విధాత : అమర్నాథ్ మంచు శివలింగం సందర్శన యాత్ర శివనామస్మరణల మధ్య ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన మొదటిరోజే భారీ వర్షం కురియడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వర్షం నీటికి కొండ మార్గాలు జారుడుగా మారడంతో పైకి వెళ్లేందుకు భక్తులు అవస్థలు పడ్డారు. అయితే భక్తులు ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగం దర్శనం కోసం హరహర మహదేవ..శంభో శంకర నినాదాలతో సాహసోపేతంగా ముందుకుసాగుతున్నారు. వేలాది మంది శివభక్తులు, పహల్గామ్ బేస్ క్యాంపుల నుంచి బాబా బర్ఫానీ దర్శనం కోసం ప్రయాణం మొదలుపెట్టారు. తొలి రోజే 10 వేల మందికి పైగా యాత్రికులు యాత్రలో పాల్గొన్నారు.
రెండు మార్గాలలో కొనసాగుతున్న యాత్ర
భద్రతా బలగాలు, సహాయక బృందాలు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో అప్రమత్తతతో వ్యవహరిస్తూ భక్తులకు సాయం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ భక్తులు ముందుకు సాగాలని, అధికారుల సూచనలు పాటించాలని యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. 57 రోజుల పాటు ఆగస్టు 28 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొననున్నారు. ఈ యాత్ర కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి. జమ్మూకశ్మీర్‌లోని దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్‌నాథ్ గుహకు భక్తులు రెండు మార్గాల ద్వారా అమర్‌నాథ్ గుహకు చేరుకుంటారు. అందులో ఒకటి 48 కిలోమీటర్ల నున్వాన్ – పహల్గామ్ మార్గం, మరొకటి 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగుతోంది. బల్తాల్ మార్గంలో వెళ్లే భక్తులు ముందుగా బాబా బర్ఫానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండగా, పహల్గామ్ మార్గంలో వెళ్లే యాత్రికులు మరుసటి రోజు దర్శనం పొందనున్నారు.
యాత్రికులకు ప్రధాని మోదీ ఐదు సంకల్పాలు తీసుకోవాలని పిలుపు
ప్రధాని నరేంద్ర మోడీ అమర్‌నాథ్ యాత్రికులకు ప్రత్యేక లేఖ రాస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రతి భక్తుడు ఐదు సంకల్పాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. యాత్రా మార్గంలో పరిశుభ్రతను కాపాడుతూ, స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. అధికారులు జారీ చేసే సూచనలు, ట్రాఫిక్ నియమాలు, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని కోరారు. వర్షాలు, జారుడు మార్గాలు, చలి వంటి పరిస్థితులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వోకల్ ఫర్ లోకల్’ భావనతో యాత్ర ఖర్చులో కనీసం 10 శాతం స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి వినియోగించాలని పిలుపునిచ్చారు. దీంతో జమ్మూ-కాశ్మీర్ ప్రజల జీవనోపాధికి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. యాత్ర ముగిసే రోజు రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరుడు లేదా సోదరికి ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలని, ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని సూచించారు. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ, అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. బాబా అమర్‌నాథ్ ఆశీస్సులు ప్రతి భక్తుడిపై ఉండాలని ఆకాంక్షించారు. యాత్ర భక్తులకు నూతన శక్తి, ఆధ్యాత్మిక చైతన్యం అందించాలని, “మీ యాత్ర సురక్షితంగా, శుభప్రదంగా సాగాలి” అంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
