సుంచింద్రం కోనేటిలో వెలుగు చూసిన కాంస్య విగ్రహం
సుచీంద్రం తనుమలయన్ ఆలయం కోనేటిలో వెలుగుచూసిన చోళుల కాలానికి చెందిన కాంస్య విష్ణు విగ్రహం శిల్పకళ అద్భుతంగా ఆకట్టుకుంటోంది.
తాజాగా తమిళనాడులోని సుచింద్రం(తనుమలయన్ దేవాలయం) ఆలయ కోనేటి నుంచి వెలికితీసిన బహుభుజ హిందూ దేవత కాంస్య విగ్రహం అద్బుత కళారూపంతో ఆకట్టుకుంటుంది. ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ సహ వ్యవస్థాపకుడు, పురావస్తు పునరుద్ధరణ నిపుణుడైన రచయిత వీజే ఈ విగ్రహం వెలుగుచూసిన విషయాన్ని వెల్లడించారు. విదేశీయుల దండయాత్రల నుండి రక్షించడానికి శతాబ్దాల క్రితం దాచిపెట్టిన, నీటిలో మునిగిపోయిన ఆలయ విగ్రహాలను తిరిగి కనుగొనే ప్రయత్నాలలో భాగంగా ఈ విగ్రహం వెలుగుచూసిందని తెలిపారు. విష్ణువు రూపంలో కనిపిస్తున్న ఈ కాంస్య విగ్రహం బహుశా చోళుల కాలం నాటిదని భావిస్తున్నారు. అద్బుతంగా రూపొందించిబడిన ఈ కాంస్య విగ్రహం దక్షిణ భారత కాంస్య శిల్ప కళ నైపుణ్యాలకు నిదర్శనంగా కనబడుతుండటం విశేషం. ఈ ఆలయం ప్రాంగణంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో కోనేరు(తెప్పకుళం) నిర్మించబడి ఉంది.
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి 11-13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుచింద్రం పట్టణంలో ఉన్న పురాతన చారిత్రాత్మక హిందూ దేవాలయంగా సుచింద్రం ఆలయం ప్రసిద్ది.స్థాను (శివుడు), మాల (విష్ణువు), అయన్ (బ్రహ్మ) అనే త్రిమూర్తులను ఒకే రూపంలో కొలువుదీరిన విశిష్ట క్షేత్రంగా ఈ ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి ప్రధాన దైవం ఈ ముగ్గురికీ ప్రతీకగా నిలిచే స్వయంభూ లింగం. దీనినే తనుమలయన్ అని పిలుస్తారు. శైవులు, వైష్ణవులు ఇక్కడి దైవాన్ని కొలుస్తారు.
సుచింద్రం ఆలయం స్థల పురాణం
“సుచింద్రం” అనే పేరు “సుచి ఇంద్రం” నుండి వచ్చింది. దీని అర్థం దేవతల రాజు అయిన ఇంద్రుడు పవిత్రతను పొందిన ప్రదేశంగా చెబుతారు. పురాణం మేరకు అహల్య విషయంలో దుష్ప్రవర్తన కారణంగా గౌతమ మహర్షి శాపానికి గురైన ఇంద్రుడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇక్కడి ప్రధాన లింగం ఉన్న ప్రదేశంలో తపస్సు చేశాడు. అందుకు కృతజ్ఞతగా చెందిన ఇంద్రుడు ఇక్కడ త్రిమూర్తుల కోసం ఒక ఆలయాన్ని నిర్మించాడని కథనం.
మరొక పురాణం ప్రకారం.. అత్రి మహర్షి భార్య అనసూయ ప్రాతివత్యాన్ని త్రిమూర్తులు పరిక్షించేందుకు నిర్ణయిచుకుని భిక్షాటన చేసే సన్యాసుల రూపంలో ఆమె వద్దకు వస్తారు. ఈ సందర్బంగా వస్త్ర విహీనంగా వారిని సేవించేందుకు త్రిమూర్తులను ఆమె శిశువులుగా మార్చి వారికి సేవ చేసింది. అనసూయ ప్రాతివత్య మహిమను మెచ్చిన త్రిమూర్తులు ఆ తర్వాత వారు తమ నిజరూపాన్ని వెల్లడించి ఈ ప్రదేశం త్రిమూర్తి స్వరూపంగా పూజలందుకుంటుందని ఆభయమిచ్చినట్లుగా కథనం. రామాయణ కాలంలో హనుమంతుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడనిమరో కథనం కూడా చెబుతుంది.
