Army Chief General Upendra Dwivedi : అసలు సినిమా ముందుంది.. పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, పాక్ నుంచి ఎలాంటి దాడి వచ్చినా ఘాటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధమై ఉందని ఆర్మీ చీఫ్ ద్వివేది హెచ్చరిక జారీ చేశారు.
పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడి ఎదురైనా ఘాటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. మే నెలలో నాలుగు రోజులు జరిగిన ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా మొదలు కాలేదని పాకిస్తాన్ కు ఆయన హెచ్చరిక జారీ చేశారు. నవంబర్ 27–28 తేదీల్లో జరగనున్న చాణక్య డిఫెన్స్ డైలాగ్‌కు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ద్వివేదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో మేము చూపింది కేవలం ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారినా, పాక్ మళ్లీ అవకాశం ఇస్తే బాధ్యతాయుత దేశం ఎలా ప్రవర్తించాలో మళ్లీ బోధిస్తాం’ అని ద్వివేది స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ శక్తినైనా భారత సైన్యం సమానంగా చూస్తుందని ఆయన హెచ్చరించారు.
ఉగ్రవాదం, దానిని ప్రోత్సహించే వారు ఒక్కటే.. శాంతిని అనుసరించాలి. లేదంటే చర్యలు తప్పవన్నారు. భారత్ డిఫెన్స్ శక్తి బలపడుతోందని, శత్రువులు కొత్త పద్ధతులతో దాడులు చేసేందుకు ప్రయత్నించినా భారత ప్రతిస్పందనపై వారికి స్పష్టమైన అవగాహన ఉందని ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్ నుండి మూడు కీలక పాఠాలు నేర్చుకున్నామని ఆర్మీ చీఫ్ తెలిపారు. వాటిలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం. మూడు దళాల సమన్వయంతో యుద్ధం చేయడం. సుదీర్ఘ యుద్ధాలకు సిద్ధంగా ఉండడం వంటివి ఉన్నాయన్నారు.
‘ఈరోజుల్లో యుద్ధం బహుముఖ రంగాల్లో సాగుతోంది. సైన్యం ఒంటరిగా యుద్ధం చేసే కాలం ప్రస్తుతం లేదు. రానున్న రోజుల్లో 88 గంటలు కాదు… నాలుగు నెలలు, నాలుగు సంవత్సరాలు కూడా యుద్ధం సాగవచ్చు. అందుకు సిద్ధం కావాలి’ అని ఆర్మీ చీఫ్ ద్వివేదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ 88 గంటల పాటు కొనసాగింది. పీఓకేలోని ఉగ్ర, మిలిటరీ సౌకర్యాలపై యుద్ధ విమానాలు, క్షిపణులు, ఆర్మీ డ్రోన్లు, భారీ ఆయుధాలో భారత ఆర్మీ దాడులు చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram