Rahul Gandhi | ఎన్నికల్లో గెలవడానికి ఏ డ్రామాకైనా మోదీ సిద్ధం : రాహుల్‌

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం ఆయన డ్యాన్స్‌ చేయడానికైనా సిద్ధపడతారని సెటైర్‌ వేశారు.

  • By: TAAZ |    national |    Published on : Oct 29, 2025 4:33 PM IST
Rahul Gandhi | ఎన్నికల్లో గెలవడానికి ఏ డ్రామాకైనా మోదీ సిద్ధం : రాహుల్‌

Rahul Gandhi | ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఎలాంటి డ్రామాలైనా ఆడుతారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ముజఫర్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. ‘నరేంద్రమోదీజీ.. ఎన్నికల్లో గెలవడానికి ఈ డ్రామా ఆడండి.. అని మీరు అంటే ఆయన చేస్తారు’ అని రాహుల్‌ అన్నారు. ‘మీరు స్టేజ్‌పైకి వచ్చి డాన్స్‌ చేస్తే మీకు ఓటేస్తాం అని మీరు అంటే.. ఆయన డాన్స్‌ వేస్తారు’ అని సెటైర్‌ వేశారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపైనా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరుకే నితీశ్‌ కుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అని.. నిజానికి రిమోట్‌ కంట్రోల్‌ మాత్రం బీజేపీ చేతిలో ఉన్నదని అన్నారు. ‘నాకంటే ముందు మాట్లాడిన తేజస్వి యాదవ్‌తో నేను ఏకీభవిస్తున్నాను.. బీహార్‌లో ప్రభుత్వం రిమోట్‌ కంట్రోల్‌ ఆధారంగా పనిచేస్తున్నది. దానికి నితీశ్‌ ముఖాన్ని వాడుకుంటున్నారు’ అని రాహుల్‌ అన్నారు. ‘ముగ్గురు లేదా నలుగురు దాన్ని నియంత్రిస్తుంటారు. బీజేపీ దానిని కంట్రోల్‌ చేస్తూ ఉంటుంది. వాళ్ల చేతిలో రిమోట్‌ కంట్రోల్స్‌ ఉన్నాయి. వారికి సామాజిక న్యాయంతో పనిలేదు. కుల గణన చేయాలని లోక్‌సభలో ప్రధాని ముందే చెప్పాను. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకం. వారు దానిని కోరుకోరు’ అని రాహుల్‌ ఆరోపించారు.

బీహార్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ కనిపించడం లేదని బీజేపీ శ్రేణులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ముజఫర్‌పూర్‌ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు బీజేపీ నాయకుడు అమిత్‌ మాలవీయ ఎక్స్‌లో స్పందిస్తూ.. రాహుల్‌ గాంధీ 59 రోజులుగా కనిపిండం లేదు.. అని పోస్ట్‌ పెట్టారు. రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ స్పందిస్తూ రాహుల్‌ను స్థానిక గూండాగా అభివర్ణించారు. ‘రాహుల్‌ గాంధీ స్థానిక గూండాలా మాట్లాడుతారు. దేశంలో, రాష్ట్రంలో మోదీకి ఓటు వేసిన ప్రతి పేదవారిని రాహుల్‌ బహిరంగంగానే అవమానించారు..’

సీఎం సీటు ఖాళీగా లేదు :అమిత్‌షా

బీహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. రాజకీయాల్లో ఏ కుర్చీలూ ఖాళీగా లేవని వ్యాఖ్యానించారు. నితీశ్‌ కుమార్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, దేశ ప్రధానిగా మోదీ కొనసాగుతారని అన్నారు. ‘సీఎం సీటు ఖాళీ లేదు.. పీఎం సీటూ ఖాళీ లేదు. ఇక్కడ నితీశ్‌ కుమార్‌ ఉన్నారు. అక్కడ ప్రధాని మోదీ ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. నవంబర్‌ 6, 11 తేదీల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్‌ 14న చేపడుతారు.