చారిత్రక నేపథ్యం
సుచీంద్ర ఆలయం నిర్మాణం క్రీ.శ. 1200–1,500 కాలంలో జరిగి ఉండవచ్చని చరిత్ర కారుల అంచనా. ప్రస్తుత రాతి కట్టడం ప్రధానంగా 9వ శతాబ్దంలో చోళ రాజవంశం కాలంలో నిర్మించబడింది. ఇందులో తొలి,మధ్యయుగ చోళుల కాలం నాటి శాసనాలు ఉన్నాయి. వీటిలో మొదటి పరాంతక (క్రీ.శ. 907–950) కాలం నాటి రికార్డులు కూడా ఉన్నాయి. చేర, పాండ్య తర్వాతి పాలకుల కాలంలో కూడా నిర్మాణాలు జరిగినట్లుగా ఆధారాలు లభించాయి.17వ శతాబ్దంలో మధురై నాయక రాజులు (ముఖ్యంగా తిరుమలై నాయక్) కాలంలో ఆలయ ప్రధాన పునరుద్ధరణ పనులు అద్బుత శిల్పకళతో సాగినట్లుగా చరిత్రకారుల కథనం. ఆ తర్వాత ట్రావన్‌కోర్ మహారాజులు ఆలయాన్ని పర్యవేక్షించారు. వారు 1956లో తమిళనాడులో విలీనం అయ్యే వరకు ఈ ప్రాంతాన్ని (కన్యాకుమారితో సహా) పరిపాలించారు.1875లో మహారాజా అయిల్యం తిరునాల్ ఆలయాన్ని మరోసారి పునరుద్దరించారు. తమిళ,కేరళం ప్రభావాల మేళవింపుతో కూడిన సంస్కృతి ఈ ప్రాంతంలో విరాజిల్లినట్లుగా చరిత్ర వెల్లడిస్తుంది.
ఆలయ నిర్మాణ విశేషాలు
సుచీంద్రఆలయం నిర్మాణం తమిళ, కేరళం శైలుల మిశ్రమంతో కూడిన ద్రావిడ వాస్తు శిల్పాలతో నిర్మితమైంది. సుమారు 44 మీటర్ల (144 అడుగులు)ఎత్తు, 11 అంతస్తులతో కూడిన ఒక ఎత్తైన తూర్పు గోపురం, హిందూ దేవతల శిల్పాలతో కట్టబడింది. రామాయణ,మహాభారత దృశ్యాలను వర్ణించే 1,035కి పైగా స్తంభాలతో కూడిన ప్రసిద్ధ నాట్య మండపంతో సహా,ఆలయం అంతటా క్లిష్టమైన రాతి చెక్కడాలు, శిల్పాలతో నిర్మించారు. ఒకే రాయి నుండి చెక్కబడిన సప్తస్వరాలు వినిపించే సంగీత స్తంభాలు సందర్శకులను ఆకర్షిస్తాయి.
ఒకే గ్రానైట్ శిల నుండి చెక్కబడినసుమారు 18–22 అడుగుల ఎత్తైన ఒక పెద్ద ఆంజనేయ (హనుమాన్) విగ్రహం ఆకట్టుకుంటుంది. దీనిని టిప్పు సుల్తాన్ దండయాత్రల సమయంలో దాచిపెట్టి..తరువాత తిరిగి వెతికి ప్రతిష్ఠించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
అస్సాం,కేరళం,పుదుచ్చేరిలో రేపు పోలింగ్ !
కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ నివేదిపై తీర్పు 22కు వాయిదా !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram