు)ప్రజాధనం ఆదా అవుతోందని Boston Consulting Group (బీసీజీ) తన నివేదికలో పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 28 లక్షల కోట్ల రూపాయలు పక్కదారి

ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలపై సుమారు 21 ట్రిలియన్ యూఎస్ డాలర్లు(సుమారు 1.87 కోట్ల కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తుండగా, అందులో దాదాపు 3 ట్రిలియన్ డాలర్లు(27.6 లక్షల కోట్ల రూపాయలు) అనర్హులకు చేరుతున్నాయని బీసీజీ అంచనా వేసింది. అయితే భారత్‌లో ఆధార్ ధృవీకరణను కచ్చితంగా అమలు చేయడం వల్ల 12.7 శాతం వరకు బోగస్ లబ్ధిదారులను గుర్తించి ఏరివేయడం సాధ్యమైందని నివేదిక వెల్లడించింది.

భారతదేశంలో రేషన్ సరుకులు, సామాజిక పింఛన్లు, ఎల్‌పీజీ సబ్సిడీలు, గ్రామీణ ఉపాధి పథకం వేతనాలు, ఎరువుల సబ్సిడీలకు ఆధార్ ఆధారిత ధృవీకరణను అమలు చేయడం ద్వారా మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు చేరుతోందని పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వంపై ఉన్న వ్యయభారం కూడా తగ్గుతోందని వివరించింది.

డిబిటీ విధానంతో ప్రభుత్వాలపై పెరిగిన నమ్మకం

ఆధార్ కార్డుతో వేలిముద్ర స్కానర్‌పై బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తున్న లబ్ధిదారు

ప్రత్యక్ష నగదు బదిలీ (Direct Benefit Transfer) విధానం ద్వారా సంక్షేమ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో, ఒకే వ్యక్తికి రెండుసార్లు చెల్లింపులు జరగకుండా అడ్డుకట్ట పడిందని నివేదిక పేర్కొంది. ఈ కారణంగా భారత్‌లో ప్రతి ఏడాది సుమారు 10 బిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు 90 వేల కోట్ల రూపాయలు) ఆదా అవుతోందని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసినట్లు బీసీజీ వెల్లడించింది.

ప్రపంచంలోనే సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న అతిపెద్ద దేశంగా భారత్ నిలుస్తోందని, ఆధార్ నంబర్ వినియోగం ద్వారా అనేక అక్రమాలకు చెక్ పడుతోందని నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఈ విషయంలో ఉదాహరణలుగా నిలుస్తున్నాయని తెలిపింది. ప్రజాసేవల్లో డిజిటల్ సర్వీసుల అమలులో భారత్ ముందంజలో ఉందని పేర్కొంది.

ఇదే సమయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో సంక్షేమ పథకాల అమలులో దుబారా మరింతగా తగ్గుముఖం పట్టిందని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ సంస్థలపై ప్రజల్లో నమ్మకం పెరగడానికి ఇది దోహదపడుతోందని పేర్కొంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.3.7 లక్షల కోట్లకు పైగా నగదు జమ చేసినట్లు నివేదిక గుర్తుచేసింది. అలాగే ఈ-ఇన్వాయిస్(E-Invoice), ఈ-వే బిల్(E-Waybill) విధానాల ద్వారా పన్నుల వసూళ్లు పెరుగుతున్నాయని, పన్ను రేట్లు పెంచకుండానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంచుకుంటూ ద్రవ్యలోటును నియంత్రించగలుగుతున్నాయని బీసీజీ స్పష్టం చేసింది.