8 గంటల శ్రమ అనంతరం తల్లిని చేరిన గున్న ఏనుగు

గున్న ఏనుగులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.. ఏ ఆట ఆడుకుంటూ వెళ్లిందో.. ఓ గున్న ఏనుగు భారీ ఇసుక గోతిలో పడిపోయింది

8 గంటల శ్రమ అనంతరం తల్లిని చేరిన గున్న ఏనుగు

వీడియో క్లిప్‌లు షేర్‌ చేసిన ఐఏఎస్‌ అధికారి

గున్న ఏనుగులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.. ఏ ఆట ఆడుకుంటూ వెళ్లిందో.. ఓ గున్న ఏనుగు భారీ ఇసుక గోతిలో పడిపోయింది. ఇక దాని యాతన వర్ణనాతీతం. ఈ విషయం తెలిసిన అటవీ అధికారులు.. 8 గంటలపాటు శ్రమించి.. ఆ గున్న ఏనుగును గోతిలోంచి బయటకు తీసి.. తల్లివద్దకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ఐఏఎస్‌ అధికారి సుప్రియా సాహు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా.. రెస్క్యూ బృందానికి అభినందనలు వెల్లువెత్తాయి.

ఈ ఘటన తమిళనాడులోని నీలగిరి అడవుల్లో గుడలూరు డివిజన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. ‘తమిళనాడులో ఓ గున్న ఏనుగును రక్షించి, తల్లి చెంతకు చేర్చిన సంతోషకర వార్త ఇప్పుడే తెలిసింది. నీలగిరి అడవుల్లోని గుడలూరు ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలో ఓ వ్యవసాయ భూమిలోని 30 అడుగుల లోతున్న ఇసుక గోతిలో పడిపోయిన గున్న ఏనుగును అటవీ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు’ అని సుప్రియ సాహు పోస్ట్ చేశారు.

ఆ గున్న ఏనుగును బయటకు తీయడానికి అది పైకి ఎక్కేందుకు అనువుగా ఏటావాలుగా గోతిని తవ్వారు. దాదాపు 8 గంటలపాటు రెస్క్యూ బృందం ఇందుకోసం తీవ్రంగా శ్రమించింది. తన ఇతర పిల్లలతో కలిసి తల్లి ఏనుగు ఆ గొయ్యి పక్కనే నిలబడి.. తన బిడ్డకోసం ఎదురుచూసింది. అటవీశాఖ సిబ్బంది పైకి ఎక్కేందుకు వీలుకల్పించడంతో ఎట్టకేలకు బయటకు వచ్చి.. తన తల్లి వద్దకు పరుగులు తీసింది. ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన గుడలూరు డీఎఫ్‌వో వెంగటేశ్‌ ప్రభు, ఆయన 40 మంది సభ్యులు తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రమించి.. తల్లీపిల్లలను కలిపారు. ఈ పోస్టుకు అనేక మంది స్పందిస్తూ రెస్క్యూ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు.