యూపీఐ యూజర్లకు ఆర్బీఐ బిగ్ షాక్ న్యూస్ అందించింది. UPI ట్రాన్సెక్షన్స్‌పై ఛార్జీలు తప్పవని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. డిజిటల్ పేమెంట్స్‌ను కొనసాగించాలంటే.. దానికి అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనన్నారు. ప్రస్తుతం కేంద్రం డిజిటల్ లావాదేవాల పెంపు కోసం UPI సేవలను సబ్సిడీలతో ప్రోత్సహిస్తుంది. అయితే డిజిటల్ పేమెంట్స్‌లో సర్వర్ ఖర్చులు.. సైబర్ సెక్యూరిటీకి భారీ ఖర్చు అవుతోందన్న మల్హోత్రా పేర్కొన్నారు. వ్యాపార సంస్థల UPI చెల్లింపులపై..మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే యోచనను ఆర్బీఐ చేస్తుంది. 2 వేలకుపైగా వ్యాపార UPI లావాదేవీలకు MDR విధించాలని ఆర్బీఐ ఆలోచిస్తుంది. MDR అమలు చేస్తే ఒక్కో లావాదేవీపై వినియోగదారుడిపైన సుమారు రూ.6 నుంచి రూ.10 వరకు ఛార్జీల భారం పడనుందని సమాచారం.
పార్లమెంటులో బిల్లుకు ఆమోదం..
భవిష్యత్తులో ఎంపిక చేసిన కొన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులపై.. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అని పిలిచే సేవా ఛార్జీలను విధించేందుకు వీలుగా చట్టపరమైన సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్, 2026ను ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గురువారం లోక్ సభ ఈ బిల్లుకు ఆమోదంతెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 నిబంధనలను సవరించడం ద్వారా.. బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థ ప్రొవైడర్లు ఎటువంటి ఛార్జీలు విధించకుండా అడ్డుకుంటున్న ప్రస్తుత చట్టపరమైన పరిమితులను తొలగించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. తాజా సవరణ ద్వారా కొన్ని రకాల యూపీఐ లావాదేవీలకు భవిష్యత్తులో ఎండీఆర్ విధించేలా చట్టపరమైన అడ్డంకిని తొలగించే అవకాశం ఏర్పడింది.
ఎవరిపై భారం…
ఈ ప్రతిపాదిత చట్టానికి ఆమోదం లభించినప్పటికి… యూపీఐ లావాదేవీలపై ఎంత ఛార్జీ విధించాలి, ఏ లావాదేవీలకు వర్తించాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలి వంటి అంశాలను బిల్లు ప్రస్తుతం నిర్దేశించలేదు. యూపీఐ వినియోగదారుల నుంచి నేరుగా ఫీజు వసూలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎంపిక చేసిన వ్యాపార చెల్లింపులపై ఎండీఆర్ విధించే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
అందువల్ల సాధారణ యూపీఐ వినియోగదారులకు ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పు ఉండదు. భవిష్యత్తులో ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్ణయించే నిబంధనల ఆధారంగానే నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపై ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులు, తక్కువ విలువైన చెల్లింపులకు రక్షణ కల్పిస్తూ ఛార్జీల విధానాన్ని రూపొందించాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.
అయితే భవిష్యత్తులో పెద్ద వ్యాపార సంస్థలకు చేసే రూ. 2 వేలు పైబడిన అధిక విలువ గల యూపీఐ లావాదేవీలపై మొదటి దశలో మర్చంట్ ఛార్జీలను విధించే అవకాశం ఉంది. అయితే ఈ ఛార్జీలను కేవలం వ్యాపారుల (మర్చంట్లు) పైనే విధిస్తారు తప్ప.. సాధారణ వినియోగదారుల (కస్టమర్ల) పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టమవుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంచనాల ప్రకారం.. రూ. 2 వేలు కనీస పరిమితి అనేది మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో కేవలం 5 శాతాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. కానీ, విలువ పరంగా చూస్తే ఇవి మొత్తం చెల్లింపుల విలువలో ఏకంగా 65 శాతంగా ఉండటం గమనార్హం.
ఈ నూతన ప్రతిపాదన అమలులోకి వచ్చినా.. సామాన్య ప్రజల రోజువారీ లావాదేవీలపై ఎలాంటి భారం పడదు. పాలు, కూరగాయలు, చిన్న కిరాణా సామాగ్రి కొనుగోళ్లు, ఆటో లేదా టాక్సీ ప్రయాణాలకు చేసే తక్కువ విలువ గల చెల్లింపులకు ఈ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. కాబట్టి చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. ఒక్క జూలై నెలలోనే యూపీఐ ద్వారా రూ. 29.9 లక్షల కోట్ల విలువైన 23.66 బిలియన్ల లావాదేవీలు జరిగిన తీరు డిజిటల్ లావాదేవిల ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచింది.
