agri marketing policy । వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన ఫ్రేమ్‌వర్క్ ముసాయిదాను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదిత ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లిన పక్షంలో మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో నిర్వహించిన ఉద్యమాన్ని మించిన పోరాటం తప్పదని హెచ్చరించాయి. ఈ విషయంలో రైతు సంఘాల అభిప్రాయాలను తీసుకునేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియన్ నిర్వహించిన సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు ఏకకంఠంతో స్పందించారు. సంయుక్త కిసాన్ మోర్చా (పొలిటికల్) అనుబంధంగా ఉన్న 32 రైతు సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ విధానాన్ని అమల్లోకి తెస్తే 2020 నాటి ఆందోళనకు మించిన స్థాయిలో పోరాటం ఉంటుందనే విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్టు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన భారతి కిసాన్ యూనియన్ నేత బల్బీర్ సింగ్ రజేవాల్ చెప్పారు. కొత్త విధానం ద్వారా మార్కెటింగ్‌ను కార్పొరేట్ గద్దలకు అప్పగించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. వ్యవసాయ మార్కెటింగ్‌ను ప్రయివేటీకరించడాన్ని తాము అనుమతించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. గతంలో కాకుండా ఇప్పుడు తాము దేశవ్యాప్తంగా సంఘటితంగా ఉన్నామని, గతంలో భారీ ఆందోళనను నిర్వహించి ఉన్నామని ఆయన అన్నారు.
ఆహార ధాన్యాల నిల్వకు సిలోస్ (సిలిండర్ ఆకారంలో ఉండే నిల్వ వ్యవస్థలు) నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ.. అవి ప్రైవేటు రంగంలో కాకుండా.. ప్రభుత్వ రంగంలో ఉండాలని రజేవాల్ తేల్చి చెప్పారు. వ్యవసాయం, మార్కెటింగ్ అనేవి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలని తాము కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో గుర్తు చేశామని అన్నారు. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా రాష్ట్రాల హక్కులను కేంద్రం విస్మరిస్తున్నదని విమర్శించారు. కేంద్రం రూపొందించిన ముసాయిదా పత్రాన్ని పంజాబ్ అసెంబ్లీ తిరస్కరిస్తూ తీర్మానం చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం విధానాన్ని ఆమోదిస్తే పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆందోళనలు నిర్వహించక తప్పదని చెప్పారు. కేంద్రం గతంలో ఉపసంహరించుకున్న మూడు వ్యవసాయ చట్టాల్లోని అంశాలను దొడ్డిదారిలో ఈ ముసాయిదా విధానం ద్వారా ముందుకు తీసుకు వచ్చేందుకు కుట్ర జరుగుతున్నదని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